ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఏఎస్పీ భుజంగరావుపై మరో కేసు
x

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఏఎస్పీ భుజంగరావుపై మరో కేసు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు ఓ భూవివాదంలో ఇరుక్కున్నారు.


తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు ఉన్నతాధికారులు.. ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకుని పోలీస్ స్టేషన్ లోనే పలు దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లకి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తరహాలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు ఓ భూవివాదంలో ఇరుక్కున్నారు. భూకుంభకోణంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. 340 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించడానికి సహకరించారన్న ఆరోపణలతో సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేసింది.

మీర్ అబ్బాస్ అలీఖాన్ అనే వ్యక్తి తన తండ్రి నవాబ్ మీర్ హషీం అలీఖాన్ పేరు మీద ఉన్న భూమిని కాజేసేందుకు పలువురు నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఎస్ మొయినుద్దీన్, ప్రైమ్ ప్రాపర్టీస్ శ్రీనివాస్ రావు, గ్రీన్‌కో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చలమలశెట్టి అనిల్‌ తమ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కూకట్‌పల్లిలోని 1007 సర్వే నంబర్‌లో ఉన్న 340 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నిందితులు మరణించిన తన తండ్రి సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపించారు.

1952లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా తన తాత నవాబ్ రయీస్ యార్ జంగ్ నుండి తన తండ్రి నవాబ్ మీర్ హషీమ్ అలీఖాన్‌కు భూమి సంక్రమించింది అని ఫిర్యాదుదారుడు మీర్ అబ్బాస్ తెలిపారు. 1960లో నవాబ్ రయీస్ యార్ జంగ్ మరణించిన తర్వాత తన తండ్రి చట్టపరంగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే, మొయినుద్దీన్, యాసీన్ షకీర్, మరికొందరు కలిసి తన తండ్రి ఆర్థిక ఇబ్బందులను, న్యాయపరమైన అవగాహన లేమిని ఉపయోగించుకుని మాయమాటలు చెప్పి కల్పిత భాగస్వామ్య సంస్థ ప్రైమ్ ప్రాపర్టీస్‌ను ఏర్పాటు చేశారని అబ్బాస్ అలీ ఖాన్ చెప్పారు. ఆ భూమిని కాజేసే ప్రయత్నంలో నకిలీ సంతకాలతో పత్రాలు, ఇతర మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఏఎస్పీ భుజంగరావు తన తండ్రిని బెదిరించాడని, తానే మోసగాడినని అంగీకరించి క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడని మీర్ అబ్బాస్ పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో, ఫిర్యాదుదారుడి తండ్రిని తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేయమని ఏఎస్పీ ఒక దర్యాప్తు అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కుట్రలో గ్రీన్కో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చలమలశెట్టి అనిల్... శ్రీనివాసరావు, ఇతర నిందితులకు ఆర్థిక సహాయం అందించారని వెల్లడించారు. నిందితులు కొందరు గుండాలను పంపి తనని, తన తండ్రిని కిడ్నాప్ చేసి హింసించారని, బలవంతంగా ఖాళీ కాగితాలు, లీగల్ డాక్యుమెంట్స్ పై సంతకం చేయమని హింసించారని మీర్ అబ్బాస్ అలీఖాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read More
Next Story