‘తెలంగాణలో మోదీ ఇచ్చిన ఉద్యోగాలు రెండే’
x

‘తెలంగాణలో మోదీ ఇచ్చిన ఉద్యోగాలు రెండే’

ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల సాధనకు దావోస్ సదస్సులో పాల్గొని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని రేవంత్ తెలిపారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఉన్నారని, వారు రాష్ట్రానికి కేంద్రం నుంచి నయాపైసా అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. వారి వల్ల తెలంగాణకు దమ్మిడీ ఆదాయం లేదని, వాళ్లు కేంద్రం నుంచి సాధించింది ఏంటని విమర్శించారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. మంచిర్యాలలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం ఈ వ్యాఖ్యాలు చేశారు. ‘‘11ఏళ్ల తన పాలనలో ప్రధాని మోదీ.. తెలంగాణకు ఏం చేశారు? ఏం ఇచ్చారు? 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడానికి చెప్పారు కానీ.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. వారి లెక్క ప్రకారం చూసుకుంటేనే.. ఇప్పటి వరకు వాళ్లు 24 కోట్ల ఉద్యోగాలివ్వాలి. ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు రెండే రెండు. ఒకటి కిషన్ రెడ్డికి, ఇంకొకటి బండి సంజయ్‌కు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా పీఎం మోదీ. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు’’ అని అన్నారు.

‘‘మంచిర్యాల ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. మీరు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవకులుగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ గారు లభించారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం BRS అభ్యర్థులను నిలబెట్టలేదు. BRS నాయకులు హరీష్ రావు, కేటీఆర్, కవిత కాంగ్రెస్ ను ఓడించమంటున్నారు. ఎవరికి ఓటు వేయమని BRS నాయకులు కోరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరికి ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తారో తెలపాలి. లోకసభ ఎన్నికల్లో BRS కి 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతే 8 చోట్ల బీజేపీ గెలిచింది. ఇందులో ఉన్న మతలబు ఏమిటి. బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణకు ఏం సాధించింది. తెలంగాణ నుంచి బీజేపీ కి ఎంపీలు కావాలి… మా ఓట్లతో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కావాలి కానీ తెలంగాణకు మీరు ఏం చేశారు?’’ అని సీఎం ప్రశ్నించారు.

‘‘ప్రాణహిత చేవెళ్లను చేపడితే ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. మహారాష్ట్ర అనుమతులు ఇవ్వలేదన్నారు. అనుమతులు బీజేపీ ఎందుకు ఇప్పించలేదు. మేము ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలు 55 వేలు ఇచ్చాం. మేము ఉద్యోగాలు ఇవ్వడం నిజం కాకపోతే మీరు మాకు ఓటు వేయవద్దు. మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే నరేంద్ర మోదీ తెలంగాణకు 2 ఉద్యోగాలు ఇచ్చారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి మాత్రమే 2 ఉద్యోగాలు నరేంద్ర మోదీ ఇచ్చారు. నైపుణ్యాల పెంపునకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాం. రాబోయే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. చిన్న దేశం దక్షిణ కొరియా లోని ఒక్క యూనివర్సిటీ నుంచి పాల్గొన్న ఒక్క మహిళ 3 గోల్డ్ మోడల్స్ సాధిస్తే 100 కోట్ల పైన జనాభా ఉన్న మనదేశం ఎన్ని గెలిచింది’’ అని అన్నారు.

‘‘ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల సాధనకు దావోస్ సదస్సులో పాల్గొని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ రోజు కూడా ఒక సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించి వచ్చా. మా ప్రభుత్వం 25 లక్షల కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. రుణమాఫీ అయిన కుటుంబాల వారు నరేంద్ర రెడ్డికి ఓటు వేయాలి. 3 ఎకరాల వరకు రైతు భరోసా వేశాం. మార్చి 31 వరకు రైతు భరోసా పూర్తి చేస్తాం. అక్కాచెల్లెళ్లు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 200 లోపు యూనిట్ల విద్యుత్ ఇళ్లకు ఉచితంగా వచ్చే వారు నరేందర్ రెడ్డి కి ఓటు వేయండి’’ అని తెలిపారు.

Read More
Next Story