భట్టి హవా బలంగా వీస్తోందా ?
x

భట్టి హవా బలంగా వీస్తోందా ?

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో నడుస్తున్న హవా మాత్రం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కదనే చెప్పాలి.


రాజకీయాలంటేనే అనిశ్చితికి మారుపేరు. కాలక్షేపానికి ఆడుకునే వైకుంఠపాళిలో పాములు, నిచ్చెనలు ఉన్నట్లుగా రాజకీయాల్లోకి కూడా పాములు, నిచ్చెనలు చాలానే ఉంటాయి. కాకపోతే పాముల రూపంలో ఎవరు ఎవరిని మింగేస్తారో ? నిచ్చెనలుగా ఎవరు ఆదుకుంటారో చివరినిమిషం వరకు తెలీదు. ఇపుడు విషయం ఏమిటంటే కాంగ్రెస్ లో ఎప్పుడు ఏ నేత హవా నడుస్తుందో ఎవరూ చెప్పలేరు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో నడుస్తున్న హవా మాత్రం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కదనే చెప్పాలి.

ఖమ్మం జిల్లాలోని మధిర(ఎస్సీ) అసెంబ్లీ సీటు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు ఫ్యామిలి మొదటినుండి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నది. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి భట్టికి సోదరుడు. వీళ్ళ పెద్దన్న మల్లు అనంతరాములు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అనంతరాములుది పెద్ద పర్సనాలిటి అంటే చెయ్యెత్తు మనిషినే చెప్పాలి. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధి కుటుంబంతో బాగా సన్నిహితముండేది. అలాంటి అనంతరాములు సడెన్ గా చనిపోయారు. అయితే అప్పటికే అన్న నాయకత్వంలో తమ్ముళ్ళు రవి, భట్టి పార్టీలో యాక్టివ్ అయ్యారు. కాబట్టి మల్లు ఫ్యామిలీది మొదటినుండి కాంగ్రెస్ ఫ్యామిలీ అనే చెప్పాలి. దాంతో భట్టికి పార్టీలో రాజకీయంగా గట్టి పునాది పడిందనే చెప్పాలి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గట్టి మద్దతుదారుల్లో భట్టి కూడా ఒకళ్ళు. వైఎస్ హయాంలో స్ధానికసంస్ధల కోటా ఎన్నికల్లో ఎంఎల్సీగా పోటీచేసి గెలిచారు. తర్వాత ఎంఎల్ఏగా కూడా గెలిచారు. సీఎల్పీకి చీఫ్ విప్, డిప్యుటి స్పీకర్ గా పనిచేశారు. 2009లో వైఎస్ మరణం తర్వాత ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది. చాలామంది కాంగ్రెస్ నేతలు పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరినా భట్టి మాత్రం పార్టీనే అంటిపెట్టుకున్నారు. రెండు ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని వదిలి వెళ్ళలేదు. సోనియాగాంధి, రాహూల్ గాంధితో మంచి సంబంధాలు మైన్ టైన్ చేస్తున్నారు. అందుకనే 2018-23 మధ్య భట్టికి సీఎల్పీ లీడర్ గా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం.

2023 ఎన్నికలకు ముందు భట్టి పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. అదేమిటంటే పీపుల్స్ మార్చ్ పేరుతో ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. ముందు తన నియోజకవర్గం మధిరలో పాదయాత్ర చేసిన భట్టి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అందుకనే ఆదిలాబాద్ టు ఖమ్మం సుమారు 1350 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దాదాపు రెండునెలలు ప్రజల్లోనే ఉంటు, కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జనాలందరినీ కూడగట్టారు. సౌమ్యుడిగా కనబడే భట్టి మంచి మాటకరనే చెప్పాలి. అద్భుతమైన వక్త కాకపోయినా చెప్పదలచుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారనే పేరుంది. పార్టీతో పాటు అధిష్టానంతో కూడా మంచి సంబంధాలు కంటిన్యు చేస్తున్నారు కాబట్టి మంత్రివర్గంలో ఏకైక ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన ఉనికిని చాటుకుంటున్నారంటే అది భట్టికున్న ఇమేజో అనే చెప్పాలి.

ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే అనేక కమిటీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇపుడు రైతు రుణమాఫీకి ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా భట్టీయే ఛైర్మన్. రేవంత్ ఢిల్లీకి వెళ్ళిన చాలా సందర్భాల్లో పక్కనే భట్టి కూడా ఉంటున్నారంటే అధిష్టానం దగ్గర తనకున్న ప్రాధాన్యత కారణంగానే. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో భట్టి కూడా తన వంతుపాత్ర పోషించారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి తొమ్మిది సీట్లను కాంగ్రెస్ గెలవటంలో భట్టి కీలకపాత్రే పోషించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించటంలో, అప్పటి కేసీయార్ ప్రభుత్వాన్ని చాలాసందర్భాల్లో నిలదీసిన విషయం అందరికీ తెలిసిందే. మొదటినుండి పార్టీనే అంటిపెట్టుకునుండటం, అధిష్టానంకు లాయల్ గా ఉండటం, క్యాడర్ తో మంచి సంబంధాలు ఉండటం, ప్రత్యర్ధులను చిత్తు చేయటంలో తనదైన వ్యూహాలు రచించి అమలుచేస్తున్న కారణంగానే ఇపుడు భట్టి హవా బలంగా వీస్తోందని చెప్పాలి.

Read More
Next Story