
వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మంత్రి తుమ్మల
పొలం తుమ్మలకు మొదటి సెక్రెటేరియట్....
తీరిక దొరికినపుడుల్లా పొలం పనులు చేయడం, తన ఊరి రైతులకు సేద్యం మెలకువలు చెప్పడం ఆయనకు అలవాటు...
ఆయిల్ ఫాం రైతులకు మంచి రోజులు వచ్చాయి. టన్ను ఆయిల్ ఫాం గెలల ధర రూ.21000లకి చేరింది., దీని ద్వారా 64,582 మంది ఆయిల్ ఫాం రైతులకు అదనపు లబ్ధి చేకూరింది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1,20,000 ఎకరాల్లో ఆయిల్ ఫాం వేశారు. రైతులకు లాభసాటిగా ఆయిల్ ఫామ్ విస్తరణకు కారణం సేద్యం తీరు తెలిసిన రైతు మంత్రిగా ఉండటం. ఆ మంత్రి ఎవరో కాదు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకు రాష్ట్రంలో ఆయిల్ ఫాం బ్రాండ్ అంబాసిడర్ అని పేరు.
తుమ్మల కోరి వ్యవసాయ శాఖ తీసుకున్నారో లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరి ఆయనకు ఈ శాఖ అప్పగించారో గాని, తెలంగాణ వ్యవసాయ శాఖ పదహారణాల రైతు చేతిలో పడిందని ఖమ్మం జిల్లాలో రైతులు చెబుతుంటారు.
రాష్ట్రంలోని రాజకీయనాయకుల్లో కేవలం వ్యవసాయాన్నే నమ్ముకున్న నేత తుమ్మల నాగేశ్వరరావు. ‘‘నాకు వ్యవసాయం ప్రాణం, పిత్రార్జితమైన భూమిలో వ్యవసాయం చేయడం నాకు ఇష్టం. అందుకే ఇతర వ్యాపారాల వైపు మనసు పోలేదు’’ అని ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. రాజకీయాల్లోకి రాక ముందు ట్రాక్టరుతో పొలాలు దున్ని, దమ్ము చేసి వ్యవసాయ పనులు స్వయంగా చేశారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీరామారావు ప్రారంభించినపుడు 1982వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాడు సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.అయితే, తుమ్మల ప్రధాన వ్యాపకం మాత్రం వ్యవసాయమే. తీరిక దొరికితే చాలు ఆయన పొలం వైపు నడుస్తారు. పొలంలోనే ఎక్కువ సేపు గడుపుతారు. రైతులతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వ్యవసాయం మెలకువలను, పంటల గురించి సలహాలను రైతులకు అందిస్తారు.వ్యవసాయంలో ఇంత అనుబంధం ఉన్న తుమ్మల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే రైతుకు ఆయువుపట్టు వంటి వ్యవసాయం, మార్కెటింగ్, సహకార శాఖలకు మంత్రి అయ్యారు. గతంలో తుమ్మల నాగేశ్వరరావు చిన్ననీటిపారుదలశాఖ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ, భారీ,మధ్యతరహా నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు.
వర్జీనియా పొగాకు నుంచి ఆయిల్ ఫాం తోటల దాకా...
సత్తుపల్లి ప్రాంతంలో వర్జీనియా పొగాకు సాగుకు శ్రీకారం చుట్టి బ్యారన్లు నిర్మించిన తుమ్మల కాలక్రమేణా దాన్ని వదిలి ఆయిల్ ఫాం, జాజికాయ, కొబ్బరి, కోకోనట్, పచ్చివక్క, కూరగాయలు, తర్బూజ, మామిడి తోటల సాగు చేపట్టారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు అధికారిక పర్యటన ముగియగానే నేరుగా గండుగులపల్లిలోని స్వగృహానికి వచ్చి వ్యవసాయ క్షేత్రంలో పనులను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. సాధారణంగా మంత్రులు, రాజకీయ నాయకులు ఆర్ అండ్ బీ అతిథి గృహాల్లో బస చేస్తుంటారని, కానీ తుమ్మల మాత్రం తన సొంతింట్లోనే ఉండి, తీరిక వేళల్లో వ్యవసాయ పనులు చూస్తుంటారని మంత్రి క్యాంప్ ఆఫీసును పర్యవేక్షించే షేక్ నిజాం చెప్పారు.
నోట్లో వేపపుల్ల పెట్టుకొని, లుంగీ కట్టుకొని...
మంత్రిగా బిజీగా ఉన్నా ఖమ్మం జిల్లాకు వచ్చారంటే చాలు తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి నోట్లో వేపపుల్ల పెట్టుకొని, లుంగీ కట్టుకొని తన వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరుగుతూ పంటల సాగులో రైతు కూలీలకు సలహాలిస్తూ ముందుకు సాగుతుంటారని గండుగులపల్లి గ్రామ రైతు కాసాని నాగప్రసాద్ చెప్పారు. పాదులు ఎలా తీయాలి?, అంతర పంటలు ఎలా వేయాలి?, పురుగుల మందులు ఎలా పిచికారీ చేయాలి? పంటలకు నీరందించే విధానాలపై మంత్రి తుమ్మల సలహాలిస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు బయలుదేరారంటే చాలు కారులో నుంచే ఏ పంటలకు నీళ్లు కట్టాలి, తోటల సాగుపై మంత్రి తుమ్మల ఫోన్ లోనే సలహాలిస్తుంటారు. మంత్రిగా తీరిక సమయం దొరికితే చాలు తన వ్యవసాయ క్షేత్రంలో చేయాల్సిన పనుల గురించి కూలీలకు ఫోనులోనే సూచనలు చేస్తుంటారు. మంత్రి తుమ్మలే కాకుండా ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ డాక్టరు అయినా ,ఆయన కూడా వ్యవసాయంపైనే ఆసక్తి చూపిస్తుంటారు. తండ్రి బిజీగా ఉన్నపుడు వ్యవసాయ క్షేత్రం పనులను ఆయన తనయుడు తుమ్మల యుగంధర్ పర్యవేక్షిస్తుంటారని గండుగులపల్లి గ్రామ రైతులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వ్యయసాయంపైనే మక్కువ ఎక్కువ
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా తుమ్మల మాత్రం నిత్యం పొలాల సాగుపైనే ఆసక్తి చూపిస్తుంటారని గండుగులపల్లి గ్రామ రైతు కాసాని నాగప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు అధికారిక కార్యక్రమాలు అయిపోయాక తన స్వగ్రామమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చి పనులను పర్యవేక్షించి వెళుతుంటారని నాగప్రసాద్ పేర్కొన్నారు. గ్రామ రైతులు సాగులో అవలంభించాల్సిన మేలైన పద్ధతుల గురించి చెబుతుంటారని ఆయన వివరించారు. తన వ్యవసాయ క్షేత్రంలో వందకుపైగా ఆవులు, గేదెలు పెంచుతూ దాని ద్వారా వచ్చే పేడను ఎరువుగా వేసి సేంద్రీయ సేద్యాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. కూరగాయలు,పుచ్చకాయలు, గుమ్మడికాయలు పండిస్తూ వాటిని స్థానికంగానే విక్రయిస్తున్నారు.
రైతులకు ఆదర్శం వ్యవసాయశాఖ మంత్రి
తన వ్యవసాయ క్షేత్రంలో అధునాతన సాగు పద్ధతులను అవలంభించడంతోపాటు పంట దిగుబడులు పెంచి తమ రైతాంగానికి మంత్రి తుమ్మల మార్గదర్శిగా నిలిచారని వేంసూరు మండలం వల్లూరుగూడెం గ్రామ రైతు తుమ్మూరు రామిరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక తుమ్మల తమ గ్రామాలకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను పంపించి సాగులో మేలైన సలహాలు ఇప్పించారని చెప్పారు. తమ రైతాంగానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పంటలను పండించాలని మంత్రి సూచించారని, ఆయన బాటలో తనతోపాటు ఎందరో రైతులు పయనిస్తూ కొత్త పంటలు సాగు చేస్తున్నారని రామిరెడ్డి వివరించారు.
సాగులో నూతన ప్రయోగాలకు శ్రీకారం
పండ్లతోటల సాగులో నూతన ప్రయోగాలకు మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారని దమ్మపేట మండల హార్టికల్చర్ ఆఫీసర్ కందగట్ల సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మంత్రి ఆయిల్ ఫాం తోటల్లో అంతర పంటగా జాజికాయ, కోకోనట్, పచ్చి వక్క వేశారని ఆయన చెప్పారు. ఈ ఏడాది మంత్రి తన మామిడి తోటలో ఫ్రూట్ బ్యాగింగ్ ద్వారా మామిడి పండ్ల ఎగుమతి చేయబోతున్నారని సందీప్ తెలిపారు. విదేశాలకు పండ్లను ఎగుమతి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలనేదే మంత్రి లక్ష్యమని ఆయన చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు ఎకరాల్లో జాజికాయ సాగు చేస్తున్నారని సందీప్ వివరించారు. వ్యవసాయంలో అపార అనుభవమున్న రైతు వ్యవసాయ శాఖకు మంత్రి కావడం వల్ల తాము రైతుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలవుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘనందన్ రావు వ్యాఖ్యానించారు.
ఆయిల్‌ఫాం బ్రాండ్ అంబాసిడర్...తుమ్మల
రైతాంగానికి వ్యవసాయంలో మార్గదర్శిగా మంత్రి తుమ్మల నిలిచారని భారత సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆయిల్‌ఫాం సాగును ప్రారంభించిన మంత్రి తుమ్మల ఈ పంటకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని ఆయన పేర్కొన్నారు. మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి ఆయిల్ దిగుమతులను తగ్గించేందుకు వీలుగా తెలంగాణలో ఆయిల్ ఫాం సాగును తుమ్మల ప్రారంభించి ప్రోత్సహించారని వెంకటేశ్వరరావు తెలిపారు. పామాయిల్ దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 27 శాతానికి పెంచేలా కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం వల్ల ఆయిల్ ఫాం గెలల ధర టన్ను 21వేల రూపాయలకు పెరిగిందని చెప్పారు. సాగర్ ఆయకట్టు రైతులకు గోదావరి జలాలు అందించిన ఘనత తుమ్మలకే దక్కిందని వెంకటేశ్వరరావు వివరించారు.
వ్యవసాయమే కుటుంబ జీవనాధారం : మంత్రి తుమ్మల
తాను రాజకీయాల్లో కొనసాగినా, మంత్రిగా పనిచేస్తున్నా, రైతుబిడ్డగా వ్యవసాయమే తమ కుటుంబ జీవనాధారమంటారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తానెప్పుడూ వ్యాపారాలు చేయలేదని, తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమినే నమ్ముకొని సాగులో కొత్త పద్ధతులు అవలంభిస్తూ వాణిజ్య పంటలు పండిస్తూ రైతాంగానికి సలహాలు, సూచనలు ఇస్తున్నానని ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగును తాను చేపట్టడమే కాకుండా తోటి రైతులు కూడా ఆయా పంటలను సాగు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల వివరించారు.
రైతుల కోసం తుమ్మల వినూత్న కార్యక్రమాలు
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం అనే నూతన కార్యక్రమాన్ని జూన్ మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త వంగడాలను రైతాంగానికి అందించడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రోత్సహించనున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తాము అన్ని జిల్లాల్లో రైతు మహోత్సవాలు నిర్వహించనున్నామని ఆయన ‘ఫెడరల్ తెలంగాణ’కు వెల్లడించారు.
Next Story