తెలంగాణలో పులుల కోసం అటవీ గ్రామాల తరలింపు
x

తెలంగాణలో పులుల కోసం అటవీ గ్రామాల తరలింపు

తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాల్లో పులులుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పులుల పరిరక్షణ కోసం అటవీ గ్రామాలను తరలించాలని నిర్ణయించారు.


పులుల మనుగడ ప్రమాదంలో పడిందని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ ప్రకటించింది. పులులను సంరక్షిస్తేనే అడవులు భద్రంగా ఉంటాయనే వాస్తవాన్ని గ్రహించిన తెలంగాణ అటవీశాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం అటవీ గ్రామాల ప్రజలనే తరలించి వారికి మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని నిర్ణయించారు.

- కవ్వాల, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల పరిధిలోని గ్రామాల తరలింపును పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. అటవీ గ్రామాల ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస చర్యలు విజయవంతంగా చేపట్టాలని మంత్రి కోరారు.

పులుల కోసం జింకల పెంపకం
కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకతను చేకూర్చాయి.పెరుగుతున్న పులుల ఆహార లభ్యతకు అనుగుణంగా జింకల సంఖ్యను పెంచే దిశగా అటవీశాఖ చర్యలు చేపడుతున్నారు.

పర్యాటకాభివృద్ధికి చర్యలు
తెలంగాణలోని అటవీ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అక్కమహాదేవి గుహలకు రాష్ట్ర ప్రభుత్వపరంగా భూ,జలమార్గాల్లో యాత్రా సౌకర్యం కల్పించేందుకు గాను అవకాశాలను పరిశీలించాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల - దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో పర్యాటక సేవలు అందించాలని నిర్ణయించారు.సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట-శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.నల్లమల అటవీప్రాంతంలో సలేశ్వరం జాతరను భవిష్యత్ లో అటవీశాఖ చేపట్టనున్న సర్క్యూట్ లలో చేర్చాలని నిర్ణయించారు.

అటవీ గ్రామాల ప్రజలకు ఉపాధి
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దాదాపు 20 శాతం ప్రాంతాన్ని పర్యాటక అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాటేజీలు, సఫారీ వాహనాలు, నేచర్ గైడ్ లు, వంటశాల మొదలైన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలుచేస్తున్నట్లు అధికారులు వివరించారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటి అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక యువతకు శిక్షణనిచ్చి, వారి ఆధ్వర్యంలో వంటశాలను నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తున్నట్లు డీఎఫ్ఓ రోహిత్ తెలిపారు.

టైగర్ రిజర్వ్ లో అటవీ గ్రామాల తరలింపు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని నాలుగు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు.కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించాలని నిర్ణయించారు.పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్ ను ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ప్రభుత్వానికి సూచించారు.

నష్టపరిహారం పెంపు
వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని అటవీశాఖ అధికారులు యోచిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు టైగర్ రిజర్వ్ ల గవర్నింగ్ బాడీస్, టైగర్ కన్సర్వేషన్ ఫౌండేషన్, గవర్నింగ్ బోర్డుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


Read More
Next Story