ప్రభుత్వ వ్యతిరేకతను గ్రామసభల ద్వారా సృష్టించుకుంటున్నారా?
x

ప్రభుత్వ వ్యతిరేకతను గ్రామసభల ద్వారా సృష్టించుకుంటున్నారా?

ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీతలు, తుది జాబితా కాకుండా కేవలం లిస్ట్ ప్రకటించడం పై ఆగ్రహావేశాలు దరఖాస్తుల దందాలంటూ ప్రజల్లో వ్యతిరేకత


తెలంగాణలో రెండు రోజుల కింద ప్రారంభమైన గ్రామసభలు మూడు అరుపులు, ఆరు కోట్లాటలతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి పథకాలు రావాలంటే గ్రామసభలకు తప్పనిసరిగా రావాలని గ్రామాల్లో చాటింపు వేయించడంతో రోజువారీ పనులు ఆపి మరీ గ్రామస్తులు సభలకు హజరవుతున్నారు.

పైగా గత పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, అలాగే ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు తీసుకోకపోవడంతో వీటికి ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏవి రావాలన్న గ్రామ సభలే కీలకం అనే మౌత్ పబ్లిసిటీ జరగడం, అధికారుల నుంచి సరైన వివరాలు అందకపోవడంతో గందరగోళాలకు దారి తీస్తున్నాయి.

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఫెడరల్ గ్రామసభలకు ప్రత్యక్షంగా వెళ్లినప్పుడు కొన్ని వివరాలు గమనించింది. తెలంగాణలో గత ఏడాది అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా ప్రజాపాలన అని ఆరు గ్యారెంటీల అమలు పేరుతో దరఖాస్తులు స్వీకరించింది.
సమన్వయ లోపం
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, ఉచిత కరెంట్ వంటి అనేక పథకాలకు స్థానం కల్పించింది. తరువాత వాటిని కంప్యూటరీకరణ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలు సక్రమంగా అమలు జరుగుతుండగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పై గ్రామాల్లో ఇంటింటి సర్వేలు చేశారు. కొంతమంది మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు చేశారు. అయితే తరువాత వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అధికారులు బయటకు తెలపలేదు.
ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో అధికారులు వచ్చి లబ్దిదారుల వివరాల జాబితాను బహిరంగంగా చదువుతున్నారు. మొదటగా రేషన్ కార్డులు జాబితా, తరువాత ఇందిరమ్మ ఇళ్లు, చివరగా ఫించన్లు జాబితాను చదువుతున్నారు. ఇందులో పేరు లేని వాళ్లు మాత్రమే తిరిగి దరఖాస్తు చేయాలని చెబుతున్నారు.
ఇదే చివరి జాబితా కాదని చెప్పడంతో..
ఈ జాబితాలో కూడా ఇదే చివరి లబ్ధిదారుల జాబితా కాదని అధికారుల మాట. ఇందులో చదివిన వాళ్ల పేర్లను మరోసారి వెరిఫై చేసి తుది లబ్ధిదారుల జాబితాను వెలువరిస్తారని చెబుతున్నారు. ఇదే గొడవలకు కారణమవుతోంది. మరోవైపు జాబితాలో తమ పేరు లేని వాళ్లు సైతం ఇదే బాట పడుతున్నారు. ఒక్క పథకానికి ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని, ఇంతకుముందు చేసిన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
దీనితో గ్రామసభల్లో గందరగోళం నెలకొంటోంది. పోలీసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంతగా సముదాయించినా ప్రజలు శాంతించడం లేదు. తుది జాబితా ఎప్పుడూ ప్రకటిస్తారని కొంతమంది అడుగుతుండగా, మొదటి జాబితాలో మా పేరు ఎందుకు లేదని ఇంకొంతమంది అటకాయిస్తున్నారు. వీరికి సమాధానం చెప్పలేక అధికారులు, నాయకులు సతమతం అవుతున్నారు. ఇది రెగ్యూలర్ ప్రాసెస్ అని చెబుతున్న ఎవరూ వినని పరిస్థితి.
ఈ విషయంపై వరంగల్ మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు కే. రమేష్ ఫెడరల్ తో మాట్లాడుతూ...‘‘ కేవలం లిస్ట్ ల పేర్లు చదవడానికి అధికారులతో గ్రామ సభలు ఎందుకు?’’ అని ప్రశ్నించారు. సంవత్సరం కింద పెట్టుకున్న దరఖాస్తులకు ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను చదవడానికి రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీటిని తుది జాబితా ఎప్పుడూ చేస్తారూ? కొత్తగా తీసుకుంటున్న దరఖాస్తులకు మళ్లీ ఎప్పుడు జాబితా చేసి, అందులో లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెలన్నీ ఆగం చేస్తున్నారని, మీ సేవలో వీలున్నప్పుడూ దరఖాస్తు చేసుకుని, అధికారులతో ఎంక్వైరీ చేసి తుది జాబితా విడుదల చేసే చిన్న పనులకు పెద్ద షో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికొంత గ్రామస్తులు సైతం ఫెడరల్ తో తమ అభిప్రాయాలను వెల్లడించారు. రేషన్ కార్డుకు సంబంధించి తాను, తమ్ముడు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నాం కానీ.. లిస్ట్ లో తమ్ముడి పేరు వచ్చిందని, తన పేరు రాలేదని, ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారని శ్రీనివాస్ అనే గ్రామస్తుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాత ప్రభుత్వం అసలు దరఖాస్తులే తీసుకోలేదు.. కొత్త ప్రభుత్వం దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటోంది.. ఇదేం దందా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో మహిళ మాట్లాడుతూ.. ‘‘ నిన్న ఊళ్ల సాటింపు వేశారు.. అందరూ వచ్చి దరఖాస్తు చేయమని చెప్పిళ్లు.. కానీ ఇక్కడ కు వచ్చి లిస్టుల పేరు రానోళ్లు మాత్రమే దరఖాస్తు పెట్టుల్ని అంటాళ్లు.. పేర్లు సదువుతాంటే లొల్లి అయితాంది.. ఏం అర్థం అయితలే..’’ అని తన బాధను పంచుకుంది.
ప్రతిపక్షానికి ఊపిరి పోస్తున్నారా?
గ్రామసభలు జరుగుతున్న చాలా ప్రాంతాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు అధికారులను నిలదీస్తున్నారు. వీరికి కొంతమంది గ్రామస్తులు సైతం తోడవడంతో అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే తుది జాబితాను ప్రకటించాలని, ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేయాలని అధికారుల ఎదుటే కింద కూర్చోని నిరసలను దిగుతున్నారు. మొత్తానికి గ్రామసభలు నిర్వహణ తెలంగాణ పల్లెల్లో రాజకీయం వేడెక్కడానికి, అధికారంలో ఉన్న పాలకులపై చర్చకు దారి తీసిందనడంలో సందేహం లేదు.


Read More
Next Story