Oparation Kagar : గడువు 4 నెలలే, మావోయిస్టు పార్టీ గత చరిత్ర అవుతుందా?
x
అడవుల్లో మావోయిస్టుల కోసం కేంద్ర సాయుధ బలగాల కుంబింగ్

Oparation Kagar : గడువు 4 నెలలే, మావోయిస్టు పార్టీ గత చరిత్ర అవుతుందా?

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వీ హిడ్మా ఎన్‌కౌంటర్ హెచ్చరిక ఏమిటి?


దేశవ్యాప్తంగా మావోయిస్టు దళాల ఉనికిని పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Oparation Kagar) తుది దశకు చేరుకుంది. గడువు ముగియడానికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉండగా, అడవుల్లో కుంబింగ్ ఆపరేషన్లు మరింత ఉదృతమయ్యాయి. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, భారీ స్థాయి జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాబల్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటం కీలక మలుపు తీసుకుంది.


పచ్చని అడవులు రక్తసిక్తం
వన్యప్రాంతాల్లో డ్రోన్ల గర్జన, హెలికాప్టర్ల చక్కర్లు, అడవుల్లో దళాల అడుగుచప్పుళ్లు...ఇలాంటి ఆపరేషన్లతో ఆపరేషన్ కగార్ దేశంలోని మావోయిస్టు వ్యవస్థను మూలాలతో పాటు కూల్చేస్తోంది.ఆపరేషన్ కగార్ లక్ష్యం కింద మావోయిస్టులు లేని ప్రాంతంగా ప్రకటించేందుకు మరో నాలుగు నెలల పది రోజుల సమయం మాత్రమే ఉంది.దీంతో కేంద్ర భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతకు కుంబింగ్ ను ముమ్మరం చేశాయి. వచ్చే ఏడాది మార్చికల్లా నక్సల్స్ ఫ్రీ దేశంగా ప్రకటిస్తామని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులను మట్టు పెట్టడంలో రెండు తెలుగురాష్ట్రాల్లో ఏర్పాటైన గ్రేహోండ్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు సమర్థంగా పనిచేస్తున్నాయి.



మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా హతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులు మరోసారి రక్తసిక్తమయ్యాయి. మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మద్దీ హిడ్మా, అతని భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే , చెల్లూరి నారాయణ, టెక్ శంకర్ లు మరణించారు. మావోయిస్టుల కదిలికల సమాచారం అందగానే తమ బలగాలు గాలించగా ఎన్ కౌంటర్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు.

హోం శాఖ ఆపరేషన్ కగార్
దేశంలో మావోయిస్టులను మట్టుపెట్టడం ద్వారా మావోయిజాన్ని అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆపరేషన్ కగార్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ ను చేపట్టింది.2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. గత ఏడాది నుంచి చేపట్టిన ఈ ఆపరేషన్ తో గుట్టల్లో తుపాకులు గర్జిస్తుండగా, పచ్చని అడవులు నెత్తుటితో ఎరుపెక్కాయి.

14 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యానికి చెక్
దేశంలోని ఛత్తీస్ గడ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మావోయిస్టుల ప్రాబల్యానికి కేంద్రాలుగా ఉండేవి. దీంతోపాటు దేశంలోని 14 రాస్ట్రాల్లో మావోయిస్టులు మనుగడ సాగిస్తున్నారని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దించింది.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. మావోయిస్టులు అధికంగా ఉన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని అడువుల్లో ప్రతీ 4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 250 సీఆర్ పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులపై ఉక్కు పాదం మోపారు. మావోయిస్టులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం,తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఇతర డంప్ లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారు కాల్పులు జరిపితే ఎదురు కాల్పులు జరిపి వారిని మట్టుపెట్టడం లక్ష్యంగా ఆపరేషన్ కగార్ సాగింది.2010వ సంవత్సరంలో నేపాల్ దేశంలోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి దాకా 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల రెడ్ కారిడార్ కు నేడు అంతర్థానం అవుతోంది.



సాయుధ పోలీసులు వరుస దాడులు

ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో శత్రుదుర్భేద్యంగా ఉన్న దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులున్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ, ఆంథ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేపట్టాయి. అబూజ్ మడ్ అడవుల్లో మకాం వేసిన మావోయిస్టుల ఆచూకీని డ్రోన్లను ఎగురవేస్తూ, హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ భద్రతా బలగాలు కనుగొంటున్నాయి.మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అబూజ్ మడ్ అడవుల్లో కేంద్ర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలు, నైట్ విజన్ గ్లాసులతో రంగంలోకి దిగాయి. దట్టమైన అడవుల్లో మావోయిస్టుల ఆయువు పట్టు అయిన స్థావరాలపై సాయుధ పోలీసులు వరుస దాడులు చేస్తూ మావోయిస్టులను మట్టుపెడతున్నాయి.మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావడం, మరో వైపు ఎన్ కౌంటర్లతో వారి ప్రాబల్యం తగ్గిపోయిందని తెలంగాణ మాజీ డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు.


ఒకవైపు ఎన్ కౌంటర్ లు...మరో వైపు లొంగుబాట్లు
ఆపరేషన్ కగార్ గడవు సమీపస్తున్న నేపథ్యంలో ఒక వైపు వరుస ఎన్ కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించగా, మరికొంత మంది లొంగిపోయారు. ఫలితంగా ఈ ఆపరేషన్ పుణ్యమా అంటూ మావోయిస్టుల దళాలు బలహీనపడ్డాయి. 2025 అక్టోబరు 14 వతేదీన మావోయిస్టు అగ్రనాయకుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి తన అనుచరులైన 61 మంది కేడరుతో గడిచిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు.

తుపాకులు వదిలి...
దట్టమైన అడవులున్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోనే 200 మంది మావోయిస్టులు తుపాకులను వదిలి లొంగిపోయారు. 2014వ సంవత్సరంలో 18,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం కేవలం వందల చదరపు కిలోమీటర్లకే తగ్గిందని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ గణాంకాలే చెబుతున్నాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల్లో నలుగురు ఎన్ కౌంటర్ కాగా, మరో ఇద్దరు లొంగిపోయారు. దీనికితోడు కొత్తగా మావోయిస్టుల రిక్రూట్ మెంట్ లో అటవీ గ్రామాల యువకులు చేరడం లేదు. దీనికి తోడు మావోయిస్టులకు నిధుల సమీకరణ కూడా నిలిచిపోయింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదనే విషయాన్ని యువకులు గుర్తించి వారంతా ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాజీ ఐఎఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

వరుస లొంగుబాట్లు
మావోయిజాన్ని వదిలి లొంగిపోయిన వారికి రివార్డులు ఇవ్వడంతోపాటు వారికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం మంజూరు చేసి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 421 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ పోలీసు రికార్డులే తేటతెల్లం చేశాయి. ఛత్తీస్ గడ్ లో 403 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత సంవత్సరం తెలంగాణలో 49 మంది, ఛత్తీస్ గడ్ లో 32 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 70 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.



తెలంగాణ డీజీపీ ముందు సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణలో మావోయిజానికి స్వస్థి చెప్పి ఇద్దరు మావోయిస్టు సీనియర్లు కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లు ఇటీవల తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. 2025వ సంవత్సరంలో 427 మంది మావోయిస్టులు దళాల నుంచి వచ్చి లొంగి పోయి జనజీవితం గడుపుతున్నారని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు.‘‘పోరు వద్దు - ఊరు ముద్దు!’’అంటూ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు.

ఆయుధాలతో లొంగిపోండి : బస్తర్ ఐజీపీ
దండకారణ్యంలో మిగిలిపోయిన మావోయిస్టులు ఇప్పటికైనా ఆయుధాలతో వచ్చి ఆయుధాలతో లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజన్ విజప్తి చేశారు. ఛత్తీస్ ఘడ్ ని బస్తర్ దండకారణ్యంలో మావోయిస్తుల ఏరివేత కార్యక్రమం చివరి దశలో ఉందని, ఆ ఉన్న కొద్దిమంది ప్రభుత్వానికి లొంగిపోతే ప్రాణాలు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు.

ఎన్నెన్నో ఎన్ కౌంటర్‌లు
2025 నవంబర్ 17 : సుక్మా జిల్లా తమల్పాడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో దళ కమాండర్ మద్వీ దేవా అలియాస్ జెనివి లిథియా , మరో దళ కమాండర్ పోడియం గంగి మరణించారు.2025 బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. 2025 జనవరి నెలలో 48 మంది మావోయిస్టులు నేలకొరిగారు. 2025 ఫిబ్రవరిలో 40 మంది, 2025 మార్చి 20వతేదీన 30 మంది ఎదురు కాల్పుల్లో మరణించారు.

అడవుల్లో దశాబ్దాలుగా జొరబడ్డ మావోయిజం ఇప్పుడు తన చివరి శ్వాస తీసుకుంటోంది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ లొంగుబాట్లు, కేంద్ర–రాష్ట్ర భద్రతా బలగాల సంయుక్త దాడులతో మావోయిస్టు దళాలు బలహీనపడి అస్తమయం దిశగా కదులుతున్నాయి. ‘ఆపరేషన్ కగార్’ గడువు ముగియడానికి ఇంకా నాలుగు నెలలే ఉన్న ఈ దశలో, దేశం మావోయిజం చరిత్రకు చివరి పుటలు రాస్తున్నట్లు కనిపిస్తోంది.



Read More
Next Story