‘క్షమాపణలు చెప్పకుంటే నోటీసులిస్తా’.. కాంగ్రెస్ ఎంపీకి హరీష్ రావు వార్నింగ్..
x

‘క్షమాపణలు చెప్పకుంటే నోటీసులిస్తా’.. కాంగ్రెస్ ఎంపీకి హరీష్ రావు వార్నింగ్..

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలేమయిందంటే..


కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయనకు పరువునష్టం దావా నోటీసులు పంపుతానంటూ హరీష్ రావు ఈరోజు ప్రకటించారు. హరీష్ రావుపై అనిల్ కుమార్ చేసిన పలు కీలక ఆరోపణల ఫలితంగానే హరీష్ రావు ఈ రోజు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆరోపణలు చేయడంలో తప్పులేదని, కానీ ఇంతటి స్థాయిలో చేస్తే ఎవరూ ఊరుకోరని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అండగా ఉండటం ఏ విధంగా తప్పని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్ఎస్‌కు ఆదరణ పెరుగుతుండటం చూసి జీర్ణించుకోలేకే అనిల్ కుమార్ సదరు ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. తాను, తన పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించలేదని, ఎల్లప్పుడూ పేదల, ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాగా హరీష్ రావు వార్నింగ్‌కు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ రీకౌంటర్ ఇచ్చారు. తన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎక్స్ వేదికగా కోరారు.

దావా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి..

‘‘ప్రజా సమస్యల పై పోరాడుతున్న నాపై బురదజల్లే వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారు. ఇంతే వదిలేస్తే గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీష్ రావు కు వాటాలు ఉన్నాయి అని అంటారేమో? అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అనిల్ కుమార్‌ యాదవ్‌ను హెచ్చరిస్తున్నా’’ అని హరీష్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

ఏమనుకోవాలి..: అనిల్

పరువు నష్టం దావా వేస్తున్నాని హెచ్చరిస్తూ హరీష్ రావు చేసిన పోస్ట్‌పై అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. తన ఆరోపణలకు ఎందుకు వివరణ ఎవ్వలేదని అడిగారు. దాట వేస్తున్నారని అనుకోమంటా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘హరీష్ రావు.. మీ ట్వీట్ చూశాను. మాది గోబెల్స్ ప్రచారం అంటున్నారే కానీ.. ఇంతకీ ఎఫ్‌టీసీఎల్ భూముల్లో మీకు వాటా ఉందో? లేదో ? చెప్పలేదు. ఇంతలా దాస్తున్నారు అంటే.. నిప్పు లేనిదే పొగ రాదు అనుకోవాలా?’’ అంటూ అనిల్ కుమార్ మరో పోస్ట్ పెట్టారు.

అసలు అనిల్ కుమార్ ఏమన్నారు..

హైడ్రా బాధితులకు మద్దతు తెలపడానికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి సహా పలువురు నేతలు మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ.. పేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బుల్డోజర్ల వచ్చినా జేసీబీలు వచ్చినా తమ పైనుంచే వెళ్లాలంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అనిల్ కుమార్.. కీలక ఆరోపణలు చేశారు. ‘‘మూసీ పర్యటన, హైడ్రా సమావేశాల పేరుతో అగ్గిపెట్టె హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి చేస్తున్న రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా? హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు వాటాలు ఉన్నాయి. తను అక్రమంగా నిర్మించిన వందల కోట్ల విలువ గల ఆనంద కన్వెన్షన్ ను కాపాడుకునేందుకు హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారు. నువ్వు అక్రమంగా సంపాదించిన వందల కోట్ల విలువైన ఆస్తులను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను అడ్డుపెట్టుకుంటున్న అగ్గిపెట్టె హరీష్ రావు ఖబర్దార్... ఎవరెన్ని కుట్రలు చేసినా చెరువులు, నాలా భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత ఆగదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. చెరువులు, నాలాలు, మూసీ నది పరివాహక ప్రాంతాలను కాపాడి భవిష్యత్ తరాలకు భరోసా అందించేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మద్దతుగా నిలుస్తోంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టే ఇప్పుడు హరీష్ రావు, అనిల్ కుమార్ మధ్య మాటల యుద్ధానికి శ్రీకారం చుట్టింది.

Read More
Next Story