తెలంగాణలో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.నాలుగువారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ బీఫాంపై పోటీచేసిన దానం నాగేందర్ (ఖైరతాబాద్) కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్),తెల్లం వెంకటరావు (భద్రాచలం)లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు.
- ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమార్తె కడియం కావ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు వీలుగా శ్రీహరి పార్టీ ఫిరాయించారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పక్షాన ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరించారు. తాను భద్రాచలం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లు
బీఆర్ఎస్ బీ ఫాంపై ఎన్నికై మొదట పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్) కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్),తెల్లం వెంకటరావు (భద్రాచలం)లపై అనర్హత వేటు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, బీజీపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై డిస్ క్వాలిఫై చేయాలని తాము తెలంగాణ అసెంబ్లీ స్పీకరు కార్యాలయంలో నోటీసులు ఇచ్చినా స్పీకరు పట్టించుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
హైకోర్టు కీలక తీర్పు
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నాలుగువారాల్లోగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకరు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా స్పీకరు నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా కేసును విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది.ఈ మేరకు హైకోర్టు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
మిగతా ఫిరాయింపుల మాటేమిటి?
బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ (ఖైరతాబాద్) కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్),తెల్లం వెంకటరావు (భద్రాచలం)లే కాకుండా మిగతావారు కూడా పార్టీ ఫిరాయించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య(చేవెళ్ల) కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల్ ),అరికపూడి గాంధీ(శేర్లింగంపల్లి) కాంగ్రెస్ లో చేరారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు.
Next Story