రేవంత్ కోసం హరీష్ రావు పరిహార పూజలు
x

రేవంత్ కోసం హరీష్ రావు పరిహార పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు ఆలయానికి వెళ్లారు.


సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఆలయాల యాత్ర చేపడుతున్నానని ప్రకటించారు. ఈ నెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని ఆరోపించారు. అందుకే మొదటి ఆలయ యాత్ర యాదాద్రి నుంచే ఉంటుందని వెల్లడించారు.

అందులో భాగంగా గురువారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు ఆలయానికి వెళ్లారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పాడని విమర్శిస్తూ పరిహార పూజలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. "స్వామీ... ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు" అని వేడుకున్నానన్నారు.

ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహాస్వామిని వేడుకున్నామని హరీష్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్ధించామన్నారు. పాలకుడు పాపలు చేస్తే, ప్రజలకు చుట్టుకుంటాయని, అందుకే ఆయన్ని క్షమించి తెలంగాణ ప్రజల్ని రక్షించాలని వేడుకున్నామన్నారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ అయ్యేవరకు ఈ ప్రభుత్వంపై పోరాడే శక్తిని తమ పార్టీ నేతలందరికీ ఇవ్వమని నరసింహస్వామిని కోరినట్టు హరీష్ రావు తెలిపారు. అనంతరం ఆయన ఆలూరు రైతు నిరసన దీక్షా శిబిరానికి వెళ్లారు.

అరాచక పాలన...

ఆలేరు సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది ప్రజాపాలన కాదు, అరాచక పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. నిరంకుశ రాజ్యం అని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయమని రైతుల అడిగితే.. వాళ్ల మీద కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. రుణమాఫీ గురించి జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. వాళ్ల మీద దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. రైతులందరికి రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తే.. వాళ్ల మీద దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. తన దా'రుణ' మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నాడని హరీష్ రావు ఆగ్రహించారు.

Read More
Next Story