రేవతి కుటుంబానికి దిల్ రాజ్ భరోసా..
సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక హామీ ఇచ్చారు.
సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక హామీ ఇచ్చారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని, రేవతి భర్తకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఈరోజు ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం రేవతి కుటంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్బంగానే శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతురాలు రేవతి భర్తకు సినిమా పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్‌ను తాను కలుస్తానని, ఆ సందర్భంగా ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎఫ్డీసీ ఛైర్మన్‌గా బాధ్యత తీసుకుంటానని, ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు చేపడతామని చెప్పారు.
‘‘ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిలా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాను. ఈ అంశానికి త్వరలోనే పులిస్టాప్ పెడదాం. సినీ పరిశ్రమ వాళ్ళతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ పెద్దలకు త్వరలో కలిసి సమన్వయం చేసి ఈ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తాను. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. బాధిత కుటుంబానికి ఎఫ్ డీ సి తరఫున ఉద్యోగాన్ని ఇస్తాము. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసిలాట ఘటన దురదృష్టకరం. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తాను’’ అని తెలిపారు. ఈ సందర్బంగానే శ్రీతేజ ఆరోగ్యంపై అతడి తండ్రి భాస్క్ కూడా కీలక విషయాలు పంచుకున్నారు.
‘‘మా కుమారుడికి కిమ్స్ లో వైద్య చికిత్స అందిస్తున్నారు. అల్లు అర్జున్ తో పాటు పలువురు ప్రతిరోజు శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.. ఆక్సిజన్ పైనే బాబుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బాబు కళ్ళు తెరిచి చూస్తున్నాడు తప్ప సరిగా గుర్తించట్లేదు. మైత్రి మూవీ క్రియేషన్స్ నుంచి 50 లక్షలు, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుండి 25 లక్షలు, అల్లు అర్జున్ 10 లక్షల ఇచ్చినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ, సినీ హీరో అల్లు అర్జున్ నుండి సానుకూల స్పందన రావడంతో తాను కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద తన భార్య పిల్లలు ముందే వెళ్లిపోయారని, తను వెనక ఉన్నట్లు పేర్కొన్న భాస్కర్. వైద్య ఖర్చుల విషయంలో ఆసుపత్రి నుండి ఎవరు అడగడం లేదు.. శ్రీ తేజ కు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు’’ అని వివరించారు.