స్పీడు పెంచిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఆందోళనలో ఆహార ప్రియులు..
హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరింత వేగం పెంచారు. ఎక్కడిక్కడ సోదాలు చేస్తూ.. తాము కనుగొన్న విషయాలను బహిర్గం చేస్తున్నారు.
ప్రతిరోజూ కొత్త డిష్‌లు ట్రై చేయడం అంటే ఆహార ప్రయులకు భలే ఇష్టం. పలానా హోటల్లో పలానా వంటకం అదిరిపోయిందంటే అంటే చాలు రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతుంటారు. వారికి తోడుగా ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఇంట్లో వండుకోవడం అన్న మాట కూడా చాలా అరుదైపోయింది. ఎవరు చూసినా భోజన సమానికి ఏ స్విగ్గీ, జొమాటోలలోనే లేకుంటే స్వయంగా వెళ్లే హోటళ్లలో తినేస్తున్నారు. ఈ మధ్య ఈ హోటల్ భోజనాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
వీళ్లందరికీ ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ హోటల్లో ఏముంటుందో అర్థంకాక.. ఆకలైనప్పుడు ఎక్కడ తినాలో అంతుచిక్కక తెగ సతమవుతున్నారు. వారి ఈ కంగారును మరింత పెంచేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ సోదాల వేగాన్ని మరింత పెంచారు. నగరమంతా కలియతిరుగుతూ అనుమానం కలిగిన హోటల్లో దాడులు చేసేస్తున్నారు.
అంతేకాకుండా అక్కడ వాళ్లు గనుగొన్న అత్యంత రుచిరంగా ఉండే ఆహారా పదార్థాల్లోకి వాడే సరుకుల నాణ్యతను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీంతో తమ ఫేవరేట్ హోటల్లో ఎప్పుడు ఈ దాడులు జరుగుతాయో, అక్కడ ఏం బయటపడుతుందో అని తరచుగా హోటల్ భోజనాలు చేసే వారు భయపడుతున్నారు. ఇంట్లో వండుకోలేక.. హోటల్లో తినకుండా ఉండలేక వాళ్లు తెగ సతమతమవుతున్నారు.
నగరంలో ఫుడ్ పాయిజన్ కేసులు అధికమవుతున్న క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ తనిఖీల వేగాన్ని అంతకంతా పెంచేశారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని అనేక హోటళ్ల లైసెన్స్‌లను ఇప్పటికే రద్దు కూడా చేశారు.ఈ తనిఖీల్లో విస్తుబోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ దాడులతో హోటళ్ల యజమానుల్లో కూడా భయం పట్టుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉడిపి, సంతోష్ డాబా, శ్రీరాఘవేంద్ర రెస్టారెంట్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ హోటళ్లలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు అధికారులు. అంతేకాకుండా వంటశాల(కిచెన్) అపరిశుభ్రంగా ఉందని, హోటళ్ల నిర్వాహకులు కుల్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని, కీటకాలు ఆహార పాత్రలపై నుంచి తెగ తిరిగాడటాన్ని తాము గుర్తించామని అధికారులు చెప్తున్నారు. కిచెన్‌లో బొద్దింకలు, ఫంగస్ వచ్చిన అల్లం, మోతాదుకు మించిన ఫుడ్ కలర్స్ వినియోగం జరుగుతుందని కూడా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పలు హోటళ్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్‌లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేసి ఆశ్చర్యపోయారు. ఆ హోటల్ కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. దాంతో పాటుగా కుల్లిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి రోజుల తరబడి నిల్వ ఉంచారని, దానిని ఆహారంలోకి కూడా వినియోగించనున్నారని గుర్తించనున్నట్లు చెప్పారు. కిచెన్ అత్యంత అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. ఈ మేరకు ఆ హోటల్ యామాన్యానికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఇందులో భాగంగానే ఆహార భద్రత నియమ నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వంటకు వినియోగించే ఆహార పదార్థాల నాణ్యత, కిచెన్ పరిశుభ్రత విషయంలో అలసత్వం వద్దని, ఆహార భద్రత నియమాలను పాటించకుంటే సదరు హోటళ్లు, రెస్టారెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి హోటల్ కూడా అన్ని నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.