తెలంగాణ చిహ్నంలో మార్పులపై కాంగ్రెస్ క్లారిటీ
x

తెలంగాణ చిహ్నంలో మార్పులపై కాంగ్రెస్ క్లారిటీ

తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాల రగడ మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు.


తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాల రగడ మొదలైంది. అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' కీరవాణి చేత కంపోజ్ చేయిస్తుండటంపై ఇప్పటికే వివాదం రాజుకుంది. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయడానికి పూనుకోవడంతో దుమారం మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టు చకచకా మార్పులు చేర్పులు చేసుకుంటూ అవతరణ వేడుకలపై ఏర్పాట్లను ముమ్మరం చేసుకుంటోంది.

రాష్ట్ర చిహ్నంలో మార్పులపై విమర్శలు...

రాష్ట్ర చిహ్నంలో మార్పలు చేస్తున్నట్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం, దీనిపై సమీక్ష చేస్తోన్న కొన్ని ఫోటోలు బయటకి రావడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారింది అని విమర్శించారు.

"ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి!!?? “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి!!?? అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా?" అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

"కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు గుర్తులు కాదు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను తొలగిస్తే సహించేది లేదని, చిహ్నాలను తొలగిస్తే ప్రజాఉద్యమమేనని" కేటీఆర్ హెచ్చరించారు.

రాజముద్ర మార్పుపై కాంగ్రెస్ స్పష్టత..

రాజముద్రలో మార్పులు చేయడంపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. మార్పులని వ్యతిరేకిస్తోన్న బీఆర్ఎస్ శ్రేణులకు కౌంటర్ ఇచ్చింది. "రాజ్యం తెచ్చిన నిజమైన రాజులు ఎవరయ్యా అంటే మన తెలంగాణ అమరవీరులు. వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసి, రాజ్యం ఏలే రాజులు.. మేమే తెలంగాణకు సర్వం.. సర్వస్వం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ప్రజా తెలంగాణ.. ఇక్కడ ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన. ప్రజా పాలనలో ప్రజలే మాకు దేవుళ్ళు.. వారి త్యాగాలే మాకు ఆనవాళ్ళు. ఆ ఆనవాళ్ళకు పట్టం కడుతూ మన రాజముద్రను వారి ఆశయాలకు అనుగుణంగా మార్చబోతున్నాం" అని కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది.

కేటీఆర్ కి కౌంటర్...

రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తే ప్రజా ఉద్యమం చేస్తామంటున్న కేటీఆర్ కి కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. "అరబుర్ర డ్రామారావుకు… గుంటూరులో చదివి ఉన్నమతి పోయినట్టుంది అంటూ ఎద్దేవా చేసింది. రాజముద్రని ఎందుకు మారుస్తున్నారో వివరించింది. "తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో త్యాగాలు ఉండాలి తప్ప… రాజ్య భోగాలు కాదు. అణచివేతపై ప్రజల తిరుగుబాటు కనిపించాలి తప్ప… నిజాం నిరంకుశ ఆనవాళ్లు కాదు. రాష్ట్రమంటే రాజ్యమని… అయ్య తర్వాత కొడుకుగా తనకే అధికారం దక్కాలని… భ్రమించే డ్రామారావుకు ఇది ఎప్పటికీ అర్థం కాదు" అని విమర్శించింది కాంగ్రెస్. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాలు ఉండాలా? రాజ్య భోగాలు ఉండాలా? సూటిగా చెప్పాలంటూ కేటీఆర్ ని ప్రశ్నించింది.

తుది రూపుపై సీఎం సమీక్ష...

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబిలీహిల్స్ లోని ఆయన నివాసంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రూపొందిస్తోన్న రాష్ట్ర చిహ్నం నమూనాలను పరిశీలించారు. ఈ సమావేశంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

వైరల్ అవుతోన్న రాష్ట్ర చిహ్నం నమూనాలు...

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తోన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నమూనాలను పరిశీలించారు. దీంతో ఆయన పరిశీలిస్తోన్న నమూనాలు అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read More
Next Story