హైదరాబాద్‌లో విస్తరిస్తున్న డబ్బావాలాల సేవలు
x

హైదరాబాద్‌లో విస్తరిస్తున్న డబ్బావాలాల సేవలు

ముంబయిలో ఇంట్లో వండిన ఆహారాన్ని లంచ్ సమయానికి డబ్బాల్లో అందిన్న డబ్బావాలాల సేవలు హైదరాబాద్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ఆహారాన్ని బాక్సుల్లో అందిస్తున్నారు.


కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, విద్యాసంస్థల్తో చదువుకుంటున్న విద్యార్థులకు వేడి వేడి ఇంటి ఆహారాన్ని డబ్బాల్లో లంచ్ సమయానికి అందిస్తూ, విజయపథంలో పయనిస్తున్న డబ్బావాలాల విజయగాథ మనం విన్నాం.

- ఖచ్చితమైన సమయ పాలన,ప్రత్యేకమైన కోడింగ్ సిస్టమ్ ద్వారా లంచ్ బాక్సుల్ని వేళకు అందిస్తూ ముంబయి డబ్బావాలాలు పేరొందారు. 1890 నుంచి తెల్లటి దుస్తుల్లో సంప్రదాయ గాంధీ టోపీని ధరించి 5వేల మంది డబ్బావాలాలతో కూడిన ముంబై సైన్యం 2,00,000 ముంబైవాసుల ఆకలిని ఇంట్లో వండిన ఆహారంతో తీరుస్తున్నారు.

ఎలా ప్రారంభం అయిందంటే...
ముంబయి నగరంలో 125 సంవత్సరాల క్రితం ఒక పార్సీ బ్యాంకర్ ఆఫీసులో ఉద్యోగులకు ఇంట్లో వండిన ఆహారం అందించాలని కోరుకొని మొదటి డబ్బావాలాకు ఈ బాధ్యతను అప్పగించాడు. చాలా మంది ఉద్యోగులు ఈ ఆలోచనను ఇష్టపడ్డారు. దీంతో లంచ్ డబ్బా డెలివరీకి డిమాండ్ పెరిగింది. దూరదృష్టి గల మహదేవ్ హవాజీ బచ్చే ఈ అవకాశాన్ని చూసి 100 డబ్బావాలాలతో ప్రస్తుత టీమ్ డెలివరీ ఫార్మాట్‌లో లంచ్ డెలివరీ సేవను ప్రారంభించారు..ముంబయి నగరం పెరుగుతున్న కొద్దీ లంచ్ డబ్బా డెలివరీకి డిమాండ్ కూడా పెరిగింది.

హైదరాబాదీ డబ్బావాలాలు
హైదరాబాదీ డబ్బావాలా ఇంట్లో వండిన ఫుడ్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించింది.వెజ్,నాన్-వెజ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఆఫీసులు, పాఠశాలల్లో ఫుడ్ డెలివరీని ప్రారంభించారు. వంటశాలలు ప్రతిభావంతులైన చెఫ్‌ల తో ఆహారాన్ని రుచిగా వండించి హైదరాబాద్‌లోని పాఠశాలలు, మీ పని ప్రదేశంలో ఉద్యోగులకు, విద్యార్థులకు లంచ్‌బాక్స్ డెలివరీ సేవలను అందిస్తున్నారు.భోజన సమయానికి 30 నిమిషాల ముందు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారు.
వృద్ధ తల్లిదండ్రులకు ఇంటి ఆహారం కోసం ఎన్నారైల ఫోన్ కాల్స్
హైదరాబాద్ నగరంలో ఉన్న వృద్ధ తల్లిదండ్రుల కోసం ఎన్నారైలైన వారి పిల్లలు హైదరాబాద్ డబ్బావాలాలకు పోన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్ నగరంలో నివాసముంటుండగా, వారి పిల్లలు అమెరికా, యూకే, కెనడా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తమ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యకరమైన ఇంటి ఫుడ్ అందించమని పలువురు ఎన్నారైలు తమకు ఫోన్ చేస్తున్నారని హైదరాబాదీ డబ్బావాలా సర్వీసులు నడుపుతున్న గాజుల సుధాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ముంబయిలో డబ్బావాలా సర్వీసులను చూసి...
ముంబయి నగరంలో తాను ఉద్యోగం చేసినపుడు డబ్బావాలా సర్వీసులను తాను పొందానని, ఆ సేవలు బాగుండటంతో తాను హైదరాబాద్ కు బదిలీ కాగానే తానే ‘ది డబ్బావాలా’ పేరిట స్టార్టప్ కంపెనీ ప్రారంభించానని చెప్పారు మౌలాలీకి చెందిన త్రినాథ్. ఎంబీఏ చదివిన త్రినాథ్ ది డబ్బావాలా పేరిట లంచ్ బాక్స్ డెలివరీ సర్వీసులను ప్రారంభించారు. తాను ప్రారంభించిన సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని త్రినాథ్ చెప్పారు.

ర్యాపిడో రవాణా చార్జీలు అదనం
గృహిణులతో ఇళ్లలోనే వంటలు చేయించి హోం పుడ్ ను తాము ర్యాపిడో ద్వారా పంపిస్తున్నామని మరో కేటరింగ్ సర్వీసు నిర్వహిస్తున్న నారాయణ రావు చెప్పారు. తమ ఇంటి వంటకు సాధారణ చార్జీలే వసూలు చేసి పంపించడానికి ర్యాపిడో ద్వారా రవాణ చార్జీలు వసూలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమ ఇంటి వంటకు కస్టమర్ల నుంచి విశేష స్పందన ఉందని ఆయన పేర్కొన్నారు.
గృహిణులకు ఉపాధి
గృహిణులకు మంచి ఆదాయం కల్పించడంతోపాటు ఉద్యోగులు, విద్యార్థులకు రుచికరమైన వేడి భోజనం అందించేందుకు హైదరాబాదీ డబ్బావాలాలు విశేష కృషి చేస్తున్నారు. ఉద్యోగుల అభిరుచి మేర నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని గృహిణులతో వండించి, ఆ ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు. దీనివల్ల ఇంటి వంటకాలు అందిస్తున్న గృహిణులకు ఉపాధి లభిస్తుంది.

ఎన్నెన్నో రకాల వంటకాలు
తమ కస్టమర్‌ల అభిరుచి మేర ఇంటి వంటలు చేసే గృహిణలు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, జైన్,ఇతర వంటకాలను అందిస్తున్నారు. అల్పాహారం,మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కస్టమర్‌లకు వన్ టైమ్ ఆర్డర్‌గా లేదా ప్లాన్‌ల ద్వారా డబ్బావాలాలు అందిస్తున్నారు. కస్టమర్‌లు మెను నుంచి వారికి ఇష్టమైన వంటకాలను ఎంచుకొని, ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
డబ్బావాలా బిర్యానీ
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి కేంద్రంగా డబ్బావాలా బిర్యానీ వినియోగదారులకు అందిస్తున్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు ఆర్టర్ చేస్తే చాలు వేడి వేడి బిర్యానీని డబ్బావాలాలు అందిస్తున్నారు. డబ్బావాలాలే కాకుండా స్విగ్గీ, జోమాటో ద్వారా కూడా బిర్యానీని అందిస్తున్నామని డబ్బావాలా బిర్యానీ నిర్వాహకుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కుత్భుల్లాపూర్ కేంద్రంగా డబ్బావాాలా అండ్ కో
కుత్భుల్లాపూర్ కేంద్రంగా డబ్బావాాలా అండ్ కో వెలసింది. లంచ్ లో బగార్ రైస్, చికెన్ 65 , బట్టర్ ఖీమా, ఫ్రాన్స్ ఫ్రై,పుల్కా, బట్టర్ మసాలా , మటన్ కర్రీ, నాన్ వెజ్ డబ్బా ఇలా పలు రకాల వంటకాలతో లంచ్ అందిస్తున్నారు.

ప్రతిరోజూ కొత్త మెనూ
ప్రత్యేకంగా సలాడ్లు, మొలకలు, పండ్లు, సోయా మొదలైన ఆరోగ్యకరమైన పదార్థాలతో లంచ్ ప్యాక్ అందిస్తున్నారు. హైదరాబాదీ డబ్బా వాలా మీ పాఠశాలకు వెళ్లే పిల్లల కోసం తాజా,పోషకవిలువలున్న లంచ్‌బాక్స్‌లను అందిస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయానికి 30 నిమిషాల ముందు స్టీల్ టిఫిన్ బాక్స్‌ల్లో వేడిగా,ఆరోగ్యకరమైన, శాఖాహార భోజనాన్ని అందజేస్తున్నారు.

కార్పొరేట్-ఆఫీస్ లంచ్ బాక్స్ సేవలు
తాము హైదరాబాద్‌లో కార్పొరేట్-ఆఫీస్ లంచ్ బాక్స్ సేవలను డబ్బావాలా డెలివరీ సేవలను అందిస్తున్నామని హైదరాబాదీ డబ్బావాలా సర్వీసు యజమాని గాజుల సుధాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దిల్ సుక్ నగర్ కేంద్రంగా నిర్వహిస్తున్న డబ్బావాలా సర్వీసును నగరంలోని దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, జిల్లెలగూడ, సైదాబాద్, చైతన్యపురి, హబ్సిగూడ, మీర్‌పేట్, అంబర్‌పేట్,మలక్‌పేట, తార్నాక, అల్మాస్‌గూడ, రామాంతపూర్‌,కొత్తపేట, సికింద్రాబాద్, బాలాపూర్,విద్యా నగర్, ఎల్‌బీ నగర్, కర్మన్‌ఘాట్, బడంగ్‌పేట్, నల్లకుంట,వనస్థలిపురం ,చంపాపేట్, నాదర్ గుల్, చాదర్ ఘాట్ ,హయత్‌నగర్ ,గాయత్రి నగర్, ఆదిభట్ల కోఠి,నాగోల్, ఆర్ ఎన్ రెడ్డి నగర్ ,సరూర్ నగర్, కాచిగూడ, నారాయణగూడ,బర్కత్‌పుర, చిక్కడపల్లి ,అబిడ్స్,హిమాయత్ నగర్, హైదర్‌గూడ, బేగంబజార్, నాంపల్లి, సంతోష్‌నగర్, హస్తినాపూర్, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో డబ్బావాలా సేవలు అందిస్తున్నామని గాజుల సుధాకర్ చెప్పారు.

రుచికరమైన ఆహారం సప్లయి
డబ్బావాలా అండ్ క్యాటరింగ్ అనేది హైదరాబాద్‌లోని ఒక సంస్థ. అన్ని రకాల సందర్భాలు, వేడుకలకు రుచికరమైన,ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో ప్రత్యేకత చూపిస్తారు. డబ్బావాలా క్యాటరింగ్ వంటకాలను రుచిగా తయారు చేస్తారు. ఈ వంటకాల్లో ఉత్తర,దక్షిణ భారత శాఖాహార వంటకాలు, ప్రాంతీయ రుచులు కూడా ఉన్నాయి.
ఇంటి భోజనం
ఇంటికి దూరంగా ఉండి, మీ అమ్మ ఇంట్లో తయారుచేసిన ఆహారం మిస్ అవుతున్నారా? మీరుహడావుడిలో ఉన్నా లేదా రోజూ వంట చేయడం ఇష్టం లేకున్నా,తాజా పదార్థాలతో ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మీ ఇంటి వద్దకే అందించే డబ్బావాలా సేవలను చూడండి. లంచ్ నుంచి డిన్నర్ వరకు, మీ ఆహారాన్ని అందిస్తామంటున్నారు డబ్బావాలా నిర్వాహకులు.

ఘర్ ​​కా ఖానా
శాఖాహారం ఘర్ ​​కా ఖానా కోసం వెతుకుతున్నారా? హోమ్స్ కిచెన్ లో తాజా శుభ్రమైన పదార్ధాలతో తయారు చేసిన రుచికరమైన దక్షిణ భారత, ఉత్తర భారతీయ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది ఘర్ కా ఖానా. అన్ని హోమ్లీ కూరలు, పప్పులు, రోటీలు, అన్నం సరైన మొత్తంలో ఉప్పు,మసాలాతో వండి అందిస్తున్నారు. వీరు సలాడ్, రెండు రోటీలు,ఒక ఫ్రై, పప్పు, అన్నం, ఊరగాయ,పెరుగు,మూడు రోటీలు, రెండు కూరలు,అన్నం, రైతా, స్వీట్‌తో కూడిన డీలక్స్ కాంబోతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. మీరు అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాత్రి భోజనం ఆర్డరుపై పొందవచ్చు అంటున్నారు ఘర్ కా ఖానా నిర్వాహకులు.

కేఎస్ఎన్ లంచ్ బాక్స్
అయ్యంగార్ కమ్యూనిటీకి స్థానిక రుచులు, దక్షిణ భారత వంటకాలను కేఎస్ఎన్ అయ్యంగార్ క్యాటరర్లు సికింద్రాబాద్‌లో అందిస్తున్నారు. వారి వంటకాల్లో తక్కువ ఉప్పు, నూనెతో ఇంట్లో వండిన నిజమైన అనుభూతిని కలిగిస్తుంటాయి. వారి యాప్-ఆధారిత టిఫిన్ సేవ అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు రోజువారీ భోజనాన్ని అందిస్తున్నారు. మీ భోజనాన్ని డెలివరీ సమయాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు.





Read More
Next Story