హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా: చలి గాలుల ప్రభావంతో వణుకుతున్న ప్రజలు
x
తెలంగాణాను వణికిస్తున్న చలిపులి

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా: చలి గాలుల ప్రభావంతో వణుకుతున్న ప్రజలు

తెలంగాణలో చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 3-4°సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం...


ఉత్తరాది నుంచి నిర్విరామంగా వీస్తున్న చలి గాలుల ప్రభావంతో శనివారం ఉదయం హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు దిగిపోయాయి. రాష్ట్ర వాతావరణశాఖ విడుదల చేసిన ముందస్తు హెచ్చరిక ప్రకారం రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత చలికాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.


- ఉత్తర ఈశాన్య దిశల నుంచి చలిగాలులు వీస్తుండటంతో శనివారం హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఉత్తరాది చలిగాలుల ప్రభావం వల్ల రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు శనివారం ఉదయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



- శనివారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు.ఉపరితల గాలులు ఈశాన్య దిశల వైపు నుంచి గంటకు 04 నుంచి 06 కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తదుపరి 24 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు, మబ్బుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో గరిష్ఠ, కనిష్ణ ఉష్ణోగ్రతలు వరుసగా 30డిగ్రీల సెల్సియస్, 9 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు. గాలిలో తేమ శాతం 068 శాతంగా ఉందని ఆయన తెలిపారు.




హైదరాబాద్‌లో వణికిస్తున్న చలిపులి

హైదరాబాద్ నగరాన్ని చలిపులి వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్ బినగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో చలి తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని శనివారం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. నవంబరు 15వతేదీ శనివారం ఉదయం 6గంటలకు పటాన్ చెరులో అత్యల్పంగా 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో 9.8 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్ లో 11.6 డిగ్రీల సెల్సియస్, గచ్చిబౌలిలో 11.9 డిగ్రీల సెల్సియస్, బీహెచ్ఈఎల్ లో 12.4 డిగ్రీల సెల్సియస్, మారేడుపల్లిలో 12.6 డిగ్రీల సెల్సియస్, ఆదర్శ్ నగర్ లో 12.7 డిగ్రీల సెల్సియస్,కుత్బుల్లాపూర్ లో 13.0 డిగ్రీల సెల్సియస్, షాపూర్ నగర్ లో 13.3డిగ్రీల సెల్సియస్ నమోదైందని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది. హైదరాబాద్ నగర శివార్లలోని గ్రీనరీ జోన్లలో చలిగాలుల ప్రభావం పెరిగింది.

ఏడేళ్ల తర్వాత పెరిగిన చలిగాలుల తీవ్రత
తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్ల తర్వాత ఉత్తరాది నుంచి వీచే చలిగాలుల తీవ్రత పెరిగిందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. ఆరు రోజుల క్రితం చలి కాలం ప్రారంభమైనా, గత రెండు రోజులుగా బలమైన చలిగాలులు వీస్తున్నాయని వెదర్ మ్యాన్ చెప్పారు. రాబోయే మూడు రోజులపాటు బలమైన చలిగాలుల ప్రభావం వల్ల తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆయన పేర్కొన్నారు. 2018 వ సంవత్సరం తరహా చలిగాలులు ఈ ఏడాది నవంబరు నెలలో పునరావృతం అవుతున్నాయని బాలాజీ వివరించారు.



వణుకుతున్న తెలంగాణ జిల్లాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో చలిపులి ప్రభావంతో వణుకుతున్నాయి. సంగారెడ్డిలో అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ లో 8.3 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డిలో 8.8 డిగ్రీల సెల్సియస్, మెదక్ జిల్లాలో 9.0 డిగ్రీల సెల్సియస్, రాజన్న సిరిసిల్లలో 9.1 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ లో 9.3 డిగ్రీల సెల్సియస్,కామారెడ్డిలో 9.4 డిగ్రీల సెల్సియస్,నిజామాబాద్ లో 9.4 డిగ్రీల సెల్సియస్,నిర్మల్ లో 10.8 డిగ్రీల సెల్సియస్,కరీంనగర్ లో 11.5 డిగ్రీల సెల్సియస్,మంచిర్యాలలో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్షోగ్రతలు నమోదయ్యాయని వెదర్ మ్యాన్ తెలిపారు.



సింగిల్ డిజిట్ కు చేరిన ఉష్ణోగ్రత

హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లిలో శనివారం ఉదయం ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కుచేరిందని తెలంగాన వెదర్ మ్యాన్ వెల్లడించారు.చలిగాలుల తీవ్రత వల్ల హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని సెంట్రల్ యూనివర్శిటీ వద్ద అత్యల్పంగా 8.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోనూ 8.8 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. నవంబరు 13వతేదీ శుక్రవారం ధూలపల్లి ఫారెస్టు పార్కులో అత్యల్ప ఉష్ణోగ్రత 5.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది. జీడిమెట్ల, ఎస్ ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల్లో చలి ప్రభావంతో ప్రజలు వణుకుతున్నారు. చలిమంటలు కాచుకొని చలి నుంచి ఊరట పొందారు. హైదరాబాద్ నగర శివార్లలోని శేరిలింగంపల్లి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్ ను తాకింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 9 నుంచి 11 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధిపతి డాక్టర్ కె.నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగర శివార్లలో చలి ఎక్కువగా ఉంటుందని, హైదరాబాద్ సాధారణం కంటే చల్లగా ఉంటుందని ఆమె తెలిపారు.

మొత్తానికి ఈశాన్యం నుంచి వేగంగా వీచిన చలి గాలులు తెలంగాణను వణికిస్తున్నాయి. చలిగాలి ప్రభావంతో ఉదయం,రాత్రి వేళల్లో మేఘావృతం, పొగమంచు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రజలు ఈ మార్పులను గమనించి రాత్రి చలికాల సమయంలో అవసరమైన ఉష్ణరక్షణ చర్యలు తీసుకోవడం ముఖ్యం.


Read More
Next Story