‘దమ్ముంటే గ్రామ సభలకు రండి’.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..
ఆంధ్రలో అధికారం మారగానే పెరిగిన పింఛన్ అందింది. కానీ తెలంగాణలో ఉన్నది కూడా అటకెక్కిందంటూ హరీష్ రావు ఎద్దేవా.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. జనవరి 26 నుంచి పలు పథకాలు అమలు చేయనున్న క్రమంలో సదరు పథకాలకు అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం ఈ గ్రామ సభలు నిర్వహిస్తోంది. వీటిలో రేషన్ కార్డులు పొందేవారి జాబితాను అందుబాటులో ఉంచింది. వీటిలో తమ పేరు ఉందా లేదా అని ప్రజలు ఒకసారి చూసుకోవాలని, పేరు లేకుంటో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బుధవారం కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన చెప్పారు. ఈ సందర్భంగానే రేషణ్ దుఖాల్లో ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ గ్రామ సభలపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఘాటుగా స్పందించారు. దమ్ము ధైర్యం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి.. గ్రామ సభల్లో పాల్గొనాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అసలు హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దరఖాస్తులతో వీరు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చేసుకుంటున్న దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలి. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఆన్ లైన్‌లో నమోదు చేయకుండా మూలకు పడేశారు. దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందీ ప్రభుత్వం. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు పరమాన్నం పెడతామని చెప్పి పంగనామాలు పెడుతున్నారు. రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ హైదరాబాద్‌లో మాట్లాడుతున్నారు. ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వస్తున్నాయి’’ అని తెలిపారు.
‘‘సీఎం రేవంత్ సిద్దిపేటకి వస్తారా...లేకపోతే ఆయన గ్రామం కొండారెడ్డిపల్లికి పోదామా చెప్పాలి. రుణమాఫీ అయ్యిందో లేదో చూద్దాం. పూర్తి రుణమాఫీ చేస్తానని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారు. సీఎం రేవంత్ మాటలు నమ్మి రైతులు ఆగం అయ్యారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటనలు చిన్న ఉదాహరణ. సీఎం రేవంత్ చెప్పేటివన్ని నీటి మూటలు. దమ్ముంటే సీఎం రేవంత్ గ్రామ సభలకు రావాలి. నేను కూడా గ్రామ సభకు వస్తా. పోలీసులను అడ్డం పెట్టుకుని గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లో నవంబర్ 30 నాడు 2750 కోట్లు ఇస్తున్నానని సీఎం రేవంత్ చెప్పారు’’ అని గుర్తు చేశారు.
‘‘సీఎం రేవంత్ డమ్మీ చెక్ ఇచ్చారా. మోసాలు తప్ప నీతి, నిజాయితీ లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వానాకాలం రైతుభందు ఎప్పుడు ఇస్తారో రేవంత్ చెప్పాలి. నిన్న ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ పేరు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. ఇప్పటి నుండి నిన్ను అలానే పిలుస్తాం. లక్ష కోట్లతో మూసి సుందరికరణకి, నీ గ్రామంలో ఐదువేల కోట్లతో అభివృద్ధి పనులకు, 15 వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులకు డబ్బులు ఉంటాయి కానీ కానీ రైతులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా..?’’ అని ప్రశ్నించారు.
‘‘దరఖాస్తుల పేరుతో ఈ ప్రభుత్వం ప్రజల ఉసురు పోసుకుంటుంది. రేవంత్ వచ్చాక ఇండ్లు కూల్చాడు తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు. అసలైన అర్హులకు పథకాలు అందజేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఫ్లెక్సీలో ఫోటోలు పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫోటోలు పెట్టడం లేదు. ప్రోటోకాల్‌ని తుంగలో తొక్కుతున్నారు. ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సొరేన్ గెలవగానే మహాలక్ష్మి పథకం ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం గెలిచి ఏడాది దాటినా ఇవ్వడం లేదు. వృద్ధులకు 4 వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పటివరకు ఇవ్వలేదు. పక్క రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గెలవగానే పెంచిన పెన్షన్ ఇచ్చారు. కానీ ఇక్కడేమైంది’’ అని ఎద్దేవా చేశారు.