మహేందర్‌కు చీఫ్ విప్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం: హరీష్
x

మహేందర్‌కు చీఫ్ విప్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం: హరీష్

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమేనంటూ దుయ్యబట్టారు.


ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమేనంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందంటూ మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌గా సొంత పార్టీ నేతను నియమించుకోలేని దుర్భర స్థితిలో కాంగ్రెస్ ఉందంటూ చురకలంటించారు మాజీ మంత్రి. అసలు మండలి చీఫ్ విప్‌గా మహేందర్‌రెడ్డిని ఎలా నియమించారని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అందుకు మహేందర్ రెడ్డికి ప్రభుత్వ విప్ పదవి అందించడం ఒక ఉదాహరణ అని హరీస్ రావు వివరించారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా కాంగ్రెస్ ఇదే తరహాలో వ్యవహరించిందన్నారు. మహేందర్ రెడ్డి ఏ పార్టీ తరపున గెలిచారో కాంగ్రెస్ మరిచిందా అని అడిగారు. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీలోకి చేరిన నేతలకు కీలక పదవిని ఎలా ఇస్తారని, ఇది రాజ్యంగ విరుద్ధమన్న విషయం కాంగ్రెస్ తెలియదా అంటూ విమర్శలు వర్షం కురిపించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బదులిచ్చి తీరాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లో అనర్హత పిటిషన్

‘‘బీఆర్ఎస్ జెండాపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు? ఆయనపై అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమించడం అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చింది. దీన్ని కూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తాం. ఎమ్మెల్సీ హోదాలోనే మహేందర్.. ఆగస్టు 15, సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగరేశారు. మార్చి 15 నుంచే ప్రభుత్వ విప్‌గా నియమితులైనట్లు ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై సీఎస్‌కు లేఖ రాస్తాం. గవర్నర్, డీవోపీటీకి కూడా లేఖ రాస్తాం. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్.. గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని మండిపడ్డారు హరీష్ రావు.

ఫిరాయింపు నేతలతోనే వివాదాలు

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత పార్టీలు మార్చేసిన ఫిరాయింపు నేతల వ్యవహారాలు వివాదాలుగా మారుతున్నాయి. తాజాగా పట్నంను రేవంత్ రెడ్డి మండలిలో విప్ గా నియమించటం వివాదంగా మారింది. వివాదం ఎందుకంటే ఇప్పటికే మరో ఫిరయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని రేవంత్ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి(పీఏసీ)ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. రేవంత్ ప్రభుత్వం గాంధీని పీఏసీ ఛైర్మన్ చేయటంతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కొద్దిరోజుల క్రితం ఎంతటి గోలచేశారో అందరూ చూసిందే. పీఏసీ ఛైర్మన్ పదవిలో ప్రభుత్వం మామూలుగా అయితే ప్రతిపక్షం ఎంఎల్ఏని నియమిస్తుంది. తన నియామకంపై గాంధి మాట్లాడుతు తాను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే పీఏసీ ఛైర్మన్ గా నియమించినట్లు ప్రకటించారు. దాంతో కారుపార్టీ ఎంఎల్ఏలకి మండిపోయింది. దాని తర్వాతనే బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎంఎల్ఏని టార్గెట్ చేస్తు నానా గోలచేశారు. అయితే గాంధీ చెప్పింది ఒక విధంగా నిజమనే చెప్పాలి. ఎలాగంటే అసెంబ్లీ రికార్డుల ప్రకారం సాంకేతికంగా గాంధీ బీఆర్ఎస్ ఎంఎల్ఏనే. అయితే అంటకాగుతున్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే. ఇదే పద్దతిని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ కూడా ప్రాక్టీస్ లో పెట్టారు. కాంగ్రెస్, టీడీపీ తరపున 2014-23 మధ్య గెలిచిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో చాలామందిని బీఆర్ఎస్ లోకి లాక్కున్న విషయం తెలిసిందే.

Read More
Next Story