Adani | రేవంత్‌కు అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు లంచమేనా?.. కేటీఆర్ అనుమానాలు..
అదానిపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. స్కిల్ వర్సిటీ కోసం సీఎం రేవంత్‌కు అదానీ ఇచ్చి రూ.100 కోట్లు లంచమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని(Goutham Adani)కి అమెరికా(America) కోర్టు ఒకటి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలు ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకోవడం కోసం లంచాలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, మరో సీనియన్ అధికారి వినీత్ జైన్‌పై కోర్డు నిందారోపణ చేసింది. అమెరికా ప్రాసెక్యూటర్లు చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ అంశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వవంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్(KTR). అదానీతో కాంగ్రెస్(Congress) చేసుకున్న అన్ని చీకటి ఒప్పందాలు వెలుగు చూడాలన్నారు. మూసీలో అదానీ వాటా ఎంతా అని కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీపై కూడా విమర్శలు చేశారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ(BJP)ల అనుబంధం దేశానికే అవమానమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్(KTR). అసలు వీరి మధ్య అనుమంధం ఏంటో తెలియాలని, తెలపాలని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అదానీ ముందుకు రావడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వాటి కోసం ఎంత ముట్టజెప్పారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎవరి వాటా ఎంతో..
‘‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో! ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు! తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి ! మీరు అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి! తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత?’’ అని ఆరోపణలు గుప్పించారు.
అదానికి రేవంత్ రెడ్ కార్పెట్
‘‘విద్యుత్ ఒప్పందాల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల అధికారులకు సుమారు రూ. 2100 కోట్ల లంచాల ఇవ్వజూపారు అన్న అరోపణల మీద ఒక అమెరికన్ కోర్టు గౌతం అదానీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
సంచలనం సృష్టిస్తున్న ఈ లంచాల కేసులో ఉన్న అయిదు రాష్ట్రాలు ఇవీ:
ఒడిషా
జమ్మూ కాశ్మీర్
తమిళనాడు
చత్తీస్ గఢ్
ఆంధ్రప్రదేశ్
కేసీఆర్ ఏనాడూ ఇటువంటి ఫ్రాడ్ కంపెనీలను దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డేమో అదానీకి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణను దోచిపెడుతున్నాడు’’ అని మండిపడ్డారు.
అదానీ అప్పుడే మాటిచ్చారు
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో తెలంగాణలో భారీగా పెట్టబడులు పెట్టడానికి అదానీ ఆసక్తి చూపారని, దాదాపు రూ.12,400 కోట్లు తెలంగాణలో వెచ్చించడానికి అదానీ ఓకే చెప్పారని గుర్తు చేశారు. దానీ గ్రీన్ ఎనర్జీ కోసం రూ.5వేల కోట్లు, అదాని కనెక్స్ డాటా సెంటర్స్‌కు రూ.5వేల కోట్లు, అంబుజా సిమెంట్స్‌కు రూ.1,400 కోట్లు, అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌కు రూ.1వెయ్యి కోట్లు వెచ్చించడానికి అదానీ ఓకే చెప్పారు. వీటన్నింటికి సంబంధించి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ దావోస్ వేదికగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి కూడా తాను సహాయం చేస్తానని అదానీ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల సీఎం రేవంత్‌కు అదానీ రూ.100 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా కోర్టు చేసిన సంచలన ఆరోపణల మధ్య నాదో సందేహం. అప్పుడు సీఎం రేవంత్‌కు అదానీ ఇచ్చి ఆ రూ.100 కోట్లు బహుమతా? లేదా లంచమా? లేదంటా ఇది ఇచ్చే మొత్తంలో అతి తక్కువ మాత్రమేనా?’’ అని ప్రశ్నలు గుప్పించారు కేటీఆర్. మరి కేటీఆర్ ఆరోపణలపై రేవంత్ సర్కార్ ఏ రేంజ్‌లో స్పందిస్తుందో చూడాలి.