
ఈ చిప్ ఆధారిత పాస్ పోర్ట్
తెలంగాణలో పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే చదవండి
తెలంగాణలో పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు శుభవార్త .
తెలంగాణ రాష్ట్రంలో పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు హైదరాబాద్ అధికారులు శుభవార్త వెల్లడించారు. కొత్తగా పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్ పోర్టులను జారీ చేయనున్నట్లు హైదరాబాద్ పాస్ పోర్టు కేంద్రం అధికారులు తెలిపారు. దేశంలోని 12 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద విదేశీ మంత్రిత్వశాఖ ఈ చిప్ ఆధారిత పాస్ పోర్టుల జారీకి ఎంపిక చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంతో పాటు చెన్నై, నాగ్ పూర్, భువనేశ్వర్, జమ్మూ, సిమ్లా, రాయ్ పూర్, అమృత్ సర్, జైపూర్, సూరత్, రాంచీ కేంద్రాల ద్వారా ఈ చిప్ పాస్ పోర్టులను జారీ చేయనుంది. దీంతో గతంలో సాధారణ పాస్ పోర్టు దరఖాస్తు రుసుం 1500రూపాయలు ఉండగా, దీన్ని రెండువేల రూపాయలకు పెంచింది. ఈ పాస్ పోర్టును నాసిక్ లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ లో ఇ చిప్ ను చొప్పించి ముద్రిస్తున్నారు.
పాస్‌పోర్టులో చిప్
పాస్ పోర్టులో అధునాతన భద్రత వ్యవస్థతో కూడిన చిప్ ఉంటుంది. ఈ చిప్ లోనే దరఖాస్తుదారుడి పూర్తి వివరాలుంటాయి. పాస్ పోర్టు కవరులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ)టెక్నాలజీతో చిప్, యాంటెన్నా ను పొందుపరుస్తారు. ఎలక్ట్రానిక్ ఎంబెడెడ్ పాస్‌పోర్ట్‌గా గుర్తించడానికి ముందు కవర్ కింది భాగంలో బంగారు రంగు చిహ్నం ముద్రిస్తున్నారు. ఈ పాస్ పోర్టు ఉన్న వారి పూర్తి వివరాలు బయోమెట్రిక్ డేటాతో కనిపిస్తాయి.
అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు...
ఇప్పటికే పాత పాస్‌పోర్ట్ ఉన్నవారు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని పాస్ పోర్టు కార్యాలయ అధికారులు చెప్పారు. ప్రస్తుత పాస్‌పోర్ట్‌లు వాటి ఎక్స్‌పైరీ డేట్ వరకు సేవలందిస్తాయని హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయ అధికారులు తెలిపారు.ఈ చిప్ పాస్ పోర్టును ట్యాంపరింగ్ చేయడానికి యత్నిస్తే పాస్ పోర్ట్ సేవా వ్యవస్థకు హెచ్చరిక అందనుంది. అమెరికా, యూకేతో పాటు పలు విదేశాల రాయబార కార్యాలయాలను ఈ చిప్ ఆధారిత పాస్ పోర్టుకు అనుసంధానం చేశారు. ఏడు రోజుల్లోనే ఈ చిప్ పాస్ పోర్టులను జారీ చేయనున్నారు.
Next Story