'కాళోజీ అవార్డు'.. అందెశ్రీ అధ్యక్షతన కమిటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా పద్మవిభూషణ్ ప్రజాకవి కాళోజీ జయంతి రోజున 'తెలంగాణ భాషా దినోత్సవం' జరుపుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా పద్మవిభూషణ్ ప్రజాకవి కాళోజీ జయంతి రోజున 'తెలంగాణ భాషా దినోత్సవం' జరుపుతోంది. ఆరోజున అర్హులైన సాహితీవేత్తకు 'కాళోజీ నారాయణరావు అవార్డును' కూడా అందిస్తోంది. తెలంగాణ భాషకి, సంస్కృతికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. అయితే ఈ ఏడాది కూడా అర్హులైన వారికి అవార్డు ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
ప్రముఖ కవి అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. అందెశ్రీ అధ్యక్షతన కమిటీ సభ్యులు ఏనుగు నర్సింహారెడ్డి, సంగనభట్ల నర్సయ్య, పొట్లపల్లి శ్రీనివాస్, మెంబర్ కన్వీనర్ మామిడి హరికృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. సాహితీవేత్త ఎంపికపై చర్చలు జరిపారు. ఈ అవార్డుకు దాదాపు 40 మంది సాహితీవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదును అందజేయనున్నారు.
కాగా, గతేడాది ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు, జయరాజ్ కు ఈ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ కాళోజీ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు అప్పటి సీఎం కేసీఆర్ కవి జయరాజ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాళోజీ జయంతి సందర్భంగా...
2015 నుంచి ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట 'కాళోజీ నారాయణరావు అవార్డు' ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పురస్కారాన్ని కాళోజి నారాయణరావు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 9న అర్హులైన వారికి ఇస్తున్నారు. తెలంగాణ భాషకు, సంస్కృతికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజును 'తెలంగాణ భాషా దినోత్సవం' గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాళోజీ పురస్కారం కింద అవార్డు, మొమెంటో, రూ.1,01,116 నగదు బహుమతిని అందిస్తారు. ఈ ఏడాది కూడా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డుల కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. సాహితీవేత్త ఎంపిక కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. త్వరలోనే అవార్డు గ్రహీతని ఎంపిక చేసి, ప్రకటించే అవకాశం ఉంది.