ఆ ఆరింటిపైనే హరీష్ రావు ఫోకస్
x

ఆ ఆరింటిపైనే హరీష్ రావు ఫోకస్

రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉందన్నారు.


రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉందన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు.. హామీలకు కేటాయింపులు లేవని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు కేటాయింపులు లేవు.. అభివృద్ధి అగమ్యగోచరం.. ఇది రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపే బడ్జెట్ అని విమర్శించారు.

హరీష్ రావు ఆరు గ్యారెంటీల అమలుపై పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఆరు గ్యారెంటీలకి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులేవీ? అని సర్కార్ ని ప్రశ్నించారు. భట్టి ఆరు గ్యారంటీలను తన బడ్జెట్లో పూర్తిగా మర్చిపోయారన్నారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 గురించి ప్రస్తావించలేదు.. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించిందన్నారు హరీష్ రావు. రూ. 4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు.. మరి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదు? అని ప్రశ్నించారు.

ఇంకా హరీష్ రావు ఏమన్నారంటే...

ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఎలాంటి దశా, దిశాలేదు

అత్యంత పేదలైన అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వింతంతువులు, దివ్యాంగుల ఆశలను మీ ప్రభుత్వం నీరుగార్చింది

విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు.. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు

ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలన్నారు.. బడ్జెట్లో ఆ ప్రసక్తి లేదు

కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు

జాబ్ క్యాలండర్, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు

ఆటో కార్మికులకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మొండిచేయి చూపారు

ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారు

గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అనడం అన్యాయం

మేం అప్పులు చేశామని నిందించారు.. భట్టి రూ. 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు.. మా ప్రభుత్వం తెచ్చినదానికంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువ తెస్తామన్నారు

కేసీఆర్ అభివృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకుంటున్నది కాంగ్రెస్

దేశంలో తలసరి ఆదాయంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను మేం నంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాం

తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,47,099 అయితే దేశ తలసరి ఆదాయం రూ. 1,83,236

అంటే రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయానికంటే 1 లక్ష 64 వేల 63 రూపాయలు ఎక్కువ.. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఫలితం

బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 4,51,580 కోట్లు.. 2023-24 నాటికి అది రూ. 14,63,963 కోట్లు . అంటే మూడు రెట్లు పెరిగింది

తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతం కాగా దేశ వృద్ధి రేటు 9.1 శాతమే. తెలంగాణ గ్రోత్ రేటు బావుందని నీతి ఆయోగ్ కూడా మెచ్చుకుంది.

వ్యవసాయానికి ఊతమిచ్చి కోటి 27 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడిని 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచాం

పంజాబ్‌ను తలదన్ని ఎదిగామంటే కేసీఆర్ పనితీరు కారణం కాదా? పండిన పంట నిజం కాదా?

మీ బడ్జెట్లో ఏదో చెప్పినంత మాత్రాన నిజాలు నిజం కాకుండా పోతాయా?

బడ్జెట్లో గొల్ల కుర్మలకు మోసం చేశారు.. గతేడాది 50 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పుడు సున్నా కేటాయించారు

పింఛన్లు పెంచడం లేదని అర్థమైంది.. గతేడాది రూ. 7,335 కోట్లు పెడితే, ఇపుడు రూ. 7,376 కోట్లు మాత్రమే పెట్టారు. ఈసారి కొత్త పింఛన్ ఇవ్వరని తేలిపోయింది

ఆగస్ట్ 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్నారు.. రూ. 31 వేల కోట్లు ఇస్తామన్నారు.. కానీ బడ్జెట్లో రూ. 15,470 కోట్లు మాత్రమే కేటాయించారు? ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం?

రైతుబంధు స్థానంలో రైతుభరోసా అన్నారు.. దాని ఊసు కూడా లేదు

మైనారిటీలకు రూ. 4 వేల కోట్లని మేనిఫెస్టోలో చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు

ఐదేళ్లలో ప్రతి సంవత్సరానికి బీసీలకు రూ. 20 వేల కోట్ల ఇస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారు

ఇరిగేషన్‌కు కూడా నిధులు తగ్గించారు.. పోయినేడాది మేం రూ. 26,825 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ. 22,300 కోట్లు మాత్రమే కేటాయించారు

దళితబంధు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచుతామన్నారు.. ఆ ప్రస్తావన కూడా లేదు.. గిరిజన బంధులేదు

ఉద్యోగులకు ప్రభుత్వం 5 డీఏలు బాకీ పడ్డది.. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు.. పీఆర్సీ ప్రస్తావన కూడా లేదు

కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన కేటాయింపులు ఈ బడ్జెట్లో లేవు

గత బడ్జెట్లో నేను చూపిన ఎక్సైజ్ ఆదాయం రూ. 18,470 కోట్లు. భట్టిగారు ప్రతిపాదించింది రూ. 25,617 కోట్లు.. అంటే ఏడు వేల కోట్లు ఎక్కువ.. గల్లీకో వైన్ షాప్ పెడతారా?

ఎక్సైజ్, వ్యాట్ కలుపుకుంటే రూ. 15 వేల కోట్ల ఎక్కువ ఆదాయం రాబడతామని చెప్పారు. అంటే తాగుబోతు తెలంగాణను తయారుచేస్తారా?

స్టాంపు డ్యూటీ ఆదాయం రూ. 14,295 కోట్లని గత బడ్జెట్లో నేను ప్రతిపాదిస్తే భట్టి రూ. 18,228 కోట్లు అన్నారు.. అంటే 4 వేల కోట్ల ఎక్కువ. భూముల విలువ, రిజిస్ట్రేషన్, పన్నుల భారం పెంచుతామని చెప్పకనే చెప్పారు

Read More
Next Story