డాగ్ లవర్స్‌కు శుభవార్త,జీహెచ్ఎంసీలో ప్రత్యేక వెటర్నరీ ఆసుపత్రి
హైదరాబాద్‌లో డాగ్ లవర్స్‌కు జీహెచ్ఎంసీ శుభవార్త వెల్లడించింది.శేరిలింగంపల్లిలో కుక్కలతో సహా జంతువుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది.
హైదరాబాద్ నగరంలో జంతు సంరక్షణ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యోచిస్తోంది.శేరిలింగంపల్లి జంతు సంరక్షణ ఆశ్రయంలో కుక్కలతో సహా జంతువుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
- ప్రతిపాదిత వెటర్నరీ ఆసుపత్రి 4,350 చదరపు గజాల స్థలంలో జీహెచ్ఎంసీ యాజమాన్యంలోని స్థలంలో సమగ్ర వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను గురువారం జరగనున్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలోప్రస్థావించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
- ఈ వెటర్నరీ ఆసుపత్రిలో వైద్య మౌలిక సదుపాయాలతోపాటు రక్త పరీక్షలు,ఎక్స్-రేలు,అల్ట్రాసౌండ్, 2డి ఎకో, లాపరోస్కోపీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వెటర్నరీ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు
కుక్కలతోపాటు ఇతర జంతువుల కోసం వెటర్నరీ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్య సంరక్షణ కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేయనున్నారు. జంతు సంరక్షణ కేంద్రం అభివృద్ధిని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు.వెటర్నీరీ ఆసుపత్రిలో ఆపరేషన్‌లు చేసే బాధ్యతను ‘ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్’కి అప్పగించారు. కుక్కల కోసం వెటర్నరీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయమని డాగ్ లవర్ పి రాజా రామ్మోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వెటర్నరీ ఆసుపత్రి ఏర్పాటుపై చర్చ
హైదరాబాద్ నగరంలో వెటర్నరీ ఆసుపత్రి ప్రతిపాదన ఆమోదం కోసం వేచి ఉందని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ధృవీకరించారు. ఈ స్టాండింగ్ కమిటీలో 15 మంది కార్పొరేటర్లకు నిర్ణయాధికారం ఉంది. జంతు ఆసుపత్రి ప్రాజెక్టుతో పాటు మరో 10 ప్రతిపాదనలపై కమిటీ రానున్న సమావేశంలో చర్చించనుంది.
కుక్కల సంరక్షణకు ప్రాధాన్యం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల సంరక్షణకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 17 కేంద్రాలు, పశువైద్యశాలలున్నాయి. ఎల్ బినగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, బేగంబజార్, అంబర్ పేట వెటర్నరీ ఆఫీసర్లు కుక్కలు, ఇతర జంతువులకు చికిత్స అందిస్తున్నారు. కుక్కల దత్తత, షెల్టర్లను హైదరాబాద్ నగరంలో బ్లూక్రాస్ , డెవెన్స్ హోప్, ది పెట్ కేఫ్ కమ్ షెల్టర్, జంతువుల కోసం కారుణ్యసంఘం, ఎమర్జెన్సీ రెస్క్యూ హోం పీఎఫ్ఏ ఏర్పాటు చేసింది.
వెటర్నరీ ప్రత్యేక ఆసుపత్రి అవసరముంది : సంతోషి
హైదరాబాద్ నగరంలో వెటర్నరీ ప్రత్యేక ఆసుపత్రి అవసరముందని నగర యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొటైటీ ప్రతినిధి సంతోషి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణకు డాగ్ లవర్స్ తోపాటు స్వచ్ఛంద సంస్థలు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేపిస్తుందని చెప్పారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి, యాంటీ రాబీస్ వ్యాక్సిన్ అందించడం ద్వారా కుక్క కాటు ఘటనలు పునరావృతం కావని సంతోషి వివరించారు.
కుక్కల బెడద నుంచి పిల్లల్ని కాపాడండి : కాలనీ సంక్షేమ సంఘం
ఒకవైపు పిల్లలపై కుక్కల దాడులు పెరుగుతుండగా, మరో వైపు వాటి సంరక్షణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో కుక్కలు పిల్లలపై దాడి చేస్తూ చంపేస్తున్న దారుణ ఘటనలు జరుగుతుంటే జంతుప్రేమికులు మాత్రం కుక్కల సంరక్షణకు ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.శేరిలింగంపల్లి జంతు సంరక్షణ ఆశ్రయంలో కుక్కలతో సహా జంతువుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుక్కల బెడద నుంచి పిల్లలను కాపాడాలని, కుక్కల సంరక్షణ చర్యలు నిలిపివేయాలని హైదరాబాద్ నగర కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం ప్రభాకరరెడ్డి కోరారు.
Next Story