తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకొని విదేశాలకు వెళ్లిన కార్మికులు అక్కడ జైలు పాలయ్యారు. తమ భర్తలు దేశం కాని దేశంలో జైలు పాలవడంతో పిల్లలతో తాము నానా అవస్థలు పడుతున్నామని బాధితుల భార్యలు విలపిస్తూ చెప్పారు. విదేశాల్లో జైళ్లలో మగ్గుతున్న తమ భర్తలను విడిపించి, స్వదేశానికి తీసుకురావాలని బాధిత కుటుంబసభ్యులు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు.
-తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అయిదుగురు పొట్ట చేతబట్టుకొని ఉపాధి కోసం కార్మికులుగా పనిచేసేందుకు మలేషియా దేశానికి వెళ్లారు. ఏజెంటు విజిటింగ్ వీసా ఇచ్చి మలేషియాలో పనిచేసేందుకు పంపించి మోసం చేయడంతో వారంతా మలేషియా దేశంలో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.
- కడెం మండలంలోని లింగాపూర్ గ్రామస్థులు రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గుండా భూమరాజు, గురిజాల రాజేశ్వర్, గురిజాల శంకర్‌లు కార్మికులుగా పనిచేసేందుకు విజిటింగ్ వీసాలపై గత ఏడాది అక్టోబరు నెలలో మలేషియాకు వెళ్లారు. వారని అక్రమ నివాసులుగా తేల్చిన మలేషియా పోలీసులు డిసెంబరు నెలలో వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
మలేషియాలో జైలు పాలైన కార్మికులు
మలేషియా జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడుదల చేయించి స్వదేశానికి రప్పించాలని అయిదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబసభ్యులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జ ను కలిసి విన్నవించారు. జైలు పాలైన వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, ఖానాపూర్ మండల అధ్యక్షుడు డోనికెన దయానంద్ ఖానాపూర్ ఎమ్మెల్యేను కలిసి తమ బాధలు వెళ్లబోసుకున్నారు. మలేషియాలో కార్మికులుగా పనిచేసి డబ్బు పంపిస్తారనే ఆశతో వారిని మలేషియాకు అప్పు చేసి ఏజెంట్లకు డబ్బులిచ్చి పంపిస్తే, వారు జైలు పాలయ్యారని, చివరికి తమకు అప్పు మిగిలిందని బాధిత కుటుంబసభ్యులు ఆవేదనగా చెప్పారు.
జైలు నుంచి స్వదేశానికి రప్పించండి
లింగాపూర్ గ్రామ బాధితుల విజ్ఞప్తులకు స్పందించిన ఎమ్మెల్యే వెడమ జొజ్జు పటేల్ ఈ సమస్యకు సంబంధిత ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్, రాయబారి బిఎం వినోద్ కుమార్ కు పంపించారు. మలేషియాలో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, వారిని జైలు నుంచి విడుదల చేయించి స్వదేశానికి పంపించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. మలేషియా జైళ్లలో మగ్గుతున్న బాధిత కుటుంబసభ్యులు గురిజాల పద్మ, గురిజాల రమ, భాస్కర్, భూమరాజు ఎమ్మెల్యేను కలిసి సాయమందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ వారిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి చట్టపరమైన సహాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
ప్లంబరుగా పనిచేస్తూ జైలు పాలై...
కువైట్‌లో కార్మికుడిగా పనిచేసేందుకు వెళ్లిన తెలంగాణ వాసి సోహైల్ అక్కడ జైలు పాలయ్యాడు.నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నివాసి అయిన సోహైల్ కువైట్‌లోని అడాన్ హాస్పిటల్‌లో గల్ఫ్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్వహణ విభాగంలో ప్లంబర్‌గా పనిచేసేవాడు. మాదకద్రవ్యాల కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలతో సోహైల్ ను 2021వ సంవత్సరం డిసెంబర్ 5వతేదీన కువైట్ పోలీసులు అరెస్టు చేశారు.తరచుగా ఎక్కువ షిఫ్టుల్లో పనిచేసిన సోహైల్ భోజనం కోసం ఒక హోటల్‌లో ఉండగా, ఒక అపరిచితుడు అతనికి అనుమానాస్పద పార్శిల్ ఇచ్చాడు.కొన్ని క్షణాల తర్వాత పోలీసులు వచ్చి డ్రగ్స్ కేసులో సోహైల్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోహైల్ కు కువైట్ కోర్టు జీవిత ఖైదు విధించింది. తప్పుడు కేసులో ఇరుక్కొని జైలు పాలైన తన భర్తను కాపాడాలని సోహైల్ భార్య అన్వారీ బేగం కోరింది.
నా భర్తను జైలు నుంచి విడిపించండి : అన్సారీ బేగం
కువైట్‌లో తప్పుడు ఆరోపణతో జీవిత ఖైదు అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన 34 ఏళ్ల ముహమ్మద్ అబ్దుల్ సోహైల్ ను విడుదల చేయించాలని అతని భార్య అన్సారీ బేగం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ ఉదంతాన్ని మజ్లిస్ బచావో తెహ్రీక్ నాయకుడు అమ్జద్ ఉల్లా ఖాన్ వెలుగులోకి తీసుకువచ్చారు. అన్సారీ బేగం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను విడుదల చేశారు. భర్త కువైట్ లో జైలు పాలు కావడంతో తమ ఇద్దరు చిన్న పిల్లలను పెంచడానికి ఇబ్బంది పడుతున్నానని అన్సారీ బేగం ఆవేదనగా చెప్పారు.న్యాయ సలహా ఇవ్వడానికి లేదా రోజువారీ ఖర్చులను నిర్వహించలేకపోతున్నామని ఆమె కుటుంబం యొక్క దారుణమైన పరిస్థితిని వ్యక్తం చేసింది.‘‘సోహైల్ ఇంటికి ఫోన్ చేసి తన నిర్దోషిత్వాన్ని చెబుతూ, తనను తప్పుడు కేసులో ఇరికించారని బాధను వ్యక్తం చేస్తున్నాడు ’’ అని బేగం చెప్పింది.
విషపూరిత వాయువుతో అనారోగ్యం పాలై...
ఉపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లిన తెలంగాణ కార్మికుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తెలంగాణకు చెందిన 28 ఏళ్ల కార్మికుడు లౌద్య దినేష్ బహ్రెయిన్‌లోని ఒక ఆసుపత్రిలో విషపూరిత వాయువులకు గురవడంతో అతని పరిస్థితి విషమంగా మారింది.తదుపరి చికిత్స కోసం దినేష్ ను స్వదేశానికి తీసుకురావాలని అతని కుటుంబం కోరుతోంది.నిర్మల్ జిల్లాలోని పుల్గాం పండ్రి గ్రామానికి చెందిన దినేష్ ఉద్యోగ అవకాశాల కోసం 2022వ సంవత్సరంలో బహ్రెయిన్‌కు వెళ్లారు. అతను ముంబై రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా రెండేళ్ల వీసా పొందాడు. సైప్రస్ సైబర్‌కో టాబిట్ జె.వి. డబ్ల్యూ.ఎల్.ఎల్.లో కార్మికుడిగా పనిచేయడం ప్రారంభించాడు.
నా భర్తను స్వదేశానికి రప్పించండి : సుమలత
గత ఏడాది డిసెంబర్ నెలలో విషపూరిత వాయువు బహిర్గతం కారణంగా దినేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇతను సలామియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, అతని పరిస్థితి విషమంగా ఉంది.దినేష్ ను స్వదేశానికి రప్పించి చికిత్స అందించాలని అతని కుటుంబసభ్యులు నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించింది.దినేష్ తన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వాట్సాప్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు కలత చెందారు. దినేష్ భార్య సుమలత, తండ్రి పంతులు, గ్రామ పెద్దలతో కలిసి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్‌కు కలిసి వినతిపత్రం సమర్పించారు.