తెలంగాణను చలి పులి వణికిస్తోంది. ఉత్తరాది నుంచి దూసుకొస్తున్న చలిగాలులు (cold winds)తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ జిల్లాల దాకా చలి దెబ్బ (Telangana shivers)తగిలింది. హైదరాబాద్ సహా పది జిల్లాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు పంజా విసిరి ఉదయాన్నే రోడ్లపై దృశ్యమానత తగ్గిపోగా, వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే సూచనలు చేసింది.
తెలంగాణను వణికిస్తున్న చలి
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ ప్రాంతాల్లోని పది జిల్లాలను చలి వణికించేస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం వల్ల సాధారణ ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గిందని, చలి తీవ్రత పెరిగిందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు మంగళవారం ఉదయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 6 .2డిగ్రీల సెల్సియస్ కు తగ్గాయని ఆయన చెప్పారు. బుధ, గురువారాల్లో ఈ చలి తీవ్రత మరింత పెరగనుందని ఆయన పేర్కొన్నారు.
ఈ వారం వణికిస్తున్న చలిపులి
ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలో రాత్రివేళ చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్ చెరులో సాధారణ ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ కాగా అది 3.6 డిగ్రీల సెల్సియస్ తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్ కు తగ్గింది. ఆదిలాబాద్ జిల్లాలో 12.2డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 19.5, రామగుండంలో 16.2 డిగ్రీల సెల్సియస్, మెదక్ జిల్లాల్లో 13.0డిగ్రీల సెల్సియస్, హన్మకొండలో 14.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రివేళే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. హన్మకొండ జిల్లాలో 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది.
శీతల గాలుల ప్రభావంతో తగ్గిన కనిష్ఠ ఉష్షోగ్రతలు
ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అత్యల్పంగా సోమవారం 10.2 డిగ్రీల సెల్సియస్ , బీహెచ్ఈఎల్ లో 13.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వారు తెలిపారు. తెలంగాణ అంతటా శీతాకాలం ప్రారంభమైందని రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాను అల్లాడిస్తున్న చలిపులి
అనూహ్యంగా తగ్గిన ఉష్ణోగ్రతలతో ఆదిలాబాద్ జిల్లాను చలిపులి అల్లాడిస్తోంది. గడేగూడ మండలం లోకారిలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రత 10.4డిగ్రీల సెల్సియస్ కు తగ్గింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో 10.9డిగ్రీల సెల్సియస్ కి పడిపోయింది. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
పొగమంచు ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా పొగమంచు ఏర్పడింది. ప్రజలు ఉదయం 7 గంటల తర్వాత తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా జాతీయ రహదారి 44పై వాహనాల కదలిక తగ్గింది. తెలంగాణలో రాగల 48 గంటల పాటు పాక్షికంగా మేఘావృతమై ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న మంగళవారం ఉదయం వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2డిగ్రీల సెల్సియస్ నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఉత్తరాది నుంచి గాలులు గంటకు 04 నుంచి 06 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని నాగరత్న వివరించారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నా చలిగాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయని ఆమె పేర్కొన్నారు.
నవంబరు నెలలో చలిగాలుల ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత పదేళ్లలో నవంబరు నెలలోనే చలి తీవ్రత పెరిగిందని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని తమ విశ్లేషణలో తేలిందని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 2018వ సంవత్సరంలో నవంబరు 7,19,20వ తేదీల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో 2016వ సంవత్సరం నవంబరు 28 వతేదీన కనిష్ఠ ఉష్ణోగ్రత 12.4 గా నమోదైంది. 2015 వ సంవత్సరం నుంచి పదేళ్ల చలి తీవ్రతను పరిశీలిస్తే తెలంగాణలోని పది జల్లాల్లో నవంబరు నెలలోనే చలి తీవ్రత పెరిగిందని తేలింది.
నేటి నుంచి బలమైన చలిగాలులు...అలెర్ట్ జారీ
తెలంగాణలో మంగళవారం నుంచి ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీస్తాయని, దీని ప్రభావం వల్ల తెలంగాణలో రాగల పదిరోజుల పాటు చలి పులి వణికిస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ టీ బాలాజీ వెల్లడించారు. చలి తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఉత్తర తెలంగాణతోపాటు పది జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి.ఉత్తర, పశ్చిమ తెలంగాణలో మంగళవారం ఉదయం నుంచి చలి తీవ్రత కొనసాగనుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 నుంచి 12డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం, భెల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, మల్కాజ్‌గిరి, కాప్రా,సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 13నుంచి 15డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గనున్నాయి.నవంబర్ శీతాకాలానికి సిద్ధంగా ఉండాలని నవంబర్ 11-19వ తేదీల్లో 8-10 రోజుల చలి తీవ్రత ఉంటుందని వెదర్ మ్యాన్ వివరించారు.
ఆస్తమా రోగులు జర జాగ్రత్త
ఈ ఏడాది చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తెలంగాణలోని ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎ రామ్ మోహన్ రావు సూచించారు. ఆయాసం, ఉబ్బసం, సైనస్ సమస్యలతో బాధపడుతున్న వారు చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చలి తీవ్రత వల్ల జలుబు, తలనొప్పి సమస్యలు ఏర్పడతాయని ఆయన తెలిపారు. చలి గాలులు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇన్ హేలర్ వాడే వారు ఎండ వచ్చే వరకు బయటకు రావద్దని, గోరువెచ్చని నీటిని తాగాలని డాక్టర్ సూచించారు.
ఉత్తరాది చలిగాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం శీతల తరంగంలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే పొగమంచు, రాత్రిపూట చలి గాలుల వణుకు... ఈ చలి పులి మరికొన్ని రోజులు తెలంగాణను వదిలేలా కనిపించడం లేదు.