
కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్ సిద్ధాంతాలు, పనితీరు అంతలా నచ్చకపోతే అసలు ఆయన కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారని క్యాడర్ ప్రశ్నిస్తోంది.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. పటాన్ చెరు కాంగ్రెస్‌లో మహిపాల్ అంశంపై తీవ్ర ఉద్రిక్తత కూడా జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలంతా మహిపాల్‌ను తిరస్కరించారు. బయట పారటీ నుంచి వచ్చిన ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేతలు సహించలేదు. దీంతో ఇటీవల పటాన్ చెరులో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మహిపాల్ రెడ్డి అనుచరులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియామకం తర్వాత పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రతి రోజూ పార్టీ బలోపేతం అంశంపై పార్టీ నేతలతో ఆమె సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. ఈక్రమంలోనే శుక్రవారం నిర్వహించిన సమావేశంలో.. మహిపాల్ రెడ్డిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని పార్టీ క్యాడర్ నిర్ణయించుకుంది. అతి త్వరలోనే ఈ ఫిర్యాదును పార్టీ పెద్దలకు అందించనుంది క్యాడర్. దీంతో కాంగ్రెస్‌కు మహిపాల్ పెద్ద తలపోటుగా మారారు. మహిపాల్ అంశం పంటికింద రాయిలా మారి.. పటాన్‌చెరుకు సంబంధించిన ఏ అంశం కొరుకుడు పడటం లేదు.
ఇటీవల మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు ఉ‘న్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ సిద్ధాంతాలు, పనితీరు అంతలా నచ్చకపోతే అసలు ఆయన కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారని క్యాడర్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌ను బద్నాం చేయడానికి మహిపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా తనది ఒరిజినల్ వీడియో కాదని, కొందరు గిట్టని వారు కావాలనే తన మొఖంతో వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. మరి ఈ అంశంపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. రెండు రోజుల క్రితం గుమ్మడిదల మండలం ప్యారానగర్ డంప్‌యార్డ్ విషయంలో గ్రామస్తులు మహిపాల్ దగ్గరకు వచ్చారు.
మీరు అధికార కాంగ్రెస్‌లో ఉన్నారు కదా.. మా సమస్యను తీర్చండి.. డంప్‌యార్డ్ ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అని గ్రామస్తులు కోరారు. దానిపై స్పందించిన మహిపాల్.. తాను కాంగ్రెస్ పార్టీ కాదని.. పక్కా బీఆర్ఎస్ అని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరుషపదజాలంతో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.