‘కుల గణన వల్ల ఇబ్బంది వస్తుందేమో’.. మాజీ సీఎం అనుమానం
తెలంగాణ కుల గణనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సరైన ఆలోచన కాదేమో అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన శరవేగంగా సాగుతోంది. కుల గణనకు చేయడానికి వస్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి సూటిపోటి మాటలు, ఘాటైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కుల గణనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుల గణన వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయేమో అన్న అనుమానాన్ని వ్యక్తపరిచారాయన. అలాగని తాను కుల గణనకు వ్యతిరేకంగా కాదని, కేవలం తనకు అనుమానాలను వ్యక్తపరుస్తున్నానని వివరణ ఇచ్చారు. ఆయన మాటలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. అంతేకాకుండా కుల గణన ద్వారా రిజర్వేషన్లు పెంచాలని అనుకున్నట్లయితే కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమో కూడా ఆలోచించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కుల గణన చేపట్టడంతో సరిపోదని, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తాను భావిస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో కుల గణన విషయంలో చాలా స్పష్టతతో ముందడుగు వేయాలని ఆయన కోరారు.
లేనిపోని సమస్యను కొని తెచ్చుకోవడమేనేమో..
‘‘కింది స్థాయి కులాల వాళ్లమని అనుకునేవాళ్లు.. పెద్ద స్థాయి కులాల వాళ్ల ఇంటి పక్కనే భూములు కొని ఇల్లు నిర్మిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుల గణన వల్ల ఇబ్బంది వస్తుందేమో. ఈ ప్రక్రియ ఎటువంటి గందరగోళం లేకుండా సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలి. 50 శాతం రిజర్వేషన్లకు మాత్రమే సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. కాబట్టి కుల గణనతో రిజర్వేషన్లు పెంచాలని భావిస్తే కోర్టులో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా గ్రామాల్లో అలజడులు రేకెత్తే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టిన వాళ్లు అవుతారు’’ అని సూచించారు.
వేరే మార్గాలు ఉన్నాయి..
‘‘కుల గణన అనే ఆలోచన మంచిది కాదేమో ఒకసారి ఆలోచించండి. ప్రధాని మోదీ కూడా బీసీ వ్యక్తే కదా.. పాలన బాగానే చేస్తున్నారు కదా. ఎస్సీ వర్గీకరణ కూడా సరికాదు. కులం తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమయితే అందుకు వేరే మార్గాలు ఉన్నాయి. కానీ కుల గణన పేరుతో కదిలించి రచ్చ చేసుకోవడమే అవుతుందేమో ప్రభుత్వ ఒక్కసారి ఆలోచించాలి. ఇది నా అనుమానం మాత్రం. నా అభిప్రాయం కాదు. నేను కుల గణనకు వ్యతిరేకం కాదు. నా అనుమానాలను ప్రభుత్వానికి తెలిజేయాలనే స్పందిస్తున్నాను’’ అని ఆయన వివరించారు. అంతేకాకుండా రేవంత్ పాలనపై స్పందిస్తూ.. బాగానే ఉందన్నారు. సీఎం పదవి అనేది సీఎం రేవంత్ వయసుకు తగిన బాధ్యత కాకపోయినా ఆయన పరిపాలన బాగానే చేస్తున్నారని మెచ్చుకున్నారు. మూసీని శుభ్రం చేయడం చాలా ముఖ్యమని, దానిని వీలైనంత త్వరగా కడిగేయాలని కోరారు.
ఎన్యుమరేటర్లకు తలనొప్పులు
సర్వే బృందాలకు చుక్కలు కనబడుతున్నాయి. ఇంటి వివరాల కోసం యజమానులతో మాట్లాడిన సర్వే బృందాలకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఏ రూపంలో అంటే సర్వే బృందం అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి చాలామంది యజమానాలు ఇష్టపడటంలేదు. ఇంట్లో సభ్యుల సంఖ్య, పెద్దవాళ్ళు ఏమి చేస్తున్నారు ? పిల్లలు ఏమి చదువుతున్నారు ? అందుకుంటున్న ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డు వివరాల వరకు సమాధానాలు ఇస్తున్నారు. ఆ తర్వాత అడుగుతున్న ప్రశ్నలకే యజమానులు సమాధానాలు ఇవ్వటానికి ఇష్టపడటంలేదు. సర్వే బృందాలు ఇవే ప్రశ్నలను పదేపదే అడగటంతో ఇళ్ళల్లోని వాళ్ళు సమాధానాలు ఇచ్చేదిలేదని అడ్డంతిరుగుతున్నారు. దీంతో ఎన్యుమరేటర్లకు తీవ్ర తలనొప్పులు తప్పడం లేదు.
ఈ ప్రశ్నలకి సమాధానాలు కష్టమే
ఇంతకీ ఇళ్ళ యజమానాలను ఇబ్బందులు పెడుతున్న ప్రశ్నలు ఏమిటి ? ఏమిటంటే ఇంట్లోని వాళ్ళ ఉద్యోగాలు, జీతాలు, వార్షిక ఆదాయాలు, కడుతున్న ఆదాయపు పన్నులు, బ్యాంకు ఖాతాలు, ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి ? ఎవరెవరికి ఏ బ్యాంకులో ఖాతాలున్నాయి ? ఆధార్ కార్డు నెంబర్, ప్యాన్ నెంబర్, యజమానికి ఉన్న ఆస్తులు, అప్పులు, ఆస్తులుంటే ఏ రూపంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ? వాటి ప్రస్తుత విలువెంత ? ఆస్తులు కొనుగోలు చేస్తే ఎక్కడ కొనుగోలు చేశారు ? ఆస్తులు కొనేందుకు డబ్బులు ఎక్కడినుండి వచ్చాయి ? లాంటి అనేక ప్రశ్నలున్నాయి. ఈ క్రమంలో కొందరు ఎన్యుమరేటర్లపైకి కుక్కలను సైతం వదిలారు. సర్వే మొదలైన మూడురోజులకే. ఈనెలాఖరువరకు సర్వే జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. ముందు ముందు ఇంకెన్ని గొడవలవుతాయో అని సర్వే బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్పందిచండం ప్రాధాన్యతన సంతరించుకుంది.