తెలంగాణలో వినాయకచవితివేళ భారీ నుంచి మోస్తరు వర్షాలు
x
తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో వినాయకచవితివేళ భారీ నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురిసేఅవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.


తెలంగాణ రాష్ట్రంలో వినాయకచవితి పండుగ వేళ బుధవారం పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు. బుధవారం ఉదయం రాగల రెండు మూడు గంటల్లో పలు జిలాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, యాదాద్ిర భువనగిరి జిల్లాల్లో రాగల రెండు మూడు గంటల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని డైరెక్టర్ వివరించారు. వినాయక చవితి వేళ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు విద్యుత్ స్తంభాలు, వినాయక చవితి మండళ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల,సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.



పలు జిల్లాల్లో భారీవర్షాలు

తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. దీనివల్ల జిల్లా్లలో వరద హెచ్చరికలు జారీ చేశారు. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

వరద హెచ్చరికలు జారీ
ఎగువ నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నదిలో వరదనీటి ప్రవాహం పెరగవచ్చని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. సింగూరు, నిజాంసాగర్ డ్యాం, మంజీరా నది ఏడుపాయల వద్ద నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని వెదర్ మ్యాన్ తెలిపారు. మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తే ప్రమాదమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.

వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి సూచ‌న‌

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోండి

వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్ కో సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సీఎం పేర్కొన్నారు.

చెరువులకు గండ్లు పడే ప్రమాదం

న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


Read More
Next Story