తెలంగాణలో ఫలించిన గల్ఫ్ కార్మికుల పోరాటం, మృతులకు ఎక్స్‌గ్రేషియా
x

తెలంగాణలో ఫలించిన గల్ఫ్ కార్మికుల పోరాటం, మృతులకు ఎక్స్‌గ్రేషియా

గల్ఫ్ కార్మికుల పోరాటం ఫలించింది. గల్ఫ్ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తుండటంతో వారి కుటుంబాలకు ఆసరా లభించినట్లయింది.


ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ కార్మికులు చేసిన పోరాటం ఫలించింది. సీఎం ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలపై స్పందించింది. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికులకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న జీవో జారీ చేసింది.లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు అక్టోబర్ 7వతేదీన మార్గదర్శకాల జీవో జారీ చేశారు.


ఆర్థిక సహాయం కోసం మృతుల కుటుంబ సభ్యులు పెట్టుకున్న దరఖాస్తులను తహసీల్దార్ల ద్వారా పరిశీలన చేయించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.24 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ. కోటి 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారు. త్వరలో ఎక్స్ గ్రేషియా మంజూరు పత్రాలను మృతుల కుటుంబాలకు అందజేయనున్నారు. ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్మును లాభోక్తుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు.

ఎండపల్లి మండలం కొత్తపేట కు చెందిన గోనె నరేందర్ సింగపూర్ లో, నడిపొట్టు సత్తయ్య ఉక్రెయిన్ లో మృతి చెందారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో లో ఉన్న గల్ఫ్ దేశాల జాబితాలో సింగపూర్, ఉక్రెయిన్ లు లేనందున వీరి దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. ఎక్స్ గ్రేషియా సొమ్మును పంచుకునే విషయంలో మృతుని తల్లికి, భార్యకు మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఒక ఒక దరఖాస్తు పెండింగ్ లో ఉంది. విదేశీ సర్టిఫికెట్ల పరిశీలన కోసం మరి కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.



గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అభయహస్తం

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి భరోసాగా నిలిచారని, గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ అభయహస్తం అందిస్తుందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాల వారు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.




Read More
Next Story