'హైడ్రా’కు జనం జేజేలు, నేతల్లో ప్రశ్నలు
హైదరాబాద్‌లో చెరువుల్లో నిర్మించిన భవనాలను కూల్చేయిస్తున్న ‘హైడ్రా’చట్టబద్ధతను కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.కాగా హైడ్రా కూల్చివేతలను ప్రజలు సమర్ధిస్తున్నారు.
హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఫుల్ ట్యాంక్ లెవల్ ఏరియాలు, సరస్సుల బఫర్ జోన్‌లు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తోంది.
ఎన్ఆర్ఎస్ఏ చిత్రాల్లో 76 శాతం సరస్సుల కబ్జా
హైదరాబాద్ నగరంలో 1979వ సంవత్సరంలో ఎన్ఆర్ఎస్ఏ తీసిన శాటిలైట్ చిత్రాల్లో 40 సరస్సులు కబ్జా అయ్యాయని తేలింది. 2023వ సంవత్సరంలో శాటిలైట్ చిత్రాలను విశ్లేషించగా 40 సరస్సులు 75 శాతం ఆక్రమణల పాలయ్యాయని వెల్లడైంది.
తగ్గిన హుసేన్ సాగర్ నీటి ప్రదేశం
హుస్సేన్‌సాగర్ సరస్సులో పదో వంతు ఉన్న నీటి ప్రదేశం మాయమైంది.మీరాలం చెరువు కూడా కబ్జాల పాలైంది.గడచిన 45 ఏళ్లలో 4,09,000 చదరపు మీటర్ల తుమ్మలకుంట సరస్సు కనుమరుగైంది.బాలాపూర్ సమీపంలోని బడంగ్‌పేట సమీపంలోని పెద్ద చెరువు ఉనికిలో లేకుండా పోయింది. మీర్‌పేట్ తలాబ్ రూపంలో మ్యాప్‌లో కేవలం నాలుగు శాతం మిగిలింది. పెద్దచెరువు 1979వ సంవత్సరంలో 30,83,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ఆక్రమణల కారణంగా 1,14,000 చదరపు మీటర్లకు తగ్గింది.
కబ్జాల పాలైన చెరువులు
ఉప్పల్‌లో నల్ల హెరువు, పెద్దచెరువు, హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు, సఫిల్‌గూడ సమీపంలోని మిర్యాలగూడ చెరువులు 90 శాతం మేర ఆక్రమణల పాలయ్యాయి. మరో 11 సరస్సులు 80 నుంచి 89 శాతం భూమి కబ్జా అయింది. బండ్లగూడ చెరువు 83 శాతం, పాత అల్వాల్ చెరువు 82 శాతం, పల్లె చెరువు 82 శాతం, ఇంజాపూర్ చెరువు 80 శాతం, కొంపల్లి చెరువు 88 శాతం, ఖాజీగూడ చెరువు 88 శాతం, యాప్రాల్ చెరువు 86 శాతం, జిల్లెలగూడ చెరువు 85 శాతం,రామంతాపూర్ చెరువు 88 శాతం,గుర్రం చెరువు 85 శాతం, కొంపల్లి చెరువు 84 శాతం కబ్జా అయింది.
హైడ్రా పరిధి విస్తరణకు ప్రతిపాదనలు
హైడ్రా పరిధి జీఓ 99 ప్రకారం జీహెచ్ఎంసీ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు దాకా అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతో కూడిన ప్రాంతాన్ని నిర్ణయించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.కాగా హైడ్రా పరిధిని విస్తరించడం గ్రామ పంచాయతీ, మున్సిపల్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని కొందరు ప్రజాప్రతినిధులు అంటున్నారు.
హైడ్రాకు అధికారాలున్నాయ్...
జీఓ 99 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోనూ విపత్తు నిర్వహణ కోసం హైడ్రాను ఏకీకృత ఏజెన్సీగా ప్రకటించింది.తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం 2008, తెలంగాణ పట్టణ ప్రాంతాలతో సహా వివిధ చట్టాల ప్రకారం హైడ్రాకు పలు అధికారాలున్నాయి.శాసన చట్టాల ద్వారా సంక్రమించే అధికారాలను హైడ్రాకు అప్పగించారు.
హైడ్రాపై మజ్లిస్ ఎంపీ, కార్పొరేటర్ల ఫిర్యాదు
అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న హైడ్రా పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరించినా, దీనిపై ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు.హైడ్రా చట్టబద్ధతను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైడ్రాకు ఎలాంటి శాసన, చట్టపరమైన మద్ధతు లేదని మజ్లిస్ కార్పొరేటర్లు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ హైడ్రాకు వ్యతిరేకంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఏ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు.
Next Story