హరీష్ రావు పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చేసింది...
x

హరీష్ రావు పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చేసింది...

హరీష్ రావుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించకపోతే పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వార్తలపై ఆయన స్పందించారు.


బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ మారతారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆయన బీఆర్ఎస్ ని వీడి, తన వర్గంతో కలిసి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఆయనకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించకపోతే పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.

సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. "హరీష్ రావు పార్టీ మారతాడు, బీజేపీలోకి వెళ్తాడు అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్లు రాయటం, చూపించటం మంచిది కాదు. నేను పార్టీ కార్యకర్తగా ఉంటాను, బీఆర్ఎస్ లోనే పని చేస్తాను. ఇది చివరి సారిగా చెప్తున్న, నేను ఏ పార్టీ మారటం లేదు. ఇకపై ఇలాంటి వార్తలు రాసే వారికి లీగల్ నోటీసులు పంపిస్తా. ఇకపై ఇలాంటి వార్తలు రాయకండి, లీడర్ క్రెడిబిలిటీ దెబ్బతీయకండి" అంటూ ప్రచారం చేస్తున్నవారికి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.

తాను బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ కి నమ్మకమైన పాద సైనికుడినని, పార్టీని వీడే ప్రశ్నే లేదని హరీశ్‌రావు అన్నారు. కేటీఆర్ స్థానంలో తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతానని, అలాగే బిజెపి లేదా కాంగ్రెస్‌లో చేరతానని వచ్చిన వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రచారం చేసే వారిపై లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటించండి...

తెలంగాణ ప్రజలను పీడిస్తున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, బీఆర్‌ఎస్‌పై బురదజల్లుతూ కాలయాపన చేయకుండా వాటిని ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్‌ కానీ, ఎం. కోదండరామ్‌ వంటి నేతలు కానీ వారి విజ్ఞప్తిపై స్పందించడం లేదని అన్నారు.

కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు వారికి అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్ కు అవకాశమివ్వాలని, తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యార్థులకు చెప్పారు.. భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని, అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు తగినంత సమయం ఉండేలా వివిధ పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఉండేలా చూడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ వాగ్దానం చేసిన ప్రకారం గ్రూప్-2 కోసం 2,000 ఉద్యోగాలు మరియు గ్రూప్-3 కోసం దాదాపు 3,000 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే ప్రతిపాదించిన 11,000 పోస్టులకు బదులుగా మొత్తం 25,000 పోస్టులకు DSC నిర్వహించాలని ఆయన కోరారు.

చంద్రబాబు చేశాడు.. రేవంత్ ఎందుకు చెయ్యట్లేదు?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పింఛన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణాలో ఎందుకు ఇది సాధ్యం కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. “ఆంధ్ర ప్రదేశ్ లో చెప్పినట్లుగా 4వేలకు పింఛన్లు పెంచారు. మొదటి సంతకం పెట్టారు. రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైంది. ఏపీని చూసైనా నేర్చుకోవాలి. 4వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలి. పెంపుదల సంగతి పక్కన పెడితే, గత ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు పెన్షన్లు రావాల్సి ఉంది. అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి”అని హరీష్ రావు మండిపడ్డారు.

నీట్ పై రాష్ట్ర ప్రభుత్వం మౌనం ఎందుకు?

నీట్ పరీక్ష వివాదంపై హరీశ్ రావు మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థత వల్ల 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు విద్యార్థులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్‌ చేశారు.

Read More
Next Story