Ponnam Prabhakar | ‘బీసీలకు ప్రత్యేక పథకాలు తెస్తున్నాం’
బీసీల గురించి మాట్లాడే హక్కు కూడా బీఆర్ఎస్, కవితకు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పదేళ్ల పాలనలో బీసీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కవిత డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు కూడా బీఆర్ఎస్, కవితకు లేదన్నారు. పదేళ్ల పాలనలో బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత కాలం అసలు బీసీల ఊసైనా ఎత్తారా? ఇప్పుడు వచ్చి బీసీలకు కోసం ఉద్యమిస్తామని కబుర్లు చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. బీసీల కోసం పోరాడతామని బీఆర్ఎస్, కవిత చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లె వేస్తున్నట్లే ఉందని చురకలంటించారు. బీసీ డిక్లరేషన్‌ను డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్సీ కవిత భారీ సమావేశం నిర్వహించారు. అది పూర్తయిన గంటల వ్యవధిలోనే పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది.
‘‘తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీ అధ్యక్ష, కార్యనిర్వహక అధ్యక్ , ప్రతిపక్ష నేత పదవి ఒకటి ఉంచుకొని మిగిలినవి బలహీన వర్గాలకు ఇవ్వండి. అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. నేను హక్కుదారు అని చెప్పిన ఈటెల రాజేందర్‌ను బయటకు పంపించారు. 2004-14 మధ్య పిల్లల మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లించే వాళ్ళం. మీరు బకాయిలు చేసి పోయారు.. పిల్లలకూ నాణ్యమైన ఆహారం అందించలేదు. మేము మెస్ చార్జీలు పెంచాం. మా ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే పార్టీ అధ్యక్షుడు మరో వర్గం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా.. మీ నాయకత్వంలో పోరాటం జరుగుతుంది. ఈరోజు ఇందిరాపార్కు సభ లో జనం లేక పాటలు పాడే ఆయన చప్పట్ల కొట్టుర్రి అని బతిమిలాడుతూ ఉన్నాడు’’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
‘‘ఈరోజు మీకు బీసీలు జ్ఞాపకం వచ్చారు అంటే బీసీల శక్తీ మీకు తెలిసింది. మీరు సమగ్ర సర్వే చేశారు. రిపోర్టు బయటపెట్టి న్యాయం చేసి ఉంటే బీసీలు గుర్తించేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా.. ఆనాడు కవిత గొంతు ఎక్కడికి పోయింది. జయశంకర్, దేశిని చిన్న మల్లయ్య, శ్రీకాంత్ చారి తల్లిని అవమాణించినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు. ప్రభుత్వం తరుపున బలహీన వర్గాల కోసం ఏమైనా చేశారా. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.. ప్రతి కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు కేటాయించాం. బీసీల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తున్నాం’’ అని వెల్లడించారు.
‘‘ప్రజా భవన్‌కు జ్యోతి బాపులె భవన్ గా మర్చుకున్నాం. సావిత్రి భాయ్ పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నాం. బలహీన వర్గాలకు న్యాయం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే. 10 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు ఏం చేశారు. కుల సర్వే జరుగుతుంది..పబ్లిక్ డొమైన్‌లో పెట్టి నిపుణులతో చర్చిస్తాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా బీసీల హామీలు అన్ని అమలు చేస్తం. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎవరెంతో వారికంత న్యాయం చేస్తం. అవసరమైతే షెడ్యూల్ మార్చి న్యాయం చేస్తం. కాంగ్రెస్ కుల గణన చేస్తుంది..మెస్ చార్జీలు పెంచింది’’ అని పునరుద్ఘాటించారు.
‘‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు కడుతుంది. బలహీన వర్గాలకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్ఎస్‌కి పుట్టగతులు ఉండవని భయం పట్టుకుంది. ఏదో ఒక నినాదంతో బతుకమ్మ, జాగృతి ఏదో ఒక అజెండా పట్టుకొని మార్కెట్‌లో ఉండడం తప్ప 10 ఏళ్లలో బలహీన వర్గాల గురించి ఎందుకు మాట్లాడలేదు. సంస్థగత పదవులకు భాగస్వామ్యం చేసి రాజకీయ పదవులకు అవకాశాలునివ్వండి. కాంగ్రెస్ పార్టీ విధానం మమ్మల్ని నడిపిస్తుంది. ఒకరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు మన పార్టీ ఎజెండా ముఖ్యం అని ముఖ్యమంత్రి చెప్తుంటారు. మా నాయకుడు రాహుల్ గాంధీ 50 శాతం రిజర్వేషన్లు మించి అయినా సరే న్యాయం చేస్తామని చెప్పారు’’ అని వెల్లడించారు.