Alllu Arjun | ‘అల్లు అర్జున్‌పై మాకు కోపం ఎందుకు’
అల్లు అర్జున్ అరెస్ట్ వెనక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందన్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వ నేతలు స్పందించారు. తమకు అంత అవసరం ఎందుకని నిలదీశారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. పుష్ప-2 ప్రీమియర్స్ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కు బన్నీ వచ్చాడు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. ఈనేపథ్యంలో శుక్రవారం సడెన్‌గా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. వెంటనే అల్లు అర్జున్ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అదే సమయంలో హైకోర్టులో.. బన్నీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిగింది. ఈ విచారణలో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే అల్లు అర్జున్ను విడుదల చేయాలని ఉత్తుర్వులు జారీ చేసింది. అయినప్పటికీ రాత్రంతా జైలులోనే ఉంచి ఉదయం 6:45 గంటలకు అల్లు అర్జున్ను పోలీసులు విడుదల చేశారు. దీనంతటికీ వెనక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని నిన్నటి నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. ప్రత్యర్థి రాజకీయ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ పోస్ట్ పెట్టారు. దాంతో కాంగ్రెస్ కావాలనే అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించిందన్న వార్తలు మరింత బలోపేతం అయ్యాయి. కాగా వీటిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క స్పందించారు. తమకు అల్లు అర్జున్ అంటే అసలు కోపం ఎందుకు ఉంటుందని వారు ప్రశ్నించారు.
కోపముంటే అలా చేస్తామా..: పొన్నం
‘‘సినిమాను, కళలను ప్రోత్సహించే ఆలోచనతో తమ ప్రభుత్వం ఉంది. సినిమా వాళ్లపై, ముఖ్యంగా అల్లు అర్జున్‌పై మాకు కోపం ఎందుకు ఉంటుంది. అలా ఉంటే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన దిల్ రాజుకు ఛైర్మన్ పదవి ఎందుకు ఇస్తాం. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మా ప్రభుత్వంపై బురదజల్లి తమ పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీఆర్ఎస్.. అధికారంతో పాటు విజక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోయింది. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోంది. సంబంధం లేని విషయాల్లోకి కూడా రాజకీయాలను లాగి మరీ మా ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతలకు చట్టం పట్ల అవగాహన ఉండాలి. అయినా తొక్కిసలాటలో మహిళ మరణించినప్పుడు మాట్లాడని కేటీఆర్‌కు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. సిరిసిల్లలో చేనేత కార్మికులు మరణించినప్పుడు కేటీఆర్‌పై హత్య కేసులు పెట్టారు. అప్పుడు వారిపై పెడితే ఇప్పుడు మా ప్రభుత్వం పెట్టొచ్చు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ భ్రష్టుపట్టించింది’’ అని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్.
చట్ట ప్రకారమే బన్నీ అరెస్ట్: సీతక్క
‘‘అల్లు అర్జున్.. చట్టం ప్రకారమే జరిగింది. ఆయనంటే మాకేమీ కక్ష కార్పణ్యాలు లేవు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. చిరంజీవి, అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులే. సీఎం రేవంత్ రెడ్డితో బంధుత్వం కూడా ఉంది. అయినా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించారు. అంతేకానీ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మా ప్రభుత్వ జోక్యం ఏమీ లేదు. అన్నీ చట్టాన్ని అనుసరించే జరిగాయి’’ అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల వ్యాఖ్యలు భావ్యం కావు: దానం
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసమంజసంగా ఉన్నాయని అన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు ప్యాన్ వరల్డ్ హీరో. హీరో అల్లు అర్జున్ మా బంధువు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరం. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో విచారం వ్యక్తం చేస్తున్నాను. మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం. అల్లు అర్జున్ జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ల పేర్లును తీసుకెళ్లి మంచిపేరు తెచ్చారు. ప్రభుత్వం అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు’’ అని అన్నారు.