వీధి కుక్కల దాడులపై హైకోర్టు ఆగ్రహం,నియంత్రణకు రాష్ట్ర కమిటీ
తెలంగాణలో వీధికుక్కల వరుస దాడులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పిల్లల ప్రాణాలు తీస్తున్న వీధికుక్కల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.
తెలంగాణలోని సంగారెడ్డి, కరీంనగర్ లలో మళ్లీ బుధవారం వీధి కుక్కలు పిల్లలపై దాడి చేసి కరిచాయి.వీధి కుక్కల దాడుల వరుస సంఘటనతో రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల మరణాలకు దారితీసే వీధికుక్కల దాడులను అరికట్టేందుకు వారంరోజుల్లోగా స్టేట్ మానిటరీ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది.
సంగారెడ్డిలో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి
సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్‌లో బుధవారం ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది.బాలుడు షాజన్ పాషా తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్కలు అతనిపై దాడి చేశాయి.స్థానికులు వచ్చి బాలుడి ప్రాణాలను కాపాడారు.పటాన్‌చెరులో ఒక్క జూన్ నెలలోనే 96 వీధికుక్కలు దాడి చేశాయి.పాషా శరీరమంతా పలు గాయాలయ్యాయి. దీంతో బాలుడిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు
సంగారెడ్డి కలెక్టర్ ఆగ్రహం
సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కలు మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన కరచిన ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టరు క్రాంతి వల్లూరి గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో వీధికుక్కలు కనిపించకూడదని కలెక్టరు జారీ చేసిన ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి కుక్కలను పట్టుకొని నర్సాపూర్ అడవుల్లో వదిలి పెట్టారు.
- గత ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించాడు.
- తాజాగా జూన్ 28వతేదీన పటాన్ చెరులో విశాల్ అనే ఆరేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయాడు.
- కరీంనగర్ గుంజ్ మార్కెట్ ప్రాంతంలో బుధవారం వీధికుక్కల దాడిలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులతో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వీధికుక్కలు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న వారిపై దాడి చేశాయి.స్థానికులు కుక్కలను తరిమి కొట్టి గాయపడిన వారిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
హైకోర్టు సంచలన ఆదేశం
వీధి కుక్కల దాడుల్లో అమాయక చిన్న పిల్లలు మరణిస్తున్నారని తెలంగాణ హైకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కుక్కల వరుస దాడుల ఘటనలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. కుక్కల దాడులను తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, వీటి నియంత్రణకు వారంరోజులలోగా కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా నాలుగు, ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు దారితీసే వీధికుక్కల దాడులను అరికట్టేందుకు తదుపరి విచారణలోగా స్టేట్ మానిటరీ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది.
కుక్కల దాడులు జరగకుండా చూడండి
వీధి కుక్కల నియంత్రణకు ఏం చేశామన్నది కాదని, భవిష్యత్ లో పిల్లలు చనిపోకుండా, కుక్కలు దాడి చేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కుక్కల దాడుల్లో బాధితులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని ఇలాంటి ఘటనలు ఇకముందు జరగకుండా చూడాలని కోర్టు కోరింది. సంపన్నులు నివశించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుక్కల దాడులు జరగడం లేదని పేదలు నివాసం ఉంటున్న మురికివాడల్లో తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయని కోర్టు తెలిపింది.
కుక్కల బెడదపై తీవ్ర వ్యాఖ్యలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కుక్కల బెడదపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘సమాజంలో నాలుగు-ఐదేళ్ల వయసు గల బిడ్డలను రక్షించలేకపోతే, మనం దేనికి?’’ అని ప్రశ్నించారు. ‘‘కుక్కలను నియంత్రించడంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలి. మీకు సంకల్ప శక్తి ఉంటే, మీరు పరిష్కారాన్ని కనుగొంటారు’’ అని జస్టిస్ అలోక్ వ్యాఖ్యానించారు.
మూడు లక్షలకు పైగా కుక్క కాటు ఘటనలు
హైదరాబాద్ నగరంలో గత పదేళ్లలో 3,36,767 మందిని కుక్కలు కరిచాయని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్ రికార్డులు తేటతెల్లం చేశాయి. ఏ యేటి కాఏడు కుక్క కాటు ఘటనలు నగరంలో పెరుగుతున్నాయని వెల్లడైంది. కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామని చెబుతున్నా, వీటి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
రూ.10 కోట్లు వెచ్చిస్తున్నా వీధి కుక్కల నియంత్రణేది?
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఏటా కుక్కల నియంత్రణకు రూ.10కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. గత రెండేళ్లుగా కుక్కల నియంత్రణకు 11.5కోట్లు ఖర్చు చేస్తున్నారని బల్లియా రికార్డులు చెబుతున్నాయి. కానీ కుక్కల నియంత్రణ మాత్రం జరగడం లేదు. దీంతో కుక్కకాటు ఘటనలు పెరుగుతున్నాయి. కుక్కల నియంత్రణకు 50 వాహనాలు, 362 మంది సిబ్బంది, 22మంది వెటర్నరీ వైద్యులు, జంతు సంరక్షణ కేంద్రాలున్నా కుక్కల బెడదకు తెర పడటం లేదు. కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమైందని సీనియర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఫిర్యాదులపై స్పందన ఏది?
హైదరాబాద్ నగరంలో గడచిన పదేళ్ల కాలంలో కుక్కలపై జీహెచ్ఎంసీకి 3,60,469 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై నగర మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కుక్కలు కొత్త వారిపై దాడులు చేసి కరుస్తున్నాయి. పదేళ్ల కాలంలో కుక్క కాటు వల్ల 8మంది పిల్లలు మరణించారు. కుక్కల బెడదపై ఫిర్యాదులపై మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించడం లేదు. దీంతో కుక్కకాటు ఘటనలు పెరుగుతున్నాయి.
Next Story