రుణమాఫీకి మరో డెడ్‌లైన్.. సెంటిమెంట్ కోసమేనా..
x

రుణమాఫీకి మరో డెడ్‌లైన్.. సెంటిమెంట్ కోసమేనా..

రైతు రుణమాఫీ ప్రస్తుతం తెలంగాణ అంతటా హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ విషయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.


రైతు రుణమాఫీ ప్రస్తుతం తెలంగాణ అంతటా హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ విషయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మరో డెడ్‌లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో డిసెంబర్ సెంటిమెంట్ అధికమవుతోంది. నేతల్లో అయినా ఈ ఎటాచ్‌మెంట్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది 2023 డిసెంబర్ 9వ తేదీ కావడమే ఈ సెంటిమెంట్‌కు కారణం. ఇప్పుడు మరోసారి తమ ప్రభుత్వం వచ్చి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా 9 డిసెంబర్ 2024ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా, మరోసారి విక్టరీ టేస్ట్ చూడాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

ఇందుకోసమే రైతు రుణమాఫీని స్పెషల్ డిష్‌గా మార్చుకోనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే రుణమాఫీ అరకొరగా జరిగిందంటై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. వారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టేలా డిసెంబర్ 9న రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రతిపక్షాలను విమర్శలను కూడా అదే రోజున గట్టిగా తిప్పికొట్టాలని కూడా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవైపు ప్రతిపక్షాలకు ఘాటు సమాధానం ఇవ్వడంతో పాటు రైతుల ఓట్లు చేజారకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేలా డిసెంబర్ 9న భారీ ప్లాన్ చేస్తోందని సమాచారం. నేతలు చెప్తున్న మాటలకు కూడా దీనినే సూచిస్తున్నాయి. రుణమాఫీకి డిసెంబర్ 9ని సరికొత్త డెడ్‌లైన్‌గా రేవంత్ సర్కార్ ఫిక్స్ చేసుకుందని వారి మాటలను బట్టి అర్థమవుతోంది.

అందరిదీ అదే మాట

‘డిసెంబర్ 9 నాటికి తెలంగాణలోని ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుంది’ అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పదేపదే చెప్తున్న మాట. ఆఖరికి ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో కూడా సందర్భం కాకపోయినా కలిపిచ్చుకుని మరీ మంత్రులు ఈ ప్రస్తావన తీసుకురావడం ఈ విషయాన్ని చెప్పకనే చెప్తుంది. పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రులు, నేతలంతా కూడా రైతు పాటే పాడటం గమనార్హం. ఈ సందర్బంగానే వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో రూ.73వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, 15 రోజుల్లో రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామని మంత్రులు చెప్పారు. అంతేకాకుండా కొన్ని సాంకేతిక లోపాల వల్ల రుణమాఫీ ఆలస్యమైందని, వాటిని సరిచేసి త్వరలో ప్రతి లబ్ధిదారుకు న్యాయం చేస్తామని భరోసా కూడా ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ఇందిరా రూట్‌లోనే రేవంత్ కూడా

ఈ విషయంలో భట్టి విక్రమార్కకు మంత్రి పొంగులేటి వంత పాడారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. రైతులకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ రైతులను ప్రసన్నం చేసుకోవడానికి యత్నించారు. ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం రేవంత్ రెడ్డి కూడా ఇందిరా గాంధీల కృషి చేస్తున్నారని, రేవంత్ ఒక విప్లవనాయకుడంటూ చెప్పుకొచ్చారు మల్లు రవి. ఏది ఏమైనా రైతు రుణమాఫీ పూర్తికి కాంగ్రెస్ పార్టీ 9 డిసెంబర్‌ను డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్లు నేతల మాటలతోనే స్పస్టం అవుతోంది. ఇంతలో వీలైనంత మందికి విడతల వారీన రుణమాఫీ అందిస్తారా లేకుంటే డిసెంబర్ 9న ఒకేసారి మిగిలిన లబ్ధిదారులకు రుణమాఫీ చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారా అన్నది చూడాలి.

Read More
Next Story