ఈటలతో మల్కాజిగిరి ప్రజలకు మోదీ ఏం చెప్పమన్నారు?
x

ఈటలతో మల్కాజిగిరి ప్రజలకు మోదీ ఏం చెప్పమన్నారు?

ఈటల రాజేందర్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రజలకు ఓ విషయం చెప్పారు.


దొంగ సర్వేలతో, పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరు.. గెలిచేది బీజేపీనే అని సీనియర్ నేత, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో పార్లమెంటు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈటల తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి, కొప్పు భాషా బలపరిచారు.

అంతకుముందు శామీర్ పేట కట్ట మైసమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలను అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈటల నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ ఇంచార్జ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ఇది ప్రత్యేక ఎన్నిక. ఎక్కడికిపోయిన ఈ సారి మోదీకి ఓటు వేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ రద్దు చేసినందుకు ఓటు వేస్తామని చెప్తున్నారు. దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరు.. గెలిచేది బీజేపీనే.

డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది. ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు, దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజిగిరి ప్రజలకు మాత్రమే ఉంది. చైతన్యానికి మారుపేరు మినీ ఇండియా మల్కాజిగిరి. మోదీ తొలి శంఖారవం ఇక్కడే చేసారు. గెలిచిరండి ఏది అవసరం అయితే అది ఇస్తా అని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారు. మల్కాజిగిరి పట్ల నాకో విజన్ ఉంది. మల్కాజిగిరిని సంపూర్ణ అభివృద్ధి చేస్తా. సంపూర్ణ ఆశీర్వాదం అందించండి. నన్ను గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నామినేషన్ వేసిన డీకే అరుణ...

మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి.. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. నామినేషన్ కి ముందు కాటన్ మిల్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీతో కలెక్టరేట్ కి వెళ్లి నామినేషన్ వేశారు.

మెదక్ లో రఘునందన్ రావు...

మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక బీజేపీ నాయకులు బలపరిచారు. కాగా, మంగళవారం అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రఘునందన్ రావు.. స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల సూచనల మేరకు గురువారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ వేసినట్లు తెలిపారు.

నాగర్ కర్నూల్ లో పోతుగంటి భరత్...

నాగర్ కర్నూల్ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా పోతుగంటి భరత్ నామినేషన్ వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని భరత్ తండ్రి, సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి, బీజేపీ నాయకులు బలపరిచారు.

సైదిరెడ్డి తరపున మొదటి సెట్ నామినేషన్ దాఖలు..

నల్గొండ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి శానం పూడి తరపున ప్రతిపాదకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ మొదటి ( 1) సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

Read More
Next Story