చార్మినార్‌లోని గుల్జార్ హౌజ్‌లోని ఒక భవనంలో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించిన ఘటన హైదరాబాద్ పాత నగరంలో సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ అగ్నిప్రమాదం జరిగి రెండు రోజులు గడచినా దీనికి అసలు కారణాన్ని గుర్తించలేదు.అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వారిని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. పోలీసు, అగ్నిమాపక శాఖ, వైద్యశాఖ,విద్యుత్ శాఖల ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నా, ఒక కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది.
- 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన పాత నగరంలో కనీసం ఆటో కూడా వెళ్లేందుకు దారి లేని ఇరుకు గల్లీలు,చిన్న రోడ్లు, చిన్న ప్లాట్లలో మూడు, నాలుగు అంతస్తుల ఎత్తు నిర్మించిన భవనాలు,ఇరుకు మెట్లు, ఇళ్ల మధ్యనే గోదాములు, దుకాణాలు, ఎక్కడా కనిపించని అగ్నిమాపక భద్రతా చర్యల నడుమ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దుర్భర జీవనం గడుపుతున్నారు. దీంతో పాత నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్నిప్రమాదాలు జరిగినపుడు మాత్రం వివిధ ప్రభుత్వ శాఖలు హడావుడి చేస్తాయి తప్ప అగ్నిప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. గుల్లార్ హౌస్ భవనం వద్ద వెంటిలేషన్ లేక పోవడం, అగ్నిప్రమాదం జరిగినపుడు బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మెట్ల మార్గం లేక పోవడం,మంటలను ఆర్పే పరికరాలు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ప్రజలు నివశించడం వల్ల కూడా ప్రమాద తీవ్రత పెరుగుతుంది.
ఫైర్ సేఫ్టీ నిబంధనలేవి?
ఇళ్లు, వాణిజ్య భవనాల్లో క్రమం తప్పకుడా ఎలక్ట్రికల్ వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి. అగ్నిప్రమాదాలు జరిగినపుడు కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలి. ఇళ్లు, కార్యాలయాల్లో ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్స్ ఏర్పాటు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. భవనం ప్రతీ అంతస్తులో ఫైర్ ఎస్టింగ్వీషర్స్ ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు అగ్నిప్రమాదాలు జరిగినపుడు తప్పించుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి.ప్రతీ ఏటా ప్రతీ వాణిజ్య భవనంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ రిపోర్టును అగ్నిమాపకశాఖకు సమర్పించాలి.పాత బస్తీలో ఇరుకు గల్లీలు, చిన్న చిన్న గదుల్లో ఎక్కువ మంది ప్రజలు నివాసం ఉండటం, ఇళ్ల మధ్యనే గోదాములు ఏర్పాటు చేయడం వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని పాతబస్తీ చార్మినార్ నివాసి ముహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అగ్నిప్రమాదాలకు కారణాలెన్నో...
ఈ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెచ్చు పెరగడంతో హైదరాబాద్ ఓల్డ్ సిటీ నిప్పుల కుంపటి మీద కూర్చుంది.వందేళ్ల నాటి పాత ఇరుకు భవనాలు, అడ్డదిడ్డంగా ఉన్న విద్యుత్ వైర్లు, ఇరుకుగా ఉన్న చిన్నమెట్లు, ఫైర్ సేఫ్టీ లేని దుకాణాలు వల్ల పాత నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పడానికి అగ్నిమాపకశాఖ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలుకాని ఇరుకు రోడ్లతో ప్రమాదం జరిగినపుడు ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం, ప్రజల నిర్లక్ష్యం, ఇళ్లలో విద్యుత్ పరికరాలు నాణ్యమైనవి ఏర్పాటు చేయక పోవడం,ఇళ్లు, వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించక పోవడం వల్ల తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
పాత బస్తీలో పోల్ టు పోల్ తనిఖీలు చేయాలి : చార్మినార్ ఏఈ మహమూద్ సైదా
పాత బస్తీలో ఇరుకు గల్లీల్లో విద్యుత్ వైర్లు గజిబిజిగా ఉన్నాయని, ఏ విద్యుత్ వైరు ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలియని పరిస్థితి ఉందని చార్మినార్ ఏఈ మహమూద్ సైదా
‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు జరగకుండా పోల్ టు పోల్ తనిఖీలు చేసి అక్రమ విద్యుత్ వైర్లను తొలగించాల్సి ఉందని చెప్పారు. ఇళ్లలో విద్యుత్ కనెక్షన్లు సరిగా ఉన్నాయో లేదో ప్రతీ ఏటా ప్రజలు తనిఖీలు చేయించుకోవాలని తెలంగాణ ఎస్పీడీసీఎల్ చార్మినార్ ఏఈ సయ్యంద్ మక్సూద్ అహ్మద్ కోరారు. ఇళ్లలో నాణ్యమైన ఐఎస్ఐ మార్కు విద్యుత్ పరికరాలు వాడటంతోపాటు వైరింగ్ కనెక్షన్లను తనిఖీ చేయించుకోవాలని తెలంగాణలోని చార్మినార్ ప్రాంత ఎస్పీడీసీఎల్ డిప్యూటీ ఇంజినీరు మల్లాడి శ్రీధర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అగ్ని ప్రమాదాల్లో ప్రతి రెండు రోజులకు ఒకరు మృతి
హైదరాబాద్‌లో 17 మందిని బలిగొన్న గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద ఘటన అందరినీ కలిచి వేసింది.అగ్ని ప్రమాదాల వల్ల తెలంగాణలో ప్రతి రెండు రోజులకు ఒకరు మరణిస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. అగ్నిప్రమాదాల వల్ల మరణాలు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 2024వ సంవత్సరంలో2,500 ఫైర్ యాక్సిడెంట్స్ జరగ్గా రూ.822 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.గత ఐదేళ్లలో ఆరు వేలకు పైగా ప్రమాదాలు జరిగాయి 2016వ సంవత్సరంలో అగ్నిప్రమాదాల్లో 18 మంది మరణించారు.ఈ సంవత్సరం ఇప్పటివరకు 72 అగ్నిప్రమాదాలు జరిగాయి.ఈ ప్రమాదాల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు.మండే పదార్థాల సరిగా నిల్వ చేయకపోవడం, అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించక పోవడం వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో మే వరకు 5,407 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి, వాటిలో 50 ప్రధాన సంఘటనలు. మొత్తం 5,407 అగ్ని ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో చమురు నిల్వ సౌకర్యాలు, ట్యాంకర్‌ల కారణంగా సంభవించాయి.
ఆస్తి నష్టమూ ఎక్కువే
ఈ ఏడాది జనవరి నుంచి అగ్నిప్రమాదాల వల్ల రూ.262 కోట్ల ఆస్తినష్టం సంభవించిందని హైదరాబాద్ నగర అగ్నిమాపకశాఖ అధికారుల రికార్డులే చెబుతున్నాయి. గత ఏడాది అగ్నిప్రమాదాల్లో రూ.822 కోట్ల ఆస్తి బుగ్గి పాలైంది.తెలంగాణలో రోజుకు సగటున 50 అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిల్లో వంటగదుల్లో జరిగే చిన్నపాటి ప్రమాదాల నుంచి పరిశ్రమల్లో జరిగే భారీ ప్రమాదాల వరకు ఉంటున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఎక్కువ సమయం పాటు ఏసీలు వాడటం, రసాయనాల నిల్వలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ అగ్ని మాపక శాఖ అధికారి నాగిరెడ్డి చెప్పారు.అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోందని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు.
ఐదు నెలల్లో దాదాపు 5,500 అగ్ని ప్రమాదాలు
తెలంగాణలో ఐదు నెలల్లో దాదాపు 5,500 అగ్ని ప్రమాదాలు జరిగాయి. వ్యవసాయ భూములు,బహిరంగ పంటల నిల్వ స్థలాల తర్వాత ఇళ్లలో అత్యధిక అగ్ని ప్రమాదాలు జరిగాయని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ డిఫెన్స్ డిపార్టుమెంట్ రికార్డులే వెల్లడించాయి. ఈ ఏడాది 2025 మొదటి ఐదు నెలల్లోనే 5,407 అగ్ని ప్రమాదాలు జరిగాయి.ఇందులో 50 అగ్నిప్రమాదాలు తీవ్రమైనవి.
ఎన్నెన్నో అగ్నిప్రమాదాలు... - మే 1వతేదీన శివరాంపల్లిలో కారులో మంటలు చెలరేగాయి.
-మే 15వతేదీన బేగం బజార్‌లోని మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. గౌలిగూడ, మొఘల్‌పురా, హైకోర్టు, సెక్రటేరియట్,సాలార్ జంగ్ మ్యూజియం స్టేషన్ల నుంచి ఐదు అగ్నిమాపక వాహనాలతో పాటు సిబ్బందిని రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మే 17: రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలో కారు మంటల్లో చిక్కుకుంది.
మే 9వతేదీన చందానగర్‌లోని ఒక మాల్‌లో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది మాల్ కు వచ్చిన వినియోగదారులు సురక్షితంగా బయటకు రావడానికి సహాయం చేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది.
- మే 7వతేదీన కొరియోగ్రాఫర్ వీర్కాంత్ రెడ్డి పుప్పాలగూడలోని తన నివాసంలో బెడ్‌రూమ్ ఎయిర్ కండిషనర్ నుంచి చెలరేగిన మంటల్లో మరణించారు.
అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు
అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వహించాలని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ డిఫెన్స్ డిపార్టుమెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి తంగరం వెంకన్న కోరారు.తాము ఫైర్ సేఫ్టీ సూచనలు చేస్తున్నా ఆచరణలో ఫైర్ సేఫ్టీ చర్యలు ఎవరూ పాటించడం లేదన్నారు.
- ఏప్రిల్ నెలలో అగ్నిమాపక వారోత్సవాలు జరిగిన ఫైర్ సేఫ్టీకి చర్యలు తీసుకోలేదు.వేసవిలో ఎయిర్ కండిషనర్లు,కూలర్లు వంటి పరికరాల వినియోగం పెరిగాయి. దీని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
- ప్రజలు తమ పాత విద్యుత్ వైరింగ్ వ్యవస్థలను మార్చుకోవాలని కూడాఅధికారులు సూచిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు.ప్రజలు అగ్నిమాపక గుర్తింపు అలారాలను ఉపయోగించాలని, వాటి చుట్టూ తగినంత వెంటిలేషన్ సౌకర్యాలు కల్పించాలని కోరినా ఫలితం లేదు.
- ఎప్పుడూ ఏసీ అమర్చిన గోడకు మంచం లేదా మండే పదార్థాలను పెట్టకూడదు. ఏసీ కింద ఎల్లప్పుడూ కొద్దిగా ఖాళీ ఉంచాలి. ఏసీ పనిచేయకపోతే, దాని నుంచి ఏవైనా నిప్పురవ్వలు కింద పడితే, అవి నేలపై పడతాయి.
అగ్ని ప్రమాదం జరిగితే ఏమి చేయాలి?
- భవనం/అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగితే ముందు అందులో ఉన్న ప్రజలు ఆ ప్రదేశం నుంచి బయటకు రావాలని ఫైర్ సేఫ్టీ అధికారులు సూచించారు.
- గదిలో పొగ వెలువడుతుంటే కింద పాకుతూ పొగపీల్చకుండా బయటకు రావాలి.
- నోటి చుట్టూ తడి గుడ్డను కట్టుకోవాలి.పొగ వ్యాపించకుండా ఉండటానికి బయటకు వచ్చిన ప్రదేశం నుంచి తలుపు మూసివేయాలి.
- ప్రమాదాలు జరిగినపుడు వస్తువులను సేకరించడానికి ఎప్పుడూ వేచి ఉండకూడదు.
- మీరు మంటల్లో చిక్కుకుంటే లేదా బయటకు రాలేకపోతే వెంటిలేషన్ అందుబాటులో ఉంచాలి. వెంటనే అగ్నిమాపక శాఖకు కాల్ చేయాలి.
అగ్నిప్రమాదాలకు కారణాలెన్నో...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలను పాటించాలి.అగ్నిప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లు, గ్యాస్ సిలిండర్ పేలుళ్లు, గుడిసెలు, వ్యవసాయ పొలాల్లో ఎండిన గడ్డి మంటలు అంటుకోవడం వరకు పలుకారణాలు ఉన్నాయి. పలు భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు ప్రాథమిక అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. కొన్ని వాణిజ్య సముదాయాలు అగ్ని నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేయకుండానే పనిచేస్తున్నాయి, ఇదీ ప్రజా భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. చమురు నిల్వ చేయడం, ట్యాంకర్లు ఎక్కువ అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
అరకొర సిబ్బంది...
హైదరాబాద్ నగరంలోనే కాదు పలు జిల్లాల్లోని అగ్నిమాపక విభాగాలు తీవ్రమైన సిబ్బంది కొరత,చాలీచాలని మౌలిక సదుపాయాలతో ఇబ్బంది పడుతున్నాయి.ప్రతీ ఫైర్ స్టేషన్‌లో ఒక అగ్నిమాపక అధికారి, ఇద్దరు లీడింగ్ ఫైర్‌మెన్, ముగ్గురు డ్రైవర్లు, పది మంది కానిస్టేబుళ్లు సహా 16 మంది సిబ్బంది ఉండాలి. పలు అగ్నిమాపక కేంద్రాల్లో అరకొర సిబ్బంది ఉండటంతో ప్రమాదాలు జరిగినపుడు ఆస్తి, ప్రాణ నష్టం పెరుగుతోంది. అయితే, జనగాం అగ్నిమాపక కేంద్రంలో కేవలం 10 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏడుగురు మరియు పాలకుర్తిలో 11 మంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది కొరత కారణంగా అత్యవసర సమయాల్లో అగ్నిమాపక కేంద్రాల నుంచి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు అగ్నిమాపక వాహనం చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది.జిన్నింగ్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, పెద్ద షాపింగ్ మాల్స్,గోడౌన్ యజమానులకు నోటీసులు జారీ చేశామని, సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, వారు నిబంధనలను ఉల్లంఘించి ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరించారు.
పాత భవనాల విషయంలో మార్గదర్శకాలు రూపొందిస్తాం : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం ఘటన జరిగిన నేపథ్యంలో తాము పాత భవనాల విషయంలో మార్గదర్శకాలు రూపొందిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. పాత భవనాల్లో అగ్ని భద్రతా చర్యలు పాటించక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. భవిష్యత్ లో అగ్నిప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక చట్టంలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ భవనంలో ఫైర్ సేఫ్టీ పాటించాలని ఆయన సూచించారు.
ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ కమిటీ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి,హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ , ఫైర్ విభాగం డీజీ నాగిరెడ్డి , హైడ్రా కమిషనర్ రంగనాథ్ ,తెలంగాణ ఎప్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ లతో కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈనెల 18 న జరిగిన గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యల పై ముఖ్యమంత్రికి కమిటీ సమగ్ర నివేదిక ఇస్తుందని మంత్రి చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేస్తూ ప్రతిపాదనలు చేయాలని కోరారు.
మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. భవనంలో భద్రత, విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరంగా నిబంధనల పాటించడంలో లోపించిన అంశాలపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ ఈ చర్య తీసుకుంది.తెలంగాణ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్‌లు తదితరులకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. తదుపరి తేదీలోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.