Vooke Abbaiah | మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూత..
మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(Vooke Abbaiah).. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు.
పోటీ 8సార్లు.. విజయం 3సార్లు
ఊకే అబ్బయ్య.. 1983లో సీపీఐ(CPI) పార్టీలో చేరారు. ఆ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీలో చేరిన ఏడాదే బూర్గంపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989 ఎన్నికల్లో కూడా సీపీఐ పార్టీ తరపున ఎన్నికల పోటీలో నిలబడినా పరాజయమే పలకరించింది. ఆ తర్వాత 1994లో ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడ్డారు. ఈసారి విజయం వరించింది. ఆ తర్వాత రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో 2009లో ఎర్ర కండువా తీసేసి పసుపు కండువా ధరించారు. ఆయనను టీడీపీ(TDP) కూడా పార్టీలోకి ఆహ్వానించింది. ఆ ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజార్టీతో విజయం అందుకున్నారు. ఆ తర్వాత 2014లో మరోసారి పార్టీ మారి అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుతం BRS) పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఇల్లందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి ఓటమిపాలయ్యారు. తన రాజకీయ జీవితంలో మూడుసార్లు విజయం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు ఊకే అబ్బయ్య. 2018 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు కాస్తంత దూరం పాటించారు. 2023లో ఎన్నికలు జరిగినా ఎక్కడి నుంచి పోటీ చేయలేదు.