రేవంత్ కూతురి నిశ్చితార్ధం చుట్టూ ఎన్ కన్వెన్షన్ వివాదం
x

రేవంత్ కూతురి నిశ్చితార్ధం చుట్టూ ఎన్ కన్వెన్షన్ వివాదం

కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేయగానే అప్పుడెప్పుడే ఇదే సెంటర్లో జరిగిన ఒక ఫంక్షన్ ఇపుడు వైరల్ అవుతోంది.


రాజకీయంగా రచ్చచేయటానికి ఇది అది అనే తేడా ఏమీ కనబడటంలేదు. ఏ చిన్న ఘటన జరిగినా దానిచుట్టూ ముందు వివాదాలు ముసుకుంటున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని 2500 చదరపు కిలోమీటర్ల పరిధిలో చెరువులు, కుంటులను ఆక్రమించి చేసిన నిర్మాణాలను, ప్రభుత్వ భూముల్లో చేసిన అక్రమనిర్మాణాలపైన హైడ్రా గురిపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికి 160 నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా సుమారు 165 ఎకరాలను స్వాధీనంచేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది.

హైడ్రా చర్యలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెచ్చిపోతోంది. సామాన్యుల నిర్మాణాలను అక్రమనిర్మాణాలంటు కూల్చేయటం కాదు ముందు ప్రముఖుల ఫాంహౌసులు, నిర్మాణాలను కూల్చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారు.ఇందులో భాగంగానే జనంకోసం అనే సంస్ధ కన్వీనర్ భాస్కరరెడ్డి తుమ్మిడికుంటను ఆక్రమించి నాగార్జున నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రాకు ఫిర్యాదుచేశారు. పనిలోపనిగా 21వ తేదీనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రాకు ఫిర్యాదుచేశారు. సరే, ఎవరు ఫిర్యాదుచేశారనేది అప్రస్తుతం. ఎందుకంటే శనివారం ఉదయమే హైడ్రా ఎన్ కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టంచేసేసింది. ఆరు భారీ క్రేన్లను పెట్టి కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసింది.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే నాగర్జునకు ఉన్న రాజకీయ పలుకుబడి అందరికీ తెలిసిందే. అలాంటిది కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేయగానే అప్పుడెప్పుడే ఇదే సెంటర్లో జరిగిన ఒక ఫంక్షన్ ఇపుడు వైరల్ అవుతోంది. రోజూ ఈ సెంటర్లో ఎన్నో ఫంక్షన్లు జరుగుతుంటాయి మరి ఒక్క ఫంక్షనే వైరల్ ఎందుకవుతోంది ? ఎందుకంటే ఆ ఫంక్షన్ ఇంకెవరిదో కాదు స్వయంగా రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిందే. రేవంత్ కూతురు నైమిషారెడ్డి నిశ్చితార్ధం ఇదే ఎన్ కన్వెన్షన్లో జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. 29 సెకన్లున్న వీడియోలో కూతురి నిశ్చితార్ధం వేడుకలో రేవంత్ దంపతులు, పెళ్ళికొడుకు తల్లి, దండ్రులు కనబడుతున్నారు. నిశ్చితార్ధం సందర్భంగా రేవంత్ దంపతులు చేస్తున్న పూజ కూడా స్పష్టంగా కనబడుతోంది.

ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగవైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇపుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమనిర్మాణమని కూల్చేసిన రేవంత్ అప్పట్లో ఇదే సెంటర్లో నిశ్చితార్ధం ఎలాగ చేశారు ? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ నెటిజన్లలో ప్రతిపక్షాల సోషల్ మీడియా గ్రూపులు కూడా ఉంటాయనటంలో సందేహంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కూతురి నిశ్చితార్ధం జరిగినపుడు రేవంత్ ప్రతిపక్షం టీడీపీలో ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమనిర్మాణమని రేవంత్ కు తెలిసే ఉంటుందనటంలో సందేహంలేదు. అది అక్రమనిర్మాణమని తెలిసినా రేవంత్ చేయగలిగేది ఏమీలేదు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించి కూడా ఏమీ చేయలేదు.

కన్వెన్షన్ సెంటర్ ఉంది కాబట్టి రేవంత్ తన కూతురి నిశ్చితార్ధం ఫంక్షన్ నిర్వహించుంటారు. ఇందులో తప్పేమీలేదు. అయినా ఇపుడు అక్రమనిర్మాణమని కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేయటానికి అప్పట్లో కూతురి నిశ్చితార్ధం జరపటానికి ఏమి సంబంధమో అర్ధంకావటంలేదు. రేవంత్ ముఖ్యమంత్రి హోదాలో అక్రమనిర్మాణమని తెలిసీ కన్వెన్షన్ సెంటర్లో ఫంక్షన్ జరిపుంటే అప్పుడు తప్పుపట్టినా అర్ధముండేది. అక్రమనిర్మాణం నాగార్జునదని తెలిసినా దాన్ని హైడ్రాతో కూల్చేయించినందుకు రేవంత్ ను అభినందించాల్సిన జనాలు విచిత్రంగా ఎప్పటిదో ఫంక్షన్ వీడియోను ఇపుడు బయటకులాగి నిలదీస్తుండటమే విచిత్రంగా ఉంది. అందుకనే రాజకీయంగా రచ్చచేయటానికి ఇది అది అనే తేడానే కనబడటంలేదు.

Read More
Next Story