Hyderabad |హైదరాబాద్లో వెలుగుచూసిన జీబీఎస్ ఫస్ట్ కేసు, అలర్ట్
మహారాష్ట్రలో ప్రబలిన గులియన్ బారే సిండ్రోమ్ హైదరాబాద్ నగరానికి వ్యాపించింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళ ఈ వ్యాధితో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అరుదైన నాడీ సంబంధిత రుగ్మత అయిన గులియన్ బారే సిండ్రోమ్ కేసు హైదరాబాద్ నగరంలో వెలుగుచూడటం కలకలం రేపుతోంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థపై, నరాలపై దాడి చేసే ఈ వ్యాధి మొదటి కేసు నమోదు కావడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రతమత్తమైంది. ఇటీవల మహారాష్ట్రలో ప్రబలుతున్న ఈ అరుదైన వ్యాధి హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన నేపథ్యంలో తాము అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి రవీంద్రనాయక్ శుక్రవారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. లక్షమందిలో ఒకరికో , ఇద్దరికో వచ్చే ఈ అరుదైన వ్యాధి కేసు నమోదు అయిన నేపథ్యంలో తాము దీనిపై వైద్యాధికారులతో సమీక్షించి తగిన ముందస్తు చర్యలు తీసుకుంటామని డాక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు.
ఏమిటీ అరుదైన వ్యాధి ?
గులియన్ బారీ సిండ్రోమ్ ను మరో రకం పక్షవాతమని చెబుతుంటారు. ఇతర రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఈ పక్షవాతం వల్ల కండరాలు చచ్చుపడతాయని న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథం చెప్పారు. వెన్ను నుంచి కాళ్లు, చేతుల దాకా వెళ్లే నరాల మీద పొరను యాంటీ బాడీలు దెబ్బతీయడం వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబతుున్నారు.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి వల్ల శ్వాసకోశ వైఫల్యం వల్ల రోగులు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు.బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తుల్లో ఈ జీబీఎస్ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వ్యాధులతో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటి తర్వాత ఈ సిండ్రోమ్ ప్రారంభం కావచ్చు. జలదరింపు అనుభూతులు, కండరాల బలహీనత, జ్వరం, విరేచనాలు, కడుపు నొప్పి ఈ వ్యాధి లక్షణాలు.అకస్మికంగా తిమ్మిరితో పాటు కండరాల బలహీనతకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
బ్యాక్టీరియానే కారణమా?
ఈ అరుదైన జీబీఎస్ వ్యాధి ప్రబలటానికి కలుషితమైన నీరు, కలుషిత ఆహారం కారణమని వైద్యులు చెబుతున్నారు. క్యాంపిలో బాక్టర్ జెజు అనే బ్యాక్టీరియా ఈ నరాల వ్యాధి ప్రబలటానికి కారణమని వైద్యులు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో వెలుగుచూసిన 130 కేసులు
మహారాష్ట్రలోని పూణేతో పాటు పలు జిల్లాల్లో ఈ అరుదైన నరాల రుగ్మత అయిన గులియన్ బారీ సిండ్రోమ్ కేసుల సంఖ్య 130 కు పెరిగాయని మహారాష్ట్ర వైద్యాధికారులు చెప్పారు. పూణే నగగానికి చెందిన 56 ఏళ్ల మహిళ , షోలాపూర్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఈ జీబీఎస్ వ్యాధితో మరణించారు. పూణే నగరంలోని 74 మంది, పింప్రి, చించ్ వాడ ప్రాంతాల్లో 13 మంది, పూణే గ్రామీణ ప్రాంతాల్లో 9 మంది రోగులు చికిత్స పొందుతున్నారని మహారాష్ట్ర వైద్యాధికారులు చెప్పారు. జీబీఎస్ వ్యాధిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గురువారం సమీక్షించారు. ఈ వ్యాధికి రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వైద్యాధికారులను ఆదేశించారు.
భయాందోళనలు చెందవద్దు : వైద్యశాఖ సంచాలకులు
హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైనా ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి రవీంద్రనాయక్ సూచించారు. లక్ష మందిలో ఒకరో , ఇద్దరికీ వచ్చే ఈ వ్యాధిని చికిత్సతో నయం చేయవచ్చని డాక్టర్ చెప్పారు. ఈ వ్యాధి కొత్తది కాదని అరుదైనదని, దీన్ని గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని డాక్టర్ రవీంద్రనాయక్ కోరారు.
Next Story