హైడ్రాపై కేఏ పాల్ పైచేయి సాధించినట్టేనా..!
x

హైడ్రాపై కేఏ పాల్ పైచేయి సాధించినట్టేనా..!

హైడ్రాపై కేఏపాల్ పైచేయి సాధించారా? అంటే అవుననే అనాలి. ఆయన వాదనలు విన్న హైకోర్టు హైడ్రా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరి ఈ పని ఇతర పార్టీలు ఎందుకు చేయలేదు..


తెలంగాణలో హైడ్రా ఓ భూతంలా మారింది. ఎప్పుడు వచ్చి.. ఎక్కడ కూల్చివేతలంటుందో అర్థం కాక.. ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పేదలే టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా భూతాన్ని నడిపిస్తున్నారని, బుల్డోజరే ఆయుధంగా పేదల కలలను, జీవితాలను చిదిమేస్తున్నారంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్.. ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపి.. కేఏపాల్‌కు మద్దతుగానే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశింది.

హైడ్రా అంశంపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణలో భాగంగానే తక్షణమే హైడ్రా కూల్చివేతలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కేఏపాల్ వాదించారు. కానీ అలా ఇప్పటికిప్పుడు కూల్చివేతలను నిలిపివేయడం సాధ్యమపడదని వెల్లడించింది. ఈ హైడ్రా కారణంగా రాష్ట్రంలోని పేదలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇళ్లు కట్టి అమ్మిన బిల్డర్లు, కూల్చేస్తున్న ప్రభుత్వాలు బాగానే ఉంటున్నాయని, మధ్యలో సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం కొనుగోలు చేసిన వ్యక్తి చితికిపోతున్నాడంలూ కేఏపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తర్వాతే యాక్షన్ ప్రారంభించాలని, కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేఏపాల్ వాదనలను విన్న న్యాయస్థానం ఆయన వాదలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైడ్రాకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్ విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

విపక్షాలు చేయని పని..

అయితే హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా నిలుస్తామని, పేదల ఇళ్లు కూల్చాలంటూ బుల్డోజర్లు తమ శవాలపై నుంచే వెళ్లాలంటూ వ్యాఖ్యానించిన ప్రతిపక్ష నేతలు.. హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని అనేక మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అంతా కూడా రాజకీయ జోకర్‌లో చూసిన కేఏపాల్ తీసుకున్న స్టెప్‌ ఇతర పార్టీ నేతలు ఎందుకు తీసుకోలేక పోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేఏ పాల్ తెలివితేటలా లేకుండా ప్రతిపక్షాల అతితెలివితేటలా అని ప్రజలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో చూపినట్లు ప్రజలు కష్టాల్లో ఉండాలి.. వాళ్లకు మనం అండగా ఉంటూ రాజకీయ మైలేజీని పెంచుకోవాలన్నదే ప్రతిపక్షాల అజెండానా అన్న చర్చ కూడా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలకు మద్దుతగా నిలుస్తూ.. బుల్డోజలర్లకు ఎదురెళ్తామన్న ప్రతిపక్షాలు న్యాయపోరాట మార్గాన్ని ఎందుకు ఎన్నుకోలేదని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా విషయంలో ప్రభుత్వాన్ని నిలదీని వారు.. కోర్టుకెళ్లి నిలదీసి ఉండొచ్చు కదా అని నిలదీస్తున్నారు ప్రజలు. మరి ఈ ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీలు ఏమని సమాధానమిస్తాయో చూడాలి.

హైడ్రా అంటే ఏమిటంటే...

హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ . జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములు కబ్జాదారుల చెరలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా చెరువులు, నాలాల భూముల కబ్జాల పాలవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కబ్జాదారుల బారి నుంచి సర్కారు భూములకు విముక్తి కల్పించడంతోపాటు ఇకముందు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం కోసం హైడ్రాను కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.

హైడ్రా పరిధి ఎంతంటే...

జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్లపరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని సీఎం ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో చెప్పారు. పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు.ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలతో సర్వే

హైదరాబాద్ నగరంలో శాటిలైట్ ఉప గ్రహ ఛాయాచిత్రాలతో ప్రభుత్వ రికార్డులను ఆధారంగా చేసుకొని హైడ్రా అధికారులు నీటిపారుదల, రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారుల తో కలిసి సర్వే చేసి ఆక్రమిత భూముల చిట్టాను వెలికితీయనున్నారు. దీనిలో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా అధికారులు పకడ్బందీ కార్యాచరణను ప్రారంభించారు.

Read More
Next Story