Harish Rao | తూతూ మంత్రంగా గ్రామసభలు!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే పలు ప్రభుత్వ పథకాలకు అర్హులను ఈ గ్రామసభల ద్వారా ఎంచుకోనున్నారు. కానీ ఈ గ్రామసభల్లో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. దాదాపు ప్రతిగ్రామంలో కూడా గ్రామసభలో పాల్గొన్న పలువరు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు చెప్తున్న పథకాలైనా వస్తాయా.. ఆరు గ్యారెంటీల్లా అటకెక్కుతాయా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మీ పాలనపై ప్రజల్లో ఎంత కోపం ఉందో చూస్తున్నారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది ప్రజాపాలన కాదని ముమ్మాటికి ప్రజావ్యతిరేక పాలనే అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే కాంగ్రెస్.. పథకాలపై దృష్టి పెట్టిందని, ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాగానే అన్నీ పథకాలు బంద్ అవుతాయంటూ విమర్శలు గుప్పించారు. మీ సో కాల్డ్ ప్రజా పాలనను ప్రజలు తూర్పారబడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు అనే అంశం కాంగ్రెస్ ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామసభలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు హరీస్ రావు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ గ్రామసభలు అన్నీ కూడా తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలను ఎవరు పట్టించుకోవాలి..
‘‘ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలి’’ అని నిలదీశారు.
ప్రజలు బుద్ది చెప్తారు
‘‘ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు.అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని వ్యాఖ్యానించారు.
అంతా దగానే
‘‘రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి. మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఆరు గ్యారెంటీలు అమలు దగా.. రుణమాఫీ చేయడం దగా.. పంట బోనస్ ఇవ్వడం దగా.. రైతు భరోసా అమలు దగా.. రేషన్ కార్డుల జారీ దగా.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా.. ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమించక ముందే కళ్లు తెరవండి
‘‘మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తరు. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నది. అడుగడుగునా ప్రశ్నిస్తున్నది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు. ఎంత మందిని అరెస్టులు చేస్తారు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.