ఇక జిల్లాల్లో తనిఖీలకు ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ కమిటీలు
x

ఇక జిల్లాల్లో తనిఖీలకు ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ కమిటీలు

హైదరాబాద్ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లాలపై దృష్టి సారించారు.రెండు ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించారు.


ఆహార పదార్థాల కల్తీని నిరోధించడంతో పాటు హోటళ్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఫుడ్ సేఫ్టీపై వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీల పనితీరుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు.


235 హోటళ్లలో తనిఖీలు
హైదరాబాద్ నగరంలో 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌, గోడౌన్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 170 హోటళ్లకు నోటీసులు ఇచ్చామని జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహకు తెలిపారు.

ఇక జిల్లాలపై దృష్టి
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. దీనికోసం రెండు టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించారు.

మయోనైజ్ పై నిషేధం
హైదరాబాద్‌ లోని నందినగర్‌‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు.ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం మయోనైజ్ ను ఫుడ్ సేఫ్ట కమిషనర్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ ఎగ్స్‌తో, ఉడకబెట్టని ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని అదికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహ కు వివరించారు. మయోనైజ్ తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు.

కేరళ రాష్ట్రంలోనూ...

కేరళ రాష్ట్రంలో మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణలోనూ నిషేధం విధించాలని అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహకు నివేదించారు.అధికారుల నివేదిక ప్రకారంగా పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించారు. మయోనైజ్‌పై రాష్ట్రం లో నిషేధం విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 అక్టోబర్ చివరి వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

ఫుడ్‌ సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదు...
రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు,స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్,హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు‌. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉన్న డ్రగ్‌ సేఫ్టీ, ఫుడ్‌ సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఫుడ్‌ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతాం...
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సూచించారు. అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేస్తామన్నారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్‌ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి 24 వేల సాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబ్ లను బలోపేతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

కలెక్టరేట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆఫీసులు
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లలో డ్రగ్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఫుడ్, డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఎవరికి, ఎక్కడ చేయాలో ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. ఆహారం కల్తీ చేయాలంటే భయపడేలా ఆహార కల్తీచేసే వారిపై చర్యలు ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.మంత్రి సమీక్షా సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story