
విమానాశ్రయంలో కాఫీ సర్వ్ చేస్తున్న ఫుడ్ డెలివరీ రోబోట్
హైదరాబాద్ విమానాశ్రయంలో ఫుడ్ డెలివరీ రోబోట్
విమానాశ్రయంలో కెఫెటేరియాకు వెళ్లకుండానే మీరు లాంజ్ లో కూర్చున్న చోటే టీ లేదా కాఫీ కావాలా? ఇంకెందుకు ఆలస్యం రోబో తిరుగుతుంది చూడండి.
‘‘హాయ్... ఎక్స్‌క్యూజ్ మీ మీరు త్వరగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు టీ లేదా కాఫీ, స్నాక్స్ ఏం కావాలో ఆర్డర్ పెట్టండి, నేను మీకు పర్సనల్ గా ఫుడ్ తీసుకువచ్చి ఇస్తాను’’అంటూ ఫుడ్ డెలివరీ చేసే రోబో హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్ లో కలియ తిరుగుతుంది. విమాన ప్రయాణికుల చెంతకు వచ్చి టీ లేదా కాఫీ కావాలా ? అని అడుగుతోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ప్రయాణికులకు క్షణాల్లో తన ద్వారాన్ని తెరచి టీ లేదా కాఫీని సర్వ్ చేస్తుంది.
విమానాశ్రయంలో రోబో సంచారం
విదేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కనిపించే రోబోలు హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ప్రత్యక్షమయ్యాయి. విమానాశ్రయంలో ప్రయాణికులకు పుడ్ డెలివరీ కోసం నాలుగు చక్రాలతో నడిచే రోబోను తాజాగా రంగంలోకి దించారు.మినర్వా, జీఎంఆర్ ఏరో ఆర్జీ ఫ్రెష్‌ల భాగస్వామ్యంతో ఈ రోబో సేవలందిస్తోంది. సాంకేతిక ఆధారిత సేవా విమాన ప్రయాణికులు కెఫెటేరియాలకు వెళ్లకుండానే లాంజ్ లో కూర్చొని ఉంటే వారి వద్దకే ఈ రోబో వచ్చి కాఫీ, టీ, స్నాక్స్ ను డెలివరీ చేస్తుంది. విమానాశ్రయం లాంజ్ లో తిరుగుతున్న ఫుడ్ అందించే రోబోను చూసిన విమాన ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
మినర్వా గేమ్ ఛేంజింగ్ రోబోట్ సేవలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షించారు. కాఫీ లేదా టీ, స్నాక్స్ ఆర్డర్ చేయడానికి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు రోబోట్ మీకు ఇష్టమైన ఆహారాన్ని మీ వద్దకు వచ్చి డెలివరీ చేస్తుంది. విమాన ప్రయాణానికి లాంజ్ లోకి వచ్చిన ప్రయాణికులకు ఈ రోబో వల్ల సమయం ఆదా అవుతుందని కైలాష్ అనే విమాన ప్రయాణికుడు చెప్పారు. రోబోట్ ఫుడ్ డెలివరీ టు యూ అని బ్రాండ్ చేసిన ఈ స్వయంప్రతిపత్తి గల డెలివరీ బాట్ ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాగా ఉంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
విదేశీ విమానాశ్రయాల్లో రోబోల సందడి
పలు విదేశీ విమానాశ్రయాల్లో పలు పనులను రోబోలే చేస్తుంటాయి. హాంగ్‌జౌ జియావోషన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను మోహరించారు.కంబోడియాలోని టెకో అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు టెర్మినల్ అంతటా రోబోట్లను నడుపుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. పిట్స్ బర్గ్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీ బ్యాగులను ఆటోమేటిక్ గా రోబోనే హాండ్లింగ్ చేస్తుంది. విమానాశ్రయంలో భద్రతను కూడా రోబోనే పర్యవేక్షిస్తోంది. పలు విమానాశ్రయాల్లో రోబోలే క్లీనింగ్ చేస్తుంటాయి.విమానాశ్రయాల్లో కార్ల పార్కింగ్ చేసేందుకు వలెట్ రోబోలున్నాయి.
Next Story