రైతులను విడుదల చేయాలి : కేటీఆర్ డిమాండ్
x

రైతులను విడుదల చేయాలి : కేటీఆర్ డిమాండ్

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖండించారు.భూములు ఇవ్వకుంటే రైతులను అరెస్టు చేస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.


కొడంగల్ లో ఫార్మా పరిశ్రమల కోసం తమ భూములు ఎందుకు ఇవ్వాలని రైతులు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డిని ప్రశ్నించారని కేటీఆర్ ప్రశ్నించారు.తన్ని అయినా భూములు తీసుకుంటామని సీఎం సోదరుడు చెప్పిన వీడియో ఉందని కేటీఆర్ చెప్పారు. కొడంగల్ లో 16 మంది రైతులు జైలుకు వెళితే , అక్కడి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న చందాన సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ తాబేదారుగా తిరుగుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు.


ప్రజలే తిరుగుబాటు చేశారు...
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర పన్నారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడినా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అని కేటీఆర్ విమర్శించారు.ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆయన చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు తప్పవని బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

పోరాడితే అరెస్ట్ చేస్తారా?
ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. ‘‘ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్‌లు ఎన్నో చూసింది.ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


Read More
Next Story