తెలంగాణకి రెడ్ అలర్ట్.. విద్యాసంస్థలకు సెలవులపై సీఎస్ కీలక ఆదేశాలు
x

తెలంగాణకి రెడ్ అలర్ట్.. విద్యాసంస్థలకు సెలవులపై సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని శాంతి కుమారి సూచించారు. విద్యాసంస్థలకు సెలవుల అంశంలో పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డ్యాంలు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతిని బట్టి ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కి అప్డేట్ చేయాలని ఆదేశించారు.

తెలంగాణకి రెడ్ అలర్ట్...

భారత వాతావరణ శాఖ తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ కి కూడా భారీ వర్ష సూచన చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లను, ఆయా శాఖల అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Read More
Next Story