తెలంగాణలో  తొలిసారి కనిపించిన ‘గిరినాగు’ పాములు
x
భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో వెలుగుచూసిన గిరినాగు

తెలంగాణలో తొలిసారి కనిపించిన ‘గిరినాగు’ పాములు

ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ వాలంటీర్ల కంటబడిన అరుదైన సర్పాలు...


తమిళనాడు,కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో సంచరిస్తున్న గిరినాగులు (King Cobra) మొట్టమొదటిసారి తెలంగాణ (Telangana) రాష్ట్రంలోనూ వెలుగుచూశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో గిరినాగులు సంచరిస్తున్నాయని తాజాగా తెలంగాణ అటవీశాఖ అధికారులు, హైదరాబాద్ కు చెందిన ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (Friends of Snakes Society)వాలంటీర్ల పరిశీలనలో వెల్లడైంది.తెలంగాణలో ఇన్నాళ్లు లేని అరుదైన గిరినాగులు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) అటవీ ప్రాంతంలో తాజాగా కనిపించడంతో తెలంగాణ అటవీ శాఖ అప్రమత్తమైంది.


గిరినాగుల సంచారంపై పరిశోధనలు
భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతంలో గిరినాగుల సంచారం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ దీనిపై అధ్యయనం చేసి పరిశోధనాపత్రాన్ని తయారు చేసిందని సొసైటీ ప్రధానకార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అడవుల్లో గిరినాగుల గూళ్లు, గిరినాగులు సంచరించిన గుర్తులు భూమిపై కనిపించాయని ఆయన తెలిపారు. దీంతోపాటు కొందరు గిరిజనులు తమకు గిరినాగులు కనిపించాయని అటవీశాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన ఫ్రండ్స్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు పరిశీలన జరిపి గిరినాగులు తెలంగాణలోనూ సంచరిస్తున్నాయని తేల్చారు. అంతరించి పోతున్న అరుదైన గిరినాగుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అటవీశాఖ నిర్ణయించింది.



బుస కొడుతూ...పడగ విప్పే గిరినాగు

నలుపు, తెలుపు చారలు...20 అడుగుల పొడవు...పెద్దగా బుస కొడుతూ సంచరిస్తున్న గిరినాగులు కనిపిస్తే చాలు గజ్జున వణుకుతుంటారు. 20 అడుగుల పొడవు, పదికిలోల బరువు ఉన్న గిరినాగు పడగను నాలుగు అడుగుల ఎత్తులో విప్పుతుంది. పడగవిప్పి బుసకొడుతున్న గిరినాగును చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి.అత్యంత విషపూరితమైన ఈ గిరినాగు కాటువేస్తే చాలు అంతే సంగతులు. గిరినాగును చూస్తే చాలు ఒళ్లు జలదరించడంతో పాటు తీవ్ర భయాందోళనలు చెందుతుంటారు.15 నుంచి 20 ఏళ్ల పాటు జీవించే గిరినాగును కింగ్ కోబ్రా, రాచనాగు అని కూడా పిలుస్తుంటారు.

అత్యంత ప్రమాదకర సర్పం
పాముల్లోకెల్లా గిరినాగు (King Cobra) అత్యంత ప్రమాదకర సర్పం. ఈ నాగు పాము 14 నుంచి 20 అడుగుల పొడవు ఉంటుంది. ఈ నాగు కాటు వేస్తే 10 నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదముందని అటవీశాఖ వన్యప్రాణి నిపుణుడు ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఒక్కో పాము బరువు పది కిలోల పైనే ఉంటుంది.



గిరి నాగుల సంరక్షణకు...

అరుదైన గిరి నాగుల సంరక్షణకు (King Cobras Conservation) తెలంగాణ అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో గిరినాగుల సంచారం అధికంగా ఉన్నట్లు అటవీశాఖ వన్యప్రాణుల విభాగం అధికారులకు సమాచారం అందింది. ఈ వర్షాకాలంలో గిరినాగులు పొలాల్లో సంచరిస్తున్నాయని సమాచారం అందటంతో వాటిని పట్లుకున్న స్నేక్ క్యాచర్లు వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెడుతున్నారు. అరుదైన సర్పజాతికి చెందిన గిరినాగులు అత్యంత ప్రమాదకరమైనవి. వర్షాకాలంలో పాములను తినేందుకు గిరినాగులు బయటకు వస్తున్నాయి.అంతరించి పోతున్న పాము జాతుల్లో గిరినాగు ఒకటని వన్యప్రాణి నిపుడుడు ఎ శంకరన్ చెప్పారు.

గిరినాగు కనిపిస్తే ఇలా చేయండి
గిరినాగు సాధారణంగా కాటు వేయదని, కాని అది కనిపిస్తే కంగారు పడకుండా దాని దారిన అది వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయాలని పరుగెత్తకూడదని ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ చెప్పారు. గిరినాగు కాటు వేస్తే దాని విషం మనిషిలోని నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. కాటు వేస్తే ఊపిరి తీసుకోవడం కష్టమై మరణిస్తుంటారని ఆయన వివరించారు. గిరినాగు కాటుకు భారతదేశంలో మందులు లేవని థాయ్ లాండ్ దేశంలో తక్కువ పరిమాణంలో మందు తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.



గూడు కట్టే గిరినాగులు

మగ గిరినాగులను ఆకర్షించేందుకు ఆడ గిరినాగులు ఫెర్మోన్స్ అనే రసాయన పదార్థాన్ని వెదజల్లుతుంటాయి. ఆ వాసన పసిగట్టిన మగ గిరినాగులు ఆడ గిరినాగులను అనసరించి వాటితో సంభోగిస్తుంటాయి.అలా ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టి 18 రోజులపాటు వాటిని పొదుగుతాయి. గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చే వరకూ తల్లి గిరినాగు అక్కడే ఉండి గుడ్లను సంరక్షిస్తుంది. ఆడ గిరినాగు గుడ్లను సంరక్షించుకునేందుకు పుల్లలతో గూడు కడుతోంది.గుడ్లు పెట్టే ఏకైక పాము గిరినాగు అని వన్యప్రాణి నిపుణులు ఎ శంకరన్ చెప్పారు. గుడ్లను పొదుగుతూ నెల రోజులకు పైగా ఆహారం లేకుండా ఉంటోంది.21వరోజున గిరినాగు పిల్లలు బయటకు వచ్చాక తల్లి నాగు వెళ్లిపోతుంది.గిరినాగులు వేసవికాలంలో జతకట్టి జూన్ చివరి వారంలో గుడ్లు పెడుతుంటాయి.



జనవాసాల్లోనూ గిరినాగుల సంచారం

- విశాఖపట్టణం జిల్లా మాడుగుల గ్రామ శివార్లలోని గడబూరులో ఈ ఏడాది చిన్ని అచ్చిబాబు తన ఇంటి పరిసరాల్లో తుప్పలను తొలగిస్తుండగా అక్కడ ఉన్న 15 అడుగుల గిరినాగు బుసలు కొడుతూ బయటకు వచ్చి పడగ విప్పింది. దాన్ని చూసి భయపడిన అచ్చిబాబు స్నేక్‌ క్యాచర్‌ పెచ్చేటి వెంకటేశ్‌కి ఫోన్ చేశారు. అంతే స్నేక్ క్యాచర్ వెంకటేశ్ వచ్చి గిరినాగును చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని అడవిలో వదిలేశారు.
- మాడుగుల గ్రామంలోని మోడమాంబ కాలనీ శివారులోని ఎలుబండి కనకకల్లం వద్ద మరో గిరినాగు ప్రత్యక్షమవగా, దాన్ని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ పట్టుకొని దాన్ని అడవిలో వదిలేశారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాపికొండల జాతీయ వన్య మృగ అభయారణ్యం పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరినాగుల సంచారం పెరిగింది. ఈ వర్షాకాలంలో కేఆర్ పురం, కామయ్యపాలెం, గడ్డపల్లి, ముంజలూరు, తంగేడికొండ, దారావాడ, కోండ్రుకోట అటవీ ప్రాంతాల్లో గిరినాగులు కనిపించాయని అక్కడి స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
- పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో ఓ ఇంటి బాత్ రూంలో భారీ గిరినాగు కనిపించింది. స్థానిక స్నేక్ క్యాచర్స్ దాన్ని బంధించారు.



గిరినాగులు పాములనే ఆహారంగా తీసుకొని...

గిరినాగులు మనుషులకు మేలు చేస్తుంటాయని ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ (EASTERN GHATS WILDLIFE SOCIETY) వ్యవస్థాపకుడు మూర్తి కంఠిమహంతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సాధారణంగా జెర్రిపోతు,కట్లపాము, నాగుపాము,రక్తపింజర పాములు మనుషులను తరచూ కాటేస్తుంటాయని, వీటి కాట్ల వల్ల మరణాలు సంభవిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న పాములను తింటూ జీవవైవిధ్యాన్ని కాపాడటమేకాకుండా మనుషులకు మేలు చేస్తున్న గిరినాగులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మూర్తి చెప్పారు. నాగుపాములు, కట్లపాములు, పొడ పాములు మనుషులను ఎక్కువగా కాటేస్తుంటాయి. కానీ ఈ పాములను తినే గిరినాగు మనుషులకు మేలు చేస్తుంటాయని వన్యప్రాణి నిపుణులు మూర్తి కంఠిమహంతి చెప్పారు. మనిషి కనిపిస్తే చాలు గిరినాగులు భయపడి పారిపోతుంటాయి.

ఎక్కడ ఉన్నాయంటే...
తెలంగాణలోని పాపికొండల అభయారణ్యం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్రన్ ఘాట్ ప్రాంతాలు గిరినాగులకు అడ్డాగా మారాయి. పాపికొండల్లోని జలతారు వాగు ప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మార్చి నుంచి జులై నెలాఖరు వరకు అడవుల్లో జలవనరులు ఎండిపోయినపుడు గిరి నాగులు నీరు ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. వాగులు, వంకలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో గిరినాగులు ఎక్కువగా ఉంటాయి.తూర్పు కనుమలు, సరిహద్దు గ్రామాల్లో గిరినాగులు కనిపించడానికి కారణం ఇక్కడున్న పచ్చదనం, చల్లగా ఉండే భూములే కారణమని నిపుణులు చెబుతుంటారు.



గిరినాగులను సంరక్షించుకోవాలి

జీవ వైవిధ్యానికి,సమతుల్యతకు ఉపయోగపడుతున్న గిరినాగులను హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972(Indian Wildlife Protection Act 1972) ప్రకారం నేరం. గిరినాగులు అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్నాయి.అంతరించిపోతున్న ఈ అరుదైన గిరినాగులను కాపాడుకోవాలని ఐయూసీఎన్ (ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) అంతర్జాతీయ వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ సూచించింది. ఈ కింగ్ కోబ్రాలు ఇతర పాములను ఆహారంగా తింటూ మనుషులకు మేలు చేస్తాయి కాబట్టి వీటిని కాపాడుకోవాలని ఐయూసీఎన్ IUCN (The International Union for Conservation of Nature) చెప్పింది.

కింగ్ కోబ్రాలను చంపవద్దు
మనుషులను కాటేస్తూ వారి మరణాలకు కారణమవుతున్న జెర్రిపోతు,కట్లపాము, నాగుపాము,రక్తపింజర పాములను తింటూ విషపూరిత పాముల సంఖ్యను నిరోధిస్తూ జీవవైవిధ్యానికి పాటుపడుతున్న గిరినాగులను చంపవద్దని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారి ఎ శంకరన్ కోరారు. మనుషులకు హాని తలపెట్టే పాముల సంఖ్య పెరగకుండా నిరోధిస్తూ మానవాళికి గిరినాగులు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు.

గిరినాగులున్న అడవులను కాపాడండి
గిరినాగులు సంచరిస్తున్న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం అడవులను పోడు కోసం నరకకుండా కాపాడాలని ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ వ్యవస్థాపకుడు మూర్తి కంఠిమహంతి కోరారు. అటవీ గ్రామాల్లోకి గిరినాగులు వచ్చినపుడు మనుషులను చూసి అవి భయంతో పారిపోతుంటాయని ఆయన చెప్పారు. గిరినాగులను చంపాలని చూస్తే అవి బుసలు కొడుతూ కాటేస్తాయని, కానీ వాటి జోలికి వెళ్లక పోతే అవి వాటి దారిన పోతాయని మూర్తి తెలిపారు. గిరినాగు పెద్దపాము వచ్చిందని ప్రజలు వాటిని వెంటాడి చంపుతుంటారని, కానీ వాటిని చంపొద్దని మూర్తి కోరారు.



Read More
Next Story