కబ్జాదారులపై ఇక క్రిమినల్ కేసులు, రంగంలో దిగిన హైడ్రా పోలీసులు
హైడ్రా చెరువుల కబ్జాదారులపై ఇక క్రిమినల్ కేసులు పెట్టనుంది.హైడ్రాకు రెవెన్యూ అధికారాలు బదలాయించడంతోపాటు హైడ్రా పోలీసుస్టేషన్లను తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు కొత్తగా రెవెన్యూశాఖ అధికారాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని నిర్ణయించింది. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను కూల్చివేసేందుకు వీలుగా హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చేందుకు వీలుగా రూపొందించిన ప్రతిపాదనలకు తెలంగాణ న్యాయశాఖ ఆమోదించింది. రెవెన్యూ ఆక్రమణల నిరోధక చట్టం అధకారాలను హైడ్రాకు కల్పించనున్నారు. రెవెన్యూ శాఖతోపాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించారు.
- చెరువుల్లో నిర్మించిన అక్రమ భవనాలకు ఆస్తి పన్ను మదింపు చేయవద్దని, పీటీఐఎన్, మంచినీటి, విద్యుత్ కనెక్షన్లను ఇవ్వవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులకు లేఖ రాశారు.
- నీటిపారుదలశాఖ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచి హైడ్రాకు అదనంగా ఉద్యోగులను నియమించాలని నిర్ణయించారు. తద్వారా హైడ్రాను బలోపేతం చేయడం ద్వారా చెరువులను పరిరక్షించాలని నిర్ణయించారు.
హైడ్రాకు 23 మంది పోలీసు అధికారులు
హైడ్రాకు 23 మంది పోలీసు అధికారులను నియమిస్తూ రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీ మహేష్ భగవత్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15 మంది ఇన్ స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు ఆర్ఎస్ఐలు, ముగ్గురు ఎస్ఐలను హైడ్రాకు కేటాయించారు.చెరువుల్లోని ఆక్రమణల కూల్చివేతల సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు కబ్జాదారులపై హైడ్రా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
హైడ్రా క్రిమినల్ కేసులు
ఇప్పటికే కొందరిపై హైడ్రా క్రిమినల్ కేసులు నమోదు చేసింది.హైడ్రా ప్రత్యేక పోలీసుస్టేషన్లు ఈ నెలాఖరు లోగా ఏర్పాటు కాగానే కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకునే వారిపైన కూడా హైడ్రా క్రిమినల్ కేసులు పెడుతుందని ఏవీ రంగనాథ్ ప్రకటించారు.మాదాపూర్‌లోని సున్నం చెరువు వద్ద తమ ఇళ్లను కూల్చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని ఒంటిపై పెట్రోల్ పోసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా వారందరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
హైడ్రాకు పోలీసు అధికారాలు
హైడ్రా పోలీస్ స్టేషన్ అధికారాలను పొందింది. హైడ్రా కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి,క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి అనుమతిస్తుంది. కలెక్టరేట్‌ల జిల్లా టాస్క్‌ఫోర్స్, పట్టణ స్థానిక సంస్థలు ఇతర విభాగాలతో కలిసి కూల్చివేతలను చేపట్టనున్నారు. కూల్చివేత నోటీసులో వ్యవధి పేర్కొంటూ నోటీసును అందజేస్తారు.ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించమని తాము కోరతామని, వారు కూల్చకుంటే తామే కూలుస్తామని హైడ్రా అధికారులు చెప్పారు.
Next Story