శృతి మించుతున్న డీజే.. నియంత్రణ తప్పదన్న కమిషనర్
x

శృతి మించుతున్న డీజే.. నియంత్రణ తప్పదన్న కమిషనర్

నగరాల్లో డీజే వినియోగంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య డీజే కాస్త శృతి మించిందన్నారు.


నగరాల్లో డీజే వినియోగంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య డీజే కాస్త శృతి మించిందన్నారు. దానిని అదుపు చేయాల్సిన అవసరం ఉందని, చీటికీ మాటికి డీజే అంటూ పెడుతున్న పెద్దపెద్ద శబ్దాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వివరించారు. ఈ డీజే అంశంపైనే సీవీ ఆనంద్ అధ్యక్షతన ఓ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో డీజేపీ నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పండగ, పెళ్లి, చావు ఇలా వేడుకతో సంబంధం లేకుండా డీజేలు వాడేయడం పరిపాటి అయిపోయింది. భారీ సౌండ్‌తో డీజేలు పెట్టుకుని ర్యాలీల ముందు కుర్రకారు కుప్పిగంతులు వేయడం ఓ ట్రెండ్ అయిపోయింది. దీనిపై ఎంతోమంది అనేక ఫిర్యాదులు ఇస్తున్న క్రమంలోనే ఈరోజు సమావేశం నిర్వహించినట్లు సీవీ ఆనంద్ వివరించారు. మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఈ మధ్య డీజే, భారీ శబ్దం చేసే బాణాసంచా కాల్చడం అధికమైపోయిందని ఆయన వివరించారు. వీటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వినాయక చవితి ఉత్సవాలే కారణమా..

అయితే ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు హైదరాబాద్ అంతటా అంబరాన్నంటాయి. దాదాపు లక్ష గణేషులను నిమజ్జనం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. నిమజ్జనం రోజుల దాదాపు ప్రతి రోడ్డున కూడా వినాయకుని విగ్రహాలు బారులు తీరి కనిపించాయి. ప్రతి విగ్రహం దగ్గర కూడా డీజే ట్రక్కులు, వాటి ముందు కుర్రకారు డ్యాన్సులు కనిపించాయి. ఈ సందర్భంగానే అనేక ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పిల్లల వైద్యశాలల నుంచి పోలీసులు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. డీజే శబ్దాల వల్ల పేషింట్లు అదిరిపడుతున్నారని ఆసుపత్రులు చెప్తే, ఈ శబ్దాలకు వయసు మీరిన వారు ఆందోళనకు గురవుతున్నారని వృద్ధాశ్రమాలు తెలిపాయి. అదే విధంగా చిన్న పిల్లల ఆసుపత్రులు కూడా పిల్లలను చూసుకోవడం చాలా కష్టమైపోయిందని, డీజే శబ్దాలకు వాళ్లు ఉలిక్కి పడుతున్నారంటూ వాళ్లూ తమ కష్టాలను వెలిబుచ్చారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ మత సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారన్న మాట వినిపిస్తోంది.

ఫిర్యాదులు కోకొల్లలు

‘‘డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ శబ్దం వల్ల ఇళ్లలో పెద్దవారు, చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు గుండె అదురుతుందని కంగారు పడుతున్నారు. గుండ సంబంధి సమస్యలు ఉన్నవారైతే.. ఈ డీజేల వల్లే తాము చనిపోతామన్న భయమేస్తుందని అంటున్నారు. డీజే సౌండ్స్ శృతి మించుతున్నాయి. ఇష్టానుసారంగా శబ్దాలు పెడుతున్నారు. గణేష్ చతుర్థి ఒకటనే కాదు మిలాద్ ఉన్ నబి వేడుకల్లో కూడా డీజే నృత్యాలు అధికమయ్యాయి. ఏమీ లేకపోయినా.. భారీ స్పీకర్ సెట్లు తెచ్చి.. పెద్ద శబ్దాలతో పాటలు పెడుతున్నారు. పండగ, ఉత్సవం, ర్యాలీల్లో కూడా డీజేలు తెగ వాడేస్తున్నారు. దీనిని కట్టడి చేయాలని అనేక సంఘాల నుంచి వినతులు వచ్చాయి. ఈ అంశంపై అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాం. వారందరి అభిప్రాయాలను ఓ నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నాం. ఆ తర్వాత డీజేలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. డీజే శబ్దాలపై నియంత్రణ లేకుంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి’’ అని ఆయన వివరించారు.

డీజే నిబంధనలు ఇలా..

అయితే గతంలో కూడా డీజేలపై దృష్టి సారించిన ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. వాటి ప్రకారం నివాసం ప్రాంతాల్లో డీజే పెట్టేటప్పుడు వాటి శబ్దం ఉదయం 55 డెసిబిల్స్, రాత్రి 45 డెసిబిల్స్‌కు మించరాదు. అదే విధంగా కమర్షిల్ ప్రాంతాల్లో అయితే ఉదయం 65 డెసిబిల్స్, రాత్రి 55 డెసిబిల్స్‌ను దాటకూడదు. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పగలు 75 డెసిబిల్స్, రాత్రి 70 డెసిబిల్స్‌గానే ఉండాలన్న నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. ఇక స్కూళ్లు, ఆసుపత్రులు, కాలేజీలు ఉన్న ప్రాంతాలైతే సైలెంట్ జోన్స్‌గా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో అసలు డీజే పెట్టనే పెట్టకూడదు. కానీ ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా డీజే శబ్దాలు మోతమోగిస్తున్నారు. ఆసుపత్రులు ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ శబ్దాలు పెట్టి అందరికీ తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారు. ఈ మేరకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సీవీ ఆనంద్ యాక్షన్‌లోకి దిగారు.

Read More
Next Story