ప్రణయ్ హత్య ఎలా జరిగిందంటే..
x

ప్రణయ్ హత్య ఎలా జరిగిందంటే..

దాదాపు ఎనిమిదేళ్ల పోటా ఈ కేసును విచారించిన న్యాయస్థానం 10 మార్చి 2025న తుది తీర్పు వెలువరించింది.


14 సెంబర్ 2018, ఆ రోజు మంగళవారం. వాతావరణం కాస్తంత చల్లగా ఉంది. రోడ్లు చాలా రష్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అదే రోజున ప్రెగ్నెంట్‌గా ఉన్న అమృత వెన్నునొప్పి అనడంతో తన తల్లిని వెంటబెట్టుకుని ప్రణయ్.. అమృతను మిర్యాలగూడలోని ఆసుపత్రికి చెకప్‌కు తీసుకెళ్లాడు. చెకప్ అనంతరం తన భార్య, తల్లితో కలిసి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. వారు బయటకు వచ్చీ రాగానే కొందరు దుండగులు పట్టపగలు నడిరోడ్డుపైనే ప్రణయ్‌పై దాడి చేశారు. సుభాష్ కుమార్ అనే వ్యక్తి కొడవలి తీసుకుని ప్రణయ్‌పై దాడి చేశాడు. ప్రణయ్ మరణించాడని నిర్ధారించుకున్న వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. తన కళ్లముందే భర్త మరణించడాన్ని అమృత వర్షిణి తట్టుకోలేకపోయింది. తండ్రి కావాల్సిన తన కుమారుడు విగతజీవి అయి పోడిపోయి ఉండటాన్ని చూడలేక ప్రణయ్ తల్లి అక్కడే కూలబడిపోయి కన్నీళ్లు ఆవిరయ్యేలా ఏడ్చింది. ఇంతటి కిరాతకానికి కారణం కులాంతర వివాహం. 14 సెప్టెంబర్ 2018న మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన ఆనాడు యావత్ దేశాన్ని షేక్ చేసింది. ప్రతి రాష్ట్రంలో ఈ హత్య గురించి చర్చలు జరిగాయి. మేధావులు సైతం దీనిని తప్పుబట్టారు. పరువు హత్యగా దేశమంతా చర్చల్లో నిలిచిన ఈ కేసులో తాజాగా కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణశిక్ష విధించింది.

ప్రణయ్.. 23 ఏళ్ల దిళిత యువకుడు. అతడు అమృత తొమ్మిది, పదో తరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఇంజినీరింగ్ చేస్తూ మధ్యలోనే చదువును ఆపేశారు. అయితే అమృతను పెళ్ళి చేసుకోవాలని ప్రణయ్ అనుకున్నాడు. అందుకు అమృత కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ వారి వివాహానికి అమృత తండ్రి మారుతీరావు అంగీకరించలేదు. పైగా తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి మారుతీరావు.. ప్రణయ్‌ని బెదిరించారు. 2018 జనవరిలో అమృత ఇంటి నుంచి వెళ్లిపోయి జనవరి 31న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రణయ్‌ని పెళ్ళి చేసుకుంది.

ఈ విషయాన్ని మారుతీరావు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ప్రణయ్ అంతుచూడాలనుకున్నారు. అనుకున్నట్లే ప్రణయ్‌ని హతం చేయడానికి ప్లాన్ చేశాడు. అందుకోసం బీహార్‌కు చెందిన సుభాష్ కుమార్‌కు సుపారీ ఇచ్చి 14 సెప్టెంబర్ 2018న ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఆ రోజున ప్రెగ్నెస్సీ కారణంగా అమృతకు వెన్నునొప్పి కావడంతో తల్లిని, భార్యను తీసుకుని ప్రణయ్ ఆసుపత్రికి వెళ్లాడు. అదే మంచి అదునుగా భావించిన సుభాష్ కుమార్.. వేటకొడవలితో ప్రణయ్‌పై దాడి చేసి హతమార్చాడు. ఈ దాడిలో ప్రణయ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.

ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్‌ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితులను గుర్తించారు. ఆ సమయంలో మిర్యాలగూడ కమిషనర్‌గా ఉన్న ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. స్వయంగా ఈ కేసును టేకప్ చేశారు. దర్యాప్తులో వేగం పెంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.

‘‘సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్, ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరాల ఎవిడెన్స్.. ఇలా అన్ని రకాల ఆధారాలతో ప్రణయ్ హత్య కేసులో ఛార్జీషీటు దాఖలు చేశాం. దాదాపు పది సార్లు ఛార్జ్‌షీట్ మెరుగుపరిచి పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించాం’’ అని అప్పట్లో కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ ఛార్జ్‌షీట్‌లో ఏ1గా అమృత తండ్రి మారుతీరావును చేర్చారు. ఏ2గా సుభాష్ కుమార్‌ను పేర్కొన్నారు పోలీసులు.

మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్ హత్య జరిగిన కేసు నమోదైన కొన్ని రోజులకే అమృత తండ్రి మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 ఏప్రిల్‌లో మారుతీరావు సహా మరో ఇద్దరికి హైకోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో వారు విడుదలయ్యారు. 8 మార్చి 2020న హైదరాబాద్‌ ఖైరతాబాద్ చింతలబస్తీలోని ఆర్యవైశ్య భవన్ మూడో అంతస్తులోని రూమ్ నెంబర్ 306లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారుతీరావు గదిలో ఉండగా అతని డ్రైవర్ గది బయట ఉన్నాడు. ఆరోజు ఉదయాన్ని మారుతీరావు భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసిన.. ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో డ్రైవర్‌కు కాల్ చేశారామే. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు. మారుతీరావు విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. కేసుల ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. కాగా అమృతరావు ఆత్మహత్య చేసుకున్న స్థలంలో పోలీసులు ఓ నోట్ లభించింది. అందులో ‘గిరిజా నన్ను క్షమించు. అమృత అమ్మ దగ్గరికి రా’ అని రాసుంది.

అయితే తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై అమృతా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రణయ్‌కి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధగా ఉంది. ఆయనకు మరణశిక్ష, జీవితఖైదు మరేదైనా శిక్షను కోర్టు విధించి ఉంటే నేను సంతోషించేదాన్ని’’ అని అమృత వ్యాఖ్యానించింది.

అప్పటి నుంచి ఈకేసులో కోర్టులోనే ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల పోటా ఈ కేసును విచారించిన న్యాయస్థానం 10 మార్చి 2025న తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌కు మరణశిక్ష విధించింది. మిగిలిన ఏ3గా అస్గర్‌అలీ, ఏ4గా బారీ, ఏ5గా కరీం, ఏ6గా శ్రవణ్ కుమార్, ఏ7గా శివ, ఏ8గా నిజాంకు జీవిత ఖైదు విధించారు.

Read More
Next Story