జాబ్ క్యాలెండర్‌పై కాంగ్రెస్, బీజేపీ లొల్లి
x

జాబ్ క్యాలెండర్‌పై కాంగ్రెస్, బీజేపీ లొల్లి

తెలంగాణలో జ్యాబ్ క్యాలెండర్ లొల్లి షురూ అయింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ వ్యవహారంలోనే మాట యుద్ధం కూడా జరుగుతోంది.


తెలంగాణలో జ్యాబ్ క్యాలెండర్ లొల్లి షురూ అయింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ వ్యవహారంలోనే మాట యుద్ధం కూడా జరుగుతోంది. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతను మోసం చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రావడానికి ముందు వరకు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని, సమయానికి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసే జాబ్ కాలెండర్ విడుదల చేస్తామని కబుర్లు చెప్పిన కాంగ్రెస్ తీరా అధికారం రావడంతో ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు వారి పోరాటంతో తాము సహకరిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

నిరుద్యోగులకే పెద్దపీట: రేవంత్

ఈరోజు ప్రజాభవన్‌లో సివిల్స్ ఔత్సాహికులతో నిర్వహించిన ముఖాముఖీలో జాబ్ క్యాలెండర్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల బాధలు తమకు బాగా తెలుసని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అడుగడుగునా సహకరిస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, ఆ దిశగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆరు నెలల్లో ఉద్యోగుల నియామకాలు పూర్తయ్యేలా జాబ్ క్యాలెండర్‌లను రూపొందిస్తామని మాటిచ్చారు. నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని, నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.

రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్‌ను మరిచిపోయిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పి తీరా అధికారం వచ్చిన తర్వాత మొండిచేయి చూపిందని విమర్శించారు.

రాష్ట్రమంతా అవినీతే

‘‘అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంది. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎవరికి తోచినంత, దొరికినంత వారు దోచుకుంటున్నారు. రాష్ట్రమంతటా అవినీతి తాండవిస్తోంది. వందరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి. గతంలో ప్రజల తీర్పును కాలరాస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్.. బీఆర్ఎస్‌లో చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. ఎవరినైతే ప్రజలు వద్దని ఓడించారో వారినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటూ ప్రజల నిర్ణయాన్ని కాలరాస్తోంది’’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

అందుకోసమే బీజేపీ కృషి

బీజేపీ ఎన్నడూ అధికారం కోసం పోరాడలేదని, కేవలం అధికారంలో ఉండి ప్రజల సమ్యలను పట్టించుకోని వారికి ప్రజావాణిని వినిపించడానికే బీజేపీ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. ఈ సందర్బంగానే గ్రూప్ 1 మెయిన్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2లో 783 పోస్టులను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2000కు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 1,365 గ్రూప్3 పోస్టులను మూడు వేలకు పెంచాలన్నారు. ఇచ్చిన హామీ మేరకే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.

Read More
Next Story